సంక్షోభ నివారణకే 'పెద్దపీట' | CEOs and chief executives of companies in the country comments on lockdown | Sakshi
Sakshi News home page

సంక్షోభ నివారణకే 'పెద్దపీట'

Published Thu, Apr 30 2020 4:20 AM | Last Updated on Thu, Apr 30 2020 4:20 AM

CEOs and chief executives of companies in the country comments on lockdown - Sakshi

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో తలెత్తిన సంక్షోభ నివారణకే అగ్ర ప్రాధాన్యత ఇస్తామని దేశంలోని కంపెనీల సీఈవోలు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు స్పష్టం చేశారు. దేశంలోని 200 కంపెనీల సీఈవోలు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను భాగస్వామ్యం చేస్తూ ‘ఎగ్జిక్యూటివ్‌ యాక్సెస్‌ ఇండియా’ సంస్థ తాజాగా సర్వే నిర్వహించింది. కరోనా ప్రభావం కంపెనీల భవిష్యత్‌ కార్యకలాపాలపై ఎలా ఉంటుందని భావిస్తున్నారనేది తెలుసుకుంది. ఇతర దేశాల కంటే భారత మార్కెట్‌ త్వరగా కోలుకుని పూర్వ స్థితికి చేరుకుంటుందన్న విశ్వాసాన్ని సీఈవోలు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు వ్యక్తం చేశారు. సర్వేలో ఏం తేలిందంటే..

ప్రణాళికలకు ప్రాధాన్యం
► సంక్షోభ నివారణ ప్రణాళికలకే కంపెనీలు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాయి. 65 శాతం మంది సీఈవోలు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఇదే విషయాన్ని చెప్పారు. 
లాక్‌డౌన్‌ అనంతరం పని విధానంలో తీసుకు రావాల్సిన మార్పులపై ఆలోచన చేస్తున్నామని 59 శాతం మంది చెప్పారు. వర్క్‌ ఫ్రం హోం, అందుకోసం వర్చ్యువల్‌ టీమ్‌ల ఏర్పాటు తదితర ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
► పని విధానంలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకోవడంపై దృష్టి సారించినట్లు 57 శాతం మంది చెప్పారు. 
► వినియోగదారుల పరిధిని విస్తృతం చేసుకోవడానికి 48% మంది మొగ్గు చూపారు. ఆ దిశగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

వ్యాపార విధానం మారుతుంది
► సంప్రదాయ వ్యాపార వ్యవహారాలకు భిన్నంగా కార్యకలాపాల్లో మార్పులు తీసుకొస్తామని 41 శాతం మంది, ఉత్పత్తుల పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తామని 30 శాతం మంది చెప్పారు. 
► కొన్ని ఆటుపోట్లు తలెత్తినా.. లాక్‌డౌన్‌కు ముందున్న విధానంలోనే వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతాయని కేవలం 8 % మంది చెప్పారు. 
► సంక్షోభం నుంచి కోలుకోడానికి ఆరు నెలలు పడుతుందని 35 శాతం మంది అంచనా వేయగా.. తొమ్మిది నెలల సమయం పడుతుందని 65 శాతం మంది భావిస్తున్నారు. 
► ప్రస్తుత సంక్షోభం నుంచి మన దేశం ఇతర దేశాలకంటే త్వరగా కోలుకుంటుందని సీఈవోలు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement