సాక్షి ముంబై: మహారాష్ట్రలో డెల్లా ప్లస్ వేరియంట్ కేసులుపెరుగుతుండటం, థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ ఆంక్షలను కఠినం చేశారు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా రూపొందించిన ఐదు దశల్లో మొదటి రెండు దశలను రద్దు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇకపై అన్ని జిల్లాల్లో మూడో దశలో విధించే ఆంక్షలు అమలు కానున్నాయి. దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకే తెరిచి ఉంచనున్నారు. అనంతరం రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు కానుంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆంక్షలు జూన్ 28వ తేదీ సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. దీంతో కరోనా కేసులు తగ్గి మొదటి, రెండవ దశకు చేరుకున్న జిల్లాలన్నింటిలో మరోసారి ఆంక్షలు కఠినం కానున్నాయి.
డెల్టా ప్లస్‌తో ఆందోళన..
మహారాష్ట్రలో సెకండ్‌వేవ్‌లో హడలెత్తించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుతుందని భావించారు. దీంతో తగ్గుతున్న కరోనా తీవ్రతను, ముఖ్యంగా పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని 5 దశల్లో (ఐదు లెవల్స్)గా విభజించి లాక్‌డౌన్ నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించారు. దీంతో అతి తక్కువగా కరోనా కేసులున్న జిల్లాలను మొదటి దశలో చేర్చి అనేక జిల్లాల్లో అన్‌లాక్ చేశారు.
మరికొన్నింటిని రెండు, మూడు, నాలుగు, అయిదు దశలలో ఉన్న జిల్లాల్లో ఆ దశలకు కోసం రూపొందించిన మార్గద్శకాల మేరకు ఆంక్షలను సడలించారు. అయితే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతుండటం, డెల్టా ప్లస్ వేరియంట్‌తో ఒకరి మృతి చెందడం, థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయన్న నేపథ్యంలో రాష్ట్రం అప్రమత్తమైంది. డెల్టా ప్లస్ వేరియంట్‌తోపాటు థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో సడలించిన ఆంక్షలను మళ్లీ కఠినం చేశారు. ఇకపై మొదటి, రెండో దశలో ఉన్న జిల్లాలన్నింటిలో కూడా 3వ దశలో విధించే ఆంక్షలు కొనసాగించనున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో సోమవారం నుంచి మరోసారి సాయంత్రం 4 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతించనున్నారు. ఈ ఆంక్షలు కనీసం 15 రోజుల వరకు ఈ ఆంక్షలు కొనసాగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అనంతరం పరిస్థితులను బట్టి ఆంక్షలను కఠినతరం చేయడమా,.? లేదా సడలించడమా.?? అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
శని, ఆదివారాల్లో నిత్యవసర షాపులకే అనుమతి..
రాష్ట్రంలో షాపులు సాయంత్రం 4 గంటల వరకే తెరిచేందుకు అనుమతించనున్నారు. నిత్యవసరాలు, అత్యవసర సేవల వస్తువులు విక్రయించే షాపులకు శని, ఆదివారాలతోపాటు ప్రతి రోజు 4 గంటల వరకు తెరిచేందుకు అనుమతించారు. అయితే ఈ నూతన మార్గదర్శకాలనుసారం నిత్యవసరాలు కాని, షాపులను మాత్రం శని, ఆదివారాలలో మూసివేయాల్సి రానుంది. మరోవైపు అక్కడి పరిస్థితులను బట్టి స్థానిక అధికారులు ఆంక్షలను మరింత కఠినం కూడా చేసేందుకు వీలుంంది. రెస్టారెంట్లు, హోటళ్లను కూడా సాయంత్రం 4 గంటల వరకు 50 శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతించారు.
అయితే వీకెండ్‌లో మాత్రం తెరిచేందుకు అనుమతించకపోయినప్పటికీ హోమ్ డెలివరీ సేవలు అందించేందుకు అనుమతిచ్చారు. మాల్స్, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు మాత్రం మూసి ఉండనున్నాయి. ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లా ప్రస్తుతం మొదటి దశలో ఉండటంతో గతంలో ఆంక్షలు ఎత్తివేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గర్శకాలనుసారం మరోసారి థానే జిల్లా మూడో దశకి మారనున్న నేపథ్యంలో జిల్లాలో ఆంక్షలు కఠినతరం చేయనున్నట్టు థానే జిల్లా అధికారి రాజేష్ నార్వేకర్ మీడియాకు తెలిపారు. దీంతో థానే జిల్లాల్లోని థానే, నవీముంబై, కళ్యాణ్ డోంబివలి మొదలగు ప్రముఖ నగరాల్లోని సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్ పూర్తిగా మూసి వేయనున్నారు. అదేవిధంగా దుకాణాలు నాలుగు గంటల వరకు మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపారు.
మూడో దశలో 33 జిల్లాలు
ముంబై, పుణే, థాణేలతోపాటు మొత్తం 33 జిల్లాల్లో మూడో దశ ఆంక్షలు అమలు కానున్నాయి. రాష్ట్రంలోని గత వారం నుంచి 25 జిల్లాల్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో మొదటి దశలోకి చేర్చి ఆంక్షలన్నింటినీ ఎత్తివేశారు. మరోవైపు ఎనిమిది జిల్లాలు 3వ దశలో ఉన్నాయి. అయితే మొదటి 2 దశలను రద్దు చేయడంతో సోమవారం నుంచి 3వ దశలోకి చేర్చారు. మరోవైపు 4వ దశలో రాయిగడ్, రత్నగిరి, కోల్హాపూర్ మొదలగు 3 జిల్లాలుండగా 5వ దశలో ఒక్క జిల్లా కూడా లేదు. అయితే రాబోయే రోజుల్లో ఈ దశలలో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి.
ముంబై సిటీ, ముంబై సబర్బన్, థానే, పుణే, నాసిక్, షోలాపూర్, నాగ్‌పూర్, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, సాంగ్లీ, సాతారా, పాల్ఘర్, బీడ్, సింధుదుర్గ, అహ్మద్‌నగర్, అకోలా, గడ్చిరోలి, అమరావతి, భండారా, బుల్డానా, చంద్రాపూర్, థులే, గోండియా. హింగోలి, జల్‌గావ్, జాల్నా, లాతూర్, నాగపూర్, నాందేడ్, నందుర్బార్, పర్భణీ, వర్దా, వాశీం, యావత్మాల్ జిల్లాలు మూడో దశలో ఉన్నాయి. రాయిగడ్, రత్నగిరి, కోల్హపూర్ జిల్లాలు నాలుగో దశలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment