దిశ ఆఫీసర్‌ | Special Story On IAS Officer Kritika Shukla | Sakshi
Sakshi News home page

దిశ ఆఫీసర్‌

Published Mon, Jan 13 2020 1:09 AM | Last Updated on Mon, Sep 20 2021 11:38 AM

Special Story On IAS Officer Kritika Shukla - Sakshi

కృతికా శుక్లా

గట్టి చట్టానికి గట్టి ఆఫీసర్‌.. కృతికా శుక్లా! ఎలా అప్పుడే గట్టి ఆఫీసర్‌ అని చెప్పడం?! మగవాళ్ల వేధింపులు ఎలా ఉంటాయో.. ఆడపిల్ల అనుభవించే వేదన ఎలా ఉంటుందో.. ఆమెకు తెలుసు. తనూ ఒకప్పుడు వెకిలి చూపులకు.. వికృతపు మాటలకు భయపడిన అమ్మాయే! ఇప్పుడా భయాన్ని పోగొట్టేందుకు దిశ చట్టం ఉంది. దుష్టశిక్షణకు స్వయంగా ఆమే డ్యూటీలో ఉంది!

కృతిక జమ్మూ అండ్‌ కశ్మీర్‌ కేడర్‌ 2013 ఐఏఎస్‌ ఆఫీసర్‌. మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన ‘ఏపీ దిశ  చట్టం – 2019’ అమలుకు ప్రత్యేకాధికారిగా ఇటీవలే నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన ‘సాక్షి’తో దిశ రూపకల్పన, అమలు ప్రణాళికల గురించి ఆమె మాట్లాడారు. వ్యక్తిగత విషయాలనూ పంచుకున్నారు.

డిస్టర్బ్‌ అయ్యేవాళ్లం
‘‘ఢిల్లీలో చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిగా నేనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఈవ్‌టీజింగ్‌ ఉండేది. బస్సు ప్రయాణంలో అసభ్యకరమైన చేష్టలు ఉండేవి. కొంచెం పరిచయం అయితే చాలు.. పిచ్చి పిచ్చి మెసేజ్‌లు వచ్చేవి. ఇలా ఉండేది హెరాస్‌మెంట్‌. హాస్టల్‌ దగ్గరికి కూడా అబ్బాయిలు వచ్చేవారు. దాంతో మేము మెంటల్‌గా చాలా డిస్టర్బ్‌ అయ్యేవాళ్లం. మా సమస్యను చెప్పుకొనేందుకు అప్పట్లో మహిళా పోలీసులు ఉండేవాళ్లు కాదు. ట్రావెల్‌ చేసేటప్పుడు రక్షణగా ఉమెన్‌ వింగ్‌ ఉండేది కాదు. ఆపద సమయంలో ఆదుకొనేందుకు కనీసం హెల్ప్‌ నంబర్లు ఉండేవి కావు.

ఏపీ ‘దిశ’ చట్టాన్ని రూపొందించేటప్పుడు నేను నా జీవితంలో పడిన ఆనాటి ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకున్నాను. అలాంటి వేధింపులు ఇప్పటి అమ్మాయిలకు పునరావృతం కాకుండా, పురుషుల ప్రవర్తనలో సమూల మార్పులు తెచ్చేందుకు వీలుగా ఈ చట్టాన్ని రూపొందించాం. నేను చదువుకునే రోజుల్లో క్షేత్రస్థాయిలో ఎదురైన ఇబ్బందులు, అనుభవాలు  ఈ చట్టం రూపకల్పనలో నాకెంతగానో తోడ్పడ్డాయి.

ఇద్దరం అమ్మాయిలమే
‘‘మాది పంజాబ్‌లోని చండీగఢ్‌. పాఠశాల విద్య వరకు అక్కడే చదివాను. నాన్న మదన్‌లాల్‌ బాత్రాకి స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీ బ్రాంచ్‌ ఉండేది. అమ్మ హర్షా బాత్రా గవర్నమెంట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌. చండీగఢ్‌లోనే పనిచేసేవారు. మేము ఇద్దరం అమ్మాయిలమే. మా చెల్లెలు రీచా బాత్రా ఇప్పుడు హైదరాబాద్‌లోని నొవారిటీస్‌లో మేనేజర్‌. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ తరువాత మా మిగతా చదువులన్నీ ఢిల్లీలోనే సాగాయి. మేమిద్దరం అమ్మాయిలమే అయినప్పటికీ మా అమ్మ పట్టుదలతో మంచి చదువు చెప్పించాలని..  దూరమైనప్పటికీ మమ్మల్ని ఢిల్లీ పంపింది. నేను అక్కడి శ్రీరామ్‌ కాలేజీలో డిగ్రీ చదివాను.

ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా ఉండి చదువుకున్నాను. డిగ్రీ పూర్తి కాగానే మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి.  సంవత్సరానికి రూ. 15  లక్షలపైగా ప్యాకేజీ ఆఫర్‌ కూడా వచ్చింది. ఐఎఎస్‌కి కూడా మా అమ్మ ప్రోత్సాహంతోనే నేను ప్రిపేర్‌ అయ్యాను. ఐఎఏస్‌లో ఉద్యోగ సంతృప్తి మాత్రమే కాకుండా, సమాజంలో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని అమ్మ చెప్పేవారు. పదిమంది పేదలకు మంచి చేసే భాగ్యం లభిస్తుందని అనేవారు. దాంతో నాకు ఐఏఎస్‌ చదవాలనే సంకల్పం బలంగా ఏర్పడింది. అమ్మ ఇచ్చిన ప్రేరణ, ప్రోత్సాహంతోనే  నేను 23 ఏళ్లకే ఐఏఎస్‌ పాస్‌ అయ్యాను’’.

కులాంతర వివాహం
మాది ఇంటర్‌ క్యాస్ట్‌ మ్యారేజి. నా భర్త హిమాన్షు శుక్లాది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌. మా ఐఏఎస్‌ ట్రైనింగ్‌ అయిన తరువాత పెద్దల అంగీకారంతో  2015 లో పెళ్లి చేసుకున్నాం. రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. హిమాన్షు నా పని ఒత్తిడి అర్థం చేసుకొని నాకు హెల్ప్‌ చేస్తుంటారు. ఇద్దరం కలిసి వంట చేసుకుంటాం. నేను గర్భిణిగా ఉన్నప్పుడు ఆయనే నా డైరెక్షన్‌తో వంట చేసేవారు. వడ్డించేవారు. ఇంటి పనిని కూడా షేర్‌ చేసుకుంటాం. ఒక్కోసారి నేను ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లడం ఆలస్యం అవుతుంది. అప్పుడు ఆయనే బాబును సముదాయిస్తుంటారు.

అబ్బాయిలతో సమానంగా అమ్మాయిల్నీ చూసే మార్పు ఇంట్లోంచే మొదలవ్వాలి. ఇంటి పనంతా అమ్మాయిలదే అనే భావనను అబ్బాయిల్లో పోగొట్టి, వాళ్లకూ బాధ్యతల్ని అప్పగించాలి. ముఖ్యంగా అమ్మాయిల్ని రెస్పెక్ట్‌ చెయ్యడం నేర్పాలి. అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో తల్లిదండ్రులు గైడ్‌ చేయాలి. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది తెలియజెప్పాలి. అమ్మాయిల్ని వేధిస్తే జరగబోయే పరిణామాలను కూడా వివరించాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది’’ అని ముగించారు కృతికా శుక్లా.
– ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి,
సాక్షి అమరావతి బ్యూరో, గుంటూరు
ఫొటోలు: గజ్జెల రాంగోపాల్‌ రెడ్డి

తక్షణ స్పందన
‘దిశ’ చట్టానికి స్పెషల్‌ ఆఫీసర్‌గా నాకు బాధ్యతను అప్పగించడాన్ని మంచి అవకాశంగా భావిస్తున్నాను. ముఖ్యమంత్రి సూచనలు, సలహాలతో మార్పులు, చేర్పులు చేసి వారం వ్యవధిలోనే దిశ బిల్లును తయారు చేశాం. అది మా మొదటి విజయం. మహిళలు, పిల్లల భద్రత కోసం ఏపీ సి.ఎం.జగన్‌మోహన్‌రెడ్డి ఈ చట్టాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చారు. చట్టాన్ని సమర్థంగా అమలు చేయడం కోసం పోలీసుశాఖ, న్యాయశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఫోరెన్సిక్‌ సంస్థల సమన్వయంతో పని చేయబోతున్నాం. ఎప్పటికప్పుడు తక్షణ స్పందన ఉండేలా చర్యలు తీసుకుంటాం.

త్వరగా విచారణ
దిశ చట్టం అమలు ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టేశాం. ప్రతి జిల్లాలో దిశ ఉమెన్‌ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఆ స్టేషన్‌లో ఓ డీఎస్పీ, ముగ్గురు ఎస్సైలు, సైబర్‌ ఎక్స్‌పర్ట్‌ ట్రైనర్, సపోర్టు స్టాఫ్‌ ఉంటారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ సదుపాయం, బాధితురాలికి కౌన్సెలింగ్,  వైద్య పరీక్షల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రతి జిల్లాలో దిశ కోర్టును ఏర్పాటు చేసి మహిళలు, పిల్లలపై జరిగే లైంగిక దాడులపైన వెంటనే విచారణ చేపడతాం. మహిళలకు ఈ చట్టం ఖచ్చితంగా భరోసా ఇస్తుందని నమ్ముతున్నాం. ఈ చట్టం ద్వారా మహిళలను చైతన్యం చేయబోతున్నాం.

వివిధ బాధ్యతల్లో  కృతిక
►డైరెక్టర్, ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌.
►మేనేజింగ్‌ డైరెక్టర్, ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ.
►మేనేజింగ్‌ డైరెక్టర్, జువెనైల్‌ వెల్ఫేర్‌.
►డైరెక్టర్, వెల్ఫేర్‌ ఆఫ్‌ రిఫరెండ్లీ ఎయిడెడ్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌
►మేనేజింగ్‌ డైరెక్టర్, డిఫరెంట్లీ ఎయిడెడ్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్‌ అసిస్టెంట్స్‌ కార్పొరేషన్‌
స్పెషల్‌ ఆఫీసర్, దిశ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement