
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు దిశా చట్ట పరిరక్షణ ప్రత్యేక అధికారిణి కృతికా శుక్లా తెలిపారు. దిశా చట్టం విధి విధానాలపై ఆమె శుక్రవారం పదమూడు జిల్లాల అధికారులతో వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా చట్టాన్ని తీసుకు వచ్చారని, చట్టం అమలుకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలని సూచించారు. నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినం చర్యలు తీసుకుంటామని కృతిక శుక్లా స్పష్టం చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ పథకాల ద్వారా బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వైఎస్సార్ కిశోరి వికాసం పథకం కింద ప్రాథమిక స్థాయి నుంచే సెల్ఫ్ డిఫెన్స్‌పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇక దిశా చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర రావాల్సి ఉందని పేర్కొన్నారు.(ప్రతిష్టాత్మక ‘దిశ’ యాక్ట్‌లోని ముఖ్యాంశాలివే..)
కాగా మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ దండన విధించేలా తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం అమలుకు రాష్ట్ర పరిధిలో అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ దిశ చట్టం-2019 అమలుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో దిశా కేంద్రాలు, మహిళా పోలీస్ స్టేషన్‌లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి మాసాన్ని ‘దిశా’ నెలగా ప్రకటించి ముందుకు సాగుతున్నారు. ఇక దిశ చట్టం అమలుకు ప్రభుత్వం ఇద్దరు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఐఏఎస్ విభాగంలో కృతికా శుక్లా, ఐపీఎస్ విభాగంలో దీపిక దిశ ప్రత్యేక అధికారిణిలుగా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment