వై ఎస్ జగన్ : దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ సమీక్ష | YS Jagan review meeting on Disha Act enforcement - Sakshi
Sakshi News home page

దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ సమీక్ష

Published Thu, Dec 26 2019 2:42 PM | Last Updated on Thu, Dec 26 2019 5:22 PM

CM YS Jagan Review Meeting Over AP Disha Act - Sakshi

సాక్షి, తాడేపల్లి: దిశ చట్టం పగడ్బందీ అమలుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 13 కోర్టులకు అవసరమైన బడ్జెట్‌ను కూడా వెంటనే కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలను అదుపు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తీసుకువచ్చిన దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం, డీజీపీ గౌతం సవాంగ్ తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. న్యాయపరంగా, పోలీసు పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న విషయాలపై ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రస్తుతం ఉన్న ఫోరెన్సిక్‌ విభాగాన్ని రెట్టింపు చేయడానికి, మరో రెండు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడానికి సీఎం అంగీకారం తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో వైజాగ్, తిరుపతిల్లో కొత్తగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా దిశ చట్టం అమలులో భాగంగా ప్రతీ కోర్టుకు సుమారు రూ. 2 కోట్లు అవసరం అవుతుందని అధికారులు పేర్కొనడంతో.. ఈ మేరకు వారం రోజుల్లోగా అవసరమైన డబ్బును డిపాజిట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. (ప్రతిష్టాత్మక ‘దిశ’ యాక్ట్‌లోని ముఖ్యాంశాలివే..)

నోటిఫికేషన్‌ జారీ చేయండి...
ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లలో 176 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని డీజీపీ గౌతం సవాంగ్‌ సీఎం జగన్‌ దృష్టికి తీసుకురాగా... జనవరి 1న నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా జిల్లాల్లో ఉన్న మహిళా పోలీస్‌ స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేయడానికి ప్రతిపాదనలు చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. దిశ చట్టం అమలుకు ఏం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 18 మహిళా పోలీస్‌ స్టేషన్లలో 1 డీఎస్పీ, ముగ్గురు ఎస్సైలను, నలుగురు సహాయక సిబ్బందిని ఏర్పాటు చేయాలంటూ డీజీపీ ప్రతిపాదించగా... సీఎం వెంటనే అంగీకారం తెలిపారు.

అదే విధంగా ఈ పోలీస్‌ స్టేషన్లలో మౌలిక సదుపాయలు, ఇతరత్రా అవసరాల కోసం నిధుల మంజూరుకు అంగీకరించారు. ఈ సందర్భంగా... 13 పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకాన్ని వీలైనంత త్వరలో పూర్తిచేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఉన్న వన్‌ స్టాప్‌ సెంటర్లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. వన్‌స్టాప్‌ సెంటర్లలో ఇప్పుడున్న సిబ్బందితో పాటు ఒక మహిళా ఎస్‌ఐని నియమించడానికి సీఎం అంగీకారం తెలిపారు.

కాల్‌సెంటర్, యాప్, వెబ్‌సైట్లపై సీఎం సమీక్ష
వేధింపులకు గురవుతున్న మహిళలు కాల్‌ చేయాల్సిన కాల్‌సెంటర్, యాప్, వెబ్‌సైట్లపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా సురక్ష స్పందన యాప్‌ తయారు చేశామని డీజీపీ ముఖ్యమంత్రికి తెలిపారు. దీని ద్వారా మొత్తం 86 రకాల సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో ఈ యాప్‌ను ప్రారంభిస్తామని.. 100,112 నంబర్లను దీనితో ఇంటిగ్రేట్‌ చేయాలని నిర్ణయించారు. అయితే.. దీంతో పాటు దిశ యాప్‌ కూడా పెట్టాలని సీఎం సూచించారు. ఇందుకు  అసవరమైన నిధులను మంజూరు చేస్తామన్నారు. అదే విధంగా... దిశ చట్టం అమలు కోసం పోలీసు విభాగంలో ఒక ఐపీఎస్‌ అధికారిని నియమించే ఆలోచన చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా... 18 మహిళా పోలీసు స్టేషన్లను ఈ అధికారి కిందకు తీసుకువచ్చేలా ఆలోచన చేయాలన్నారు. దిశచట్టం అమలుకు వ్యవస్థలన్నీ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని... వీలైనంత త్వరలో మొత్తం ఈ కార్యక్రమాలన్నీ పూర్తికావాలని ఆదేశాలు జారీ చేశారు.

దిశ చట్టం అమలు సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

  • మద్యం మహమ్మారిని పారదోలాలనే ఉద్దేశంతో తొలిదశ చర్యలు తీసుకున్నాం
  • మద్యం నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలను తగ్గించాం
  • పర్మిట్‌ రూమ్‌లను నిషేధించాం
  • బెల్టుషాపులను ఏరివేశాం
  • బార్ల సంఖ్యను తగ్గించాం
  • ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ చర్యలపై కూడా ఎలాంటి ప్రచారం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం
  • దిశ చట్టం చేశాం.. కానీ అమలు కావడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు
  • ఎవరూ కూడా మనల్ని వేలెత్తిచూపకూడదు
  • ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదన్న ఏకైక అజెండాతో చాలామంది పనిచేస్తున్నారు
  • కేవలం టీడీపీతోనే కాకుండా టీడీపీ అనుకూల మీడియాతో, చంద్రబాబుకు మద్దతిస్తున్న వారితో మనం పోరాటం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలి
  • పేదలకోసం మనం ఇంగ్లిషు మీడియంను స్కూళ్లలో ప్రవేశపెడుతున్నాం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement