సాక్షి, రాజమండ్రి : మహిళల భద్రత కోసమే దిశ చట్టం పనిచేస్తుందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల నుంచి వచ్చినదే దిశ చట్టం అని ఆమె తెలిపారు. శనివారం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్‌ను సీఎం జగన్ శనివారం ప్రారంభించారు. అనంతరం నన్నయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో దిశ చట్టంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దిశ చట్టానికి సంబంధించిన యాప్‌ను ప్రారంభించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్పశ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రులు విశ్వరూప్, మోపిదేవి వెంకటరమణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు ఆర్‌కే రోజా, ఉండవల్లి శ్రీదేవి, విడదల రజనీ, మహిళా ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. (వాటి కోసం రూ. 31 కోట్లు: సీఎం జగన్ )
హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసమే సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది అని ప్రశంసించారు. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని మంత్రి తానేటి వనిత అన్నారు. దిశ చట్టం పట్ల ప్రతి మహిళా అవగాహన కలిగి ఉండాలని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజుల్లోనే బాధితులకు న్యాయ జరిగేలా నిందితులకు శిక్ష పడుతుందని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా సీఎం జగన్ దిశా చట్టాన్ని తీసుకువచ్చారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు. చట్టం అమలులకు పోలీస్ విభాగాన్ని పటిష్టం చేశామన్నారు. ఇప్పటికే అవసరమైన సిబ్బంది, సాంకేతిక సహకారాన్ని అందించామని, మహిళల కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
దేశంలోనే ఈ రోజు చారిత్రాత్మకమైన రోజని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. దిశ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీసుకొచ్చిందన్నారు. కేవలం చట్టం చేయడమే కాకుండా అమలు చేయడంలో కూడా ముందున్నామన్నారు. మహిళల భద్రత, సంరక్షణే ఈ చట్టం లక్ష్యమని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంలో తాము భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. ఏపీ పోలీసులు దేశంలో ఆదర్శంగా ఉంటాని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment