17 రోజుల పసికందుతో బాలింత కాలినడక | Mother Carries 17 Day Old Baby Walk From Mumbai Home Lockdown | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌: పసికందుతో బాలింత కాలినడక..

Published Thu, May 7 2020 4:57 PM | Last Updated on Thu, May 7 2020 7:13 PM

Mother Carries 17 Day Old Baby Walk From Mumbai Home Lockdown - Sakshi

ముంబై: స్వస్థలానికి వెళ్లేందుకు పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడంతో ఓ బాలింత కఠిన నిర్ణయం తీసుకుంది. అద్దెకారులో సొంతూరికి వెళ్తానని పెట్టుకున్న అర్జీని నిరాకరించడంతో కాలినడక ప్రారంభించింది. 17 రోజుల పసికందును భుజాన వేసుకుని.. ఇంటికి బయల్దేరింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. విదర్భ తూర్పు ప్రాంతంలోని వశీంకు చెందిన ఓ మహిళ 17 రోజుల క్రితం కాన్పు కోసం ముంబై ఆస్పత్రిలో చేరింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో తల్లీబిడ్డలకు పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. దీంతో ఇంటికి తిరిగి వెళ్లేందుకు వీలుగా కారును అద్దెకు తీసుకునేందుకు అనుమతినివ్వాలని పోలీసులను కోరింది. అయితే ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీంతో చేసేదేమీలేక కాలినడకన 500 కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధమైందని ఓ జాతీయ మీడియా వెల్లడించింది.(షాకింగ్‌: కరోనా పేషెంట్ల పక్కనే శవాలు)

ఈ క్రమంలో ఎన్నో ఊళ్లు దాటిన ఆమె.. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికమవడం, తన దగ్గరున్న తినుబండారాలు అయిపోవడంతో తనతో పాటు ప్రయాణిస్తున్న ఇతర వలస కార్మికులను అర్థిస్తోంది. అయితే ప్రస్తుతం ఆమె వెంట కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా లేదా అన్న విషయం మాత్రం తెలియరాలేదు. కాగా కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. (వలస కార్మికులు: రైళ్లను రద్దు చేసిన కర్ణాటక!)

అంతేగాక పలు రాష్ట్రాలు ప్రత్యేక పాసులు జారీ చేసి.. తమ రాష్ట్రంలో చిక్కుకుపోయిన వాళ్లను సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ అత్యవసర ప్రయాణాలకు అనుమతినిస్తామంటూ ముంబై పోలీసులు ఇటీవల ప్రకటన చేశారు. అయితే సదరు బాలింత అప్లికేషన్‌ ఎందుకు తిరస్కరించారో మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. ఇక లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినప్పటికీ వలస కార్మికుల కష్టాలు మాత్రం తీరడం లేదు. బుధవారం 20 మంది బృందం కాలినడకన ఘన్సోలీ నుంచి బుల్దానాకు నడక ప్రారంభించారు. వీరిలో ఓ గర్భవతి కూడా ఉండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement