సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన దిశ చట్టంపై ప్రతిపక్ష టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. చట్టం అమల్లోకి రాకముందే లోపాలున్నాయని ఆరోపించడం తగదన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా దిశ చట్టంపై ప్రతిపక్షం చేసిన వ్యాఖ్యలపై సుచరిత ఘాటుగా స్పందించారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కొరకే దిశ చట్టం రూపొందించినట్లు సభకు వివరించారు. ప్రతి జిల్లాలో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి తెలిపారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పోస్టులు పెడితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలకు కేసులు నమోదు చేయడంలేదనడం సరికాదన్నారు.
వరకట్న హత్యల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి మేకతోటి సుచరిత సమాధానాలు ఇచ్చారు. మహిళలపై ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు అయ్యాయన్న ప్రశ్నకు వివరంగా సమాధానమిచ్చారు. వరకట్న హత్యలు జూన్ లో 3, జులై 1, అగస్ట్ 3, సెప్టెంబర్ 2 అక్టోబర్ లో ఏమీ లేదు. వరకట్న మరణాలు జూన్‌లో 12, జులైలో 9, ఆగస్ట్ లో 8, సెప్టెంబర్ లో 9, అక్టోబర్ లో 10 మొత్తం 48 జరిగాయి. ఆత్మహత్యకు పురికొల్పడం జూన్ లో 38, జులైలో 29, ఆగస్ట్ లో 60, సెప్టెంబర్ లో 26, అక్టోబర్ లో 35 కేసులు నమోదయ్యాయి. వేధింపుల కేసులు జూన్ లో 690, జులై లో 906, ఆగస్ట్ లో 703, సెప్టెంబర్ లో 671, అక్టోబర్ లో 645 మొత్తం 3615 కేసులు నమోదయ్యాయి. మహిళల హత్యలు జూన్ లో 23, జులైలో 23, ఆగస్ట్ లో 18, సెప్టెంబర్ లో 18, అక్టోబర్ లో 27 మొత్తం 109 కేసులు నమోదయ్యాయి. డీపీ చట్టం ద్వారా జూన్ లో 90 కేసులు, జులైలో 129, ఆగస్ట్ లో 88, సెప్టెంబర్ లో 81, అక్టోబర్ లో 92 మొత్తంగా 480 కేసులు నమోదయ్యాయి.
అపహరించడం, బలవంతంగా ఎత్తుకుపోవడం జూన్ లో 76, జులైలో 75, ఆగస్టు లో 45, సెప్టెంబర్ లో 39, అక్టోబర్ లో 31 మొత్తం 266 కేసులు నమోదయ్యాయి. శీలభంగానికి సంబంధించి జూన్ లో 399, జులై లో 487, ఆగస్ట్ లో 416, సెప్టెంబర్ లో 423, అక్టోబర్లో 363 మొత్తం 2088 కేసులు నమోదయ్యాయి’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment