సాక్షి, న్యూఢిల్లీ : దేశ వాసుల ప్రాణాలపై కరోనా వైరస్ ఏమాత్రం కనికరం చూపడంలేదు. వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నా.. వ్యాప్తి మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. దేశంలో ఏమూలనూ వదలకుండా కాశీ నుంచి కన్యాకుమారి వరకు కరోనా వ్యాప్తించింది. ఇప్పటి వరకు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 60వేల చేరువలో ఉన్నాయి. మరోవైపు మరణాల సంఖ్య 1981కి పెరిగింది. దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 50 వరకు మూడు రాష్ట్రాల్లోనే ఉండటం తీవ్ర ఆందోళనకరంగా ఉంది. దేశంలో ఏయే రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్న అంశంపై పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. కరోనా కేసులు అత్యధికంగా పది రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి.
దేశంలో కరోనా అత్యంత ప్రభావం గల తొలి పది రాష్ట్రాలు...
1) మహారాష్ట్ర : దేశంలో అత్యంత దారుణమైన పరిస్థితిని మహారాష్ట్ర ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. ఇక ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ధారావిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 19063 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 737 మంది మృత్యువాత పడ్డారు.
2) గుజరాత్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోనూ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7402 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ కారణంగా 449 మంది మరణించారు. కరోనా కేసులు నమోదులో దేశంలో గుజరాత్ రెండోస్థానంలో ఉంది. (ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు)
3) ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ కరోనాతో అల్లాడుతోంది. మొన్నటి వరకు తీవ్రమైన వాయు కాలుష్యంతో తల్లడిల్లిన హస్తిన వాసులను కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిజాముద్దీన్‌లో నిర్వహించిన మత ప్రార్థనలను ఢిల్లీతో పాటు యావత్ దేశాన్ని వణికించాయి. ఇక ఢిల్లీ సర్కార్ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 6318 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 66 మంది ప్రాణాలు ఇడిచారు. కేసుల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
4) తమిళనాడు : దేశంలో కరోనా కేసు నమోదైన మొదటి నెల వరకూ సురక్షితంగా ఉన్న తమిళనాడును తబ్లిగీ మత ప్రార్థనాలను చుట్టుమట్టాయి. దేశంలో తబ్లిగీలను ద్వారా అత్యంత ఎక్కువగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రంలో 600 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6009కి చేరింది. వైరస్ కారణంగా ఇప్పటి వరకు 40 మంది చనిపోయారు.
5) రాజస్తాన్ : ఇక రాజస్తాన్‌లోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3579 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అయితే మరణాల శాతం కాస్త ఎక్కువగా ఉండటం ఆందోళనకర విషయం. వ్యాధి కారణంగా ఇప్పటి వరకు 101 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు కోటాలో దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులను విడదల వారిగా స్వస్థలాలకు పంపించారు.
6) మధ్యప్రదేశ్ : మొదట్లో వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నా.. ఏప్రిల్ మాసంలో మధ్యప్రదేశ్‌లో తీవ్రత ఎక్కువైంది. వైద్య అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3341. 200 మంది వైరస్ కారణంగా మరణించారు. బాధితులకు మెరగైన వైద్యం అందిస్తున్నప్పటికీ మృతుల సంఖ్యను మాత్రం కట్టడి చేయలేకపోతోంది. అయితే భోపాల్ గ్యాస్ లీకేజీ బాధితుల్లో ఇటీవల కొంతమంది కరోనా బారినపడి మరణించడం కలకలం రేపింది. మొత్తం 15 మంది భోపాల్ విషవాయువు బాధితులు చనిపోయారు.
7) ఉత్తర ప్రదేశ్ : దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో కరోనా ప్రభావం కాస్త తక్కువగానే ఉంది. ఎక్కువ మంది జనాభా ఉన్నప్పటికీ కరోనా కేసులు మాత్రం కొంతమేర అదుపులోనే ఉండటం ప్రభుత్వానికి ఊరటినిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3214 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 66 మంది కన్నుమూశారు.
8) ఆంధ్రప్రదేశ్ : దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది. ఇప్పటివరకు 1,65,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇక మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1930కి చేరగా.. మరణాల సంఖ్య 44కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 999 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో కరోనా పాజిటివ్ రేటు కూడా 1.17 శాతానికి తగ్గింది.
9) పశ్చిమ బెంగాల్ : కరోనా కేసుల సంఖ్య విషయంలో తప్పుడు లెక్కలను చూపిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాష్ట్రం మాత్రం ఇప్పటి వరకు 1678 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 160 మంది మరణించారు.
10) పంజాబ్ : లాక్‌డౌన్‌ను అత్యంత పటిష్టంగా అమలు చేస్తోన్న పంజాబ్‌లోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1731 పాజిటి్ కేసులు నమోదు కాగా.. 29 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment