సాక్షి, అమరావతి :అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్య ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ చట్టంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. చట్టం ప్రతులను పంపాలని ఒడిశా ప్రభుత్వం తమను కోరిందని.. చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తామని ఆ ప్రభుత్వం చెప్పినట్టు సభలో వెల్లడించారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ చట్టంపై తమను సంప్రదించిందని, ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించినట్టు స్పీకర్ చెప్పారు. దిశ చట్టాన్ని ఆమోదించడం అసెంబ్లీకి గర్వకారణమని, ఈ చట్టంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందన్నారు. ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
చరిత్రాత్మక చట్టాలు చేశాం..
దిశ చట్టంపై అసెంబ్లీలో విపక్ష సభ్యుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని తప్పుపట్టడంతో స్పీకర్ జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వాలు మంచి చట్టాలను ప్రజల కోసం తయారు చేస్తాయన్నారు. జరుగుతున్న సంఘటనలన్నీ చట్టాలు లేకుండా జరుగుతున్నాయా అని స్పీకర్ నిలదీశారు. నిన్నగాక మొన్న ‘దిశ’ చట్టం వచ్చిందని.. ఎందుకు గాభరా పడుతున్నారంటూ విపక్ష సభ్యులను ప్రశ్నించారు. సభ ప్రారంభం కాగానే చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సమావేశాల్లోనే చరిత్రాత్మక చట్టాలు చేశామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు జోక్యం చేసుకుని.. చట్టం వచ్చాక గుంటూరులో చిన్నారిపై లైంగిక వేధింపులు జరిగాయని, ఒక్క ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదన్నారు. హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ సోమవారమే వెళ్లి పరామర్శించామని, లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినట్టు చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించినట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment