సాక్షి, ముంబై: నివాస సొసైటీలు, వాణిజ్య, వ్యాపార సంస్థల భవనాల్లో పనిచేసే లిఫ్టులు, ట్రాన్స్‌ఫార్మర్లు చాలావరకు స్తంభించిపోయాయి. అయితే వీటి నిర్వహణ పనులు చూసుకునే సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్ కారణంగా ఈ ఛాయలకు రావడం లేదు. దీంతో ఏదైనా ప్రమాదం చోటుచేసుకుని ప్రాణ, ఆస్తి నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న తెరమీదకు వచ్చింది.
బ్రేక్‌ది చైన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్‌తో కిరాణ, పాలు, మెడికల్ తదితర షాపులు మినహా ఇతర ఎలాంటి షాపులు తెరిచేందుకు అనుమతి లేకపోవడంతో వాహన యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ముఖ్యంగా మోటార్ మెకానిక్‌లు, నివాస, వాణిజ్య భవనాల్లో లిఫ్టులు, విద్యుత్ పరికరాల నిర్వహణ, సర్వీసింగ్ పనులు చూసుకునే సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం జరిగే ఆస్కారముంది.
ప్రాణనష్టం జరిగితే..
బీఎంసీ, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా లిఫ్టులు నిరంతరంగా పనిచేస్తాయి. కరోనా, ఇతర రోగులు, వారి బంధువుల రాకపోకలతో ఈ లిఫ్టులు బిజీగా ఉంటాయి. దీంతో వీటిపై కూడా అదనపు భారం పడుతోంది. నిర్ణీత సమయంలో వీటి నిర్వహణ, సర్వీసింగ్ పనులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, కాంట్రాక్టు తీసుకున్న కంపెనీ సిబ్బంది లాక్‌డౌన్ కారణంగా శివారు ప్రాంతాల నుంచి రాలేకపోతున్నారు.
ప్రమాదవశాత్తు లేదా సాంకేతిక సమస్యతో రెండు అంతస్తుల మధ్య లిప్టు నిలిచిపోతే అందులో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటి ? వారిని ఎవరు బయటకు తీస్తారు..? మరమ్మతులు ఎవరు చేపడతారనే పలు సొసైటీలు నిలదీస్తున్నాయి. ఎదైనా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం అయితే ఎవ రు బాధ్యులని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు బాధ్యత మీదంటే మీదని అందరు చేతులెతేŠాత్స్తరు. కానీ, జరిగిన ప్రాణ నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. దీంతో టెక్నిషియన్లు, సాంకేతిక సిబ్బందికి లాక్‌డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపునివ్వాలని కోరుతున్నారు.
మెకానిక్ షాపులు లేక..
లాక్‌డౌన్ కాలంలో అత్యవసరం మినహా ఇతర షాపులన్ని మూసివేయాలని ఆదేశాలున్నాయి. దీంతో ప్రైవేట్ వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిది. కానీ, అంబులెన్స్, పోలీసు వ్యాన్లు, ఆస్పత్రి వాహనాలు, ఆక్సిజన్, వైద్య పరికరాలు తరలించే ఇలా వివిధ రకాల మెడికల్ వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. వీటితోపాటు ట్యాక్సీ, ఆటోలు, ఓలా, ఉబేర్ లాంటి వాహనాలు కూడా తిరుగుతున్నాయి. గత పక్షం రోజులుగా మోటార్ గ్యారేజీలు, పంక్చర్ తీసే షాపులు, వాహనాల విడి భాగాలు లభించే ఆటో మోబైల్ షాపులన్ని మూసే ఉంటున్నాయి. దీంతో ప్రైవేట్ కార్లు, ట్యాక్సీ, ఆటోలు, యాప్ ఆధారిత ఓలా, ఉబేర్ తదితర వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విడి భాగాలు మార్కెట్లో లభించక, టైరు పంక్చర్ తీసే కార్మికులు లేక మరమ్మతుల నిమిత్తం వాహనాలన్నీ రోడ్లపై అలాగే పడి ఉంటున్నాయి. పోలీసులు గ్యారేజ్‌లను కూడా తెరవనివ్వడం లేదు.
దొంగ చాటుగా ఎవరైనా గ్యారేజీలు తీస్తే పోలీసులు వచ్చి మూసివేయిస్తున్నారు. లేదంటే జరిమానా విధిస్తున్నారు. గత పక్షం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. అనేక చోట్ల రోడ్లపై వాహనాలు మరమ్మతుల నిమిత్తం నిలిచిపోయాయి. లోకల్ రైళ్లలో అత్యవసర విభాగాలలో పనిచేసే ఉద్యోగులకు మినహా సామాన్యులకు అనుమతి లేదు. దీంతో సామాన్యులు, ప్రైవేటు కార్యాలయాల్లో, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ట్యాక్సీలు, ఆటోలను, ఓలా, ఉబేర్ లాంటి ప్రజా రవాణ వ్యవస్థపై ఆధారపడుతున్నారు.
కానీ, నిర్వహణ, మరమ్మతు పనులు చూసే గ్యారేజీలు, పంక్చర్ తీసే షాపులు మూసే ఉంటున్నాయి. కనీసం వాహనాల విడి భాగాలు విక్రయించే ఆటో మొబైల్ షాపులు కూడా తెరిచి ఉండటం లేదు. వాహనాలకు ప్రధానంగా అవసరమైన ఇంజిన్ అయిల్, బ్రేక్ ఆయిల్, కూలంట్ లభించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలో నగర రహదారులపై ట్యాక్సీ, ఆటోలు కనుమరుగు కావడం ఖాయమని వాహన యజమానులు అంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక వాహన యజమానులు తలలు పట్టుకుంటున్నారు.
చదవండి: ఆందోళన చెందొద్దు.. ఆక్సిజన్‌కు కొరత లేదు
Comments
Please login to add a commentAdd a comment