సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి వాణిజ్య రాజధానిగా ప్రసిద్ధి చెందిన ముంబై నగరంలో ప్రజలకు అతి ముఖ్య ప్రయాణ సాధనం సబర్బన్ రైళ్లు. పశ్చిమ రైల్వే ఆధ్వర్యంలో నడిచే ఈ రైళ్లలో ప్రతి కోచ్‌కు 72 సీట్లు ఉంటాయి. అంతే సంఖ్యలో ప్రయాణికులు నిలబడేందుకు వీలుగా రైలు కోచ్‌లను డిజైన్ చేశారు. అంటే, ఒక్క కోచ్‌లో దాదాపు 150 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. వాస్తవానికి రద్దీ టైమ్‌లో ఒక్కో కోచ్‌లో 300 నుంచి 350 మంది ప్రయాణిస్తుంటారు. మరో రకంగా చెప్పాలంటే బెంగుళూరులో ప్రతి చదరపు మీటరుకు నాలుగు నుంచి ఆరుగురు, డిల్లీలో ఐదు నుంచి ఏడుగురు ప్రయాణిస్తుంటే ముంబైలో ప్రతి చదరపు మీటరుకు 14 నుంచి 16 మంది ప్రయాణిస్తుంటారు. అంటే రైళ్లు ఊపిరి పీల్చుకోనంత కిక్కిర్సి ఉంటాయి. ముంబైలో ప్రతి గంటకు 20 రైళ్లు నడుస్తాయి. ఒక్కో రైలుకు 12 కోచ్‌లు, కోచ్‌కు దాదాపు 300 మంది ప్రయాణిస్తారనుకుంటే గంటకు 72000 వేల మంది ప్రయాణిస్తారు.
ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా ప్రస్తుతం ఈ రైళ్లను రద్దు చేశారు. మున్ముందు ఆంక్షలను ఎత్తివేసి రైళ్లను పునరుద్ధరిస్తే పరిస్థితి ఏమిటన్నదే ఇక్కడ ప్రశ్న. వైరస్ ప్రభావం నుంచి పూర్తిగా బయట పడాలంటే లాక్‌డౌన్ ఎత్తివేశాక కూడా దాదాపు రెండేళ్లపాటు సామాజిక దూరం పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ లెక్కన 74 సీట్లు కలిగిన ముంబై రైలు కోచ్‌లో కేవలం 50 ప్రయాణికులను మాత్రమే అనుమతించాల్సి ఉంటుంది. ఫ్లాట్ ఫారమ్‌లపై రద్దీని నివారించడానికి గంటకు 20 రైళ్లను నడిపే చోట ఇక 12 రైళ్లను మాత్రమే నడపాల్సి ఉంటుంది. అంటే, 12 రైళ్లు, 12 కోచ్‌లు, కోచ్‌కు 50 మంది అనుకుంటే గంటకు 7,200 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించగలరు.
రద్దీ సమయంలో ప్రయాణికులు వెళ్లిన సామర్థ్యంలో కేవలం పది శాతం రైళ్లను మాత్రమే పద్ధతిగా నడిపే అవకాశం ఉంది. మరీ మిగతా ప్రయాణికులను అంటే మిగతా 90 శాతం భారాన్ని బస్సులు, ప్రైవేటు వాహనాలు పంచుకోవాల్సి ఉంటుంది. అది సాధ్యమేనా? ఎక్కువ మంది రైళ్లలో స్టాప్‌లు తగ్గించి ప్రజలను సైకిళ్ల వైపు మళ్లించినట్లయితే కొంత ప్రయోజనం ఉంటుందని నిపుణలు చెబుతున్నారు. అప్పుడు ప్రయాణికులు సైకిళ్లపై ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల దూరం వరకు వెళ్లాల్సి ఉంటుంది. అది ఎంతవరకు సాధ్యం? ప్రత్యామ్నాయాలను పరిశీలించకుండా లాక్‌డౌన్ ఎత్తివేసినట్లయితే వైరస్ ఒకరి నుంచి వేల మందికి అంటుకునే ఆస్కారం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment