Womens Care
-
మహిళల కోసం ‘లాడ్లి బెహనా’యోజన
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా లాడ్లి బెహనా(ప్రియమైన సోదరి) పథకాన్ని ప్రకటించింది. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి ‘లాడ్లి బెహనా యోజన’ఫలకాన్ని ఆన్లైన్లో ఆవిష్కరించారు. పథకం కింద ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.వెయ్యి అందజేస్తుంది. ఇందుకు అర్హులుగా.. ఆదాయ పన్ను చెల్లించని, వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉండే వారు, తదితర కేటగిరీలను నిర్ణయించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఈ పథకంతో లబ్ధి కలుగనుంది. ఇందుకోసం బడ్జెట్లో రూ.8 వేల కోట్లను కేటాయించారు. మార్చి 15–ఏప్రిల్ 30 తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
వుమెన్ సేఫ్టీ.. గొప్పగా ‘చెప్పు’కోవచ్చు!
తాడులా కనిపించేది ఎప్పుడు పామై కాటేస్తుందో తెలియదు. వెలుగులా గోచరించేది ఎప్పుడు చీకటై ముంచేస్తుందో తెలియదు... అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటారు. ఇందుకు ప్రత్యేకంగా వనరులు సమకూర్చుకోకపోయినా నిత్యజీవితంలో మనం ఉపయోగించే వస్తువులతోనే ‘మహిళల భద్రత’ కు అవసరమైన సాంకేతిక దన్ను అందిస్తుంది శాస్త్రీయజ్ఞానం. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విఐటి, తమిళనాడు)కు చెందిన పరిశోధకులు మహిళలకు రక్షణ ఇచ్చే పాదరక్షలకు రూపకల్పన చేశారు. ‘మహిళా భద్రతకు ఎన్నో చట్టాలు ఉన్నా, ఎక్కడో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేము రూపొందించే పాదరక్షలు ఎంతో భద్రతను ఇస్తాయి’ అంటున్నారు ప్రాజెక్ట్ మేకర్స్. తమకు తాముగా జాగ్రత్తపడేలా, విపత్కరమైన పరిస్థితులలో రక్షణ పొందేలా చేసే ఈ స్మార్ట్ పాదరక్షలు ఆత్మరక్షణ ఆయుధాలుగా ఉపయోగపడతాయి. ఎటాకర్స్పై ప్రతిదాడి చేసే అవకాశం వీటిలో ఉంది. జీపిఎస్, జీఎస్ఎం మాడ్యూల్‌ను ఉపయోగించి ఈ పాదరక్షలను డిజైన్ చేశారు. ‘షూ’లలో జీపిఎస్, జీఎస్ఎం మాడ్యుల్ మినియేచర్ వెర్షన్ చిప్‌లను అమర్చుతారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎమర్జెన్సీ–కాంటాక్ట్‌ల కోసం ‘షూ’ను గట్టిగా నొక్కితే సరిపోతుంది. ఎటాకర్‌కు షాక్ ఇవ్వవచ్చు. ‘ఎటాకర్’ను గుర్తించే వీడియో లైవ్ స్ట్రీమింగ్ సాంకేతికత కూడా వీటికి ఉండడం మరో విశేషం. తాజా విషయానికి వస్తే... హిమాచల్‌ప్రదేశ్, సొలాన్ జిల్లాలోని జైపీ యూనివర్శిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (జెయుఐటీ)కి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు సరన్ష్ రోహిల్లా, సాంధిత్య యాదవ్‌లు మహిళలకు రక్షణ ఇచ్చే ‘స్మార్ట్’ షూస్‌ను అభివృద్ధిపరిచారు. ఇవి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ‘కాంటాక్ట్స్’ను అప్రమత్తం చేస్తాయి. లొకేషన్ గురించి తెలియజేస్తాయి. ‘డిజైన్ అండ్ ఎనాలసిస్ ఆఫ్ స్మార్ట్షూ ఫర్ వుమెన్ సేఫ్టీ’ పేరుతో పేపర్ సమర్పించారు. ‘మహిళల భద్రతకు సాంకేతిక జ్ఞానాన్ని విరివిగా వాడుకోవాల్సిన సమయం ఇది. ఇందులో మాది ఒక అడుగు’ అంటున్నారు సరన్ష్,సాంధిత్య. -
దిశ ఆఫీసర్
గట్టి చట్టానికి గట్టి ఆఫీసర్.. కృతికా శుక్లా! ఎలా అప్పుడే గట్టి ఆఫీసర్ అని చెప్పడం?! మగవాళ్ల వేధింపులు ఎలా ఉంటాయో.. ఆడపిల్ల అనుభవించే వేదన ఎలా ఉంటుందో.. ఆమెకు తెలుసు. తనూ ఒకప్పుడు వెకిలి చూపులకు.. వికృతపు మాటలకు భయపడిన అమ్మాయే! ఇప్పుడా భయాన్ని పోగొట్టేందుకు దిశ చట్టం ఉంది. దుష్టశిక్షణకు స్వయంగా ఆమే డ్యూటీలో ఉంది! కృతిక జమ్మూ అండ్ కశ్మీర్ కేడర్ 2013 ఐఏఎస్ ఆఫీసర్. మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ‘ఏపీ దిశ చట్టం – 2019’ అమలుకు ప్రత్యేకాధికారిగా ఇటీవలే నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన ‘సాక్షి’తో దిశ రూపకల్పన, అమలు ప్రణాళికల గురించి ఆమె మాట్లాడారు. వ్యక్తిగత విషయాలనూ పంచుకున్నారు. డిస్టర్బ్ అయ్యేవాళ్లం ‘‘ఢిల్లీలో చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిగా నేనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఈవ్‌టీజింగ్ ఉండేది. బస్సు ప్రయాణంలో అసభ్యకరమైన చేష్టలు ఉండేవి. కొంచెం పరిచయం అయితే చాలు.. పిచ్చి పిచ్చి మెసేజ్‌లు వచ్చేవి. ఇలా ఉండేది హెరాస్మెంట్. హాస్టల్ దగ్గరికి కూడా అబ్బాయిలు వచ్చేవారు. దాంతో మేము మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయ్యేవాళ్లం. మా సమస్యను చెప్పుకొనేందుకు అప్పట్లో మహిళా పోలీసులు ఉండేవాళ్లు కాదు. ట్రావెల్ చేసేటప్పుడు రక్షణగా ఉమెన్ వింగ్ ఉండేది కాదు. ఆపద సమయంలో ఆదుకొనేందుకు కనీసం హెల్ప్ నంబర్లు ఉండేవి కావు. ఏపీ ‘దిశ’ చట్టాన్ని రూపొందించేటప్పుడు నేను నా జీవితంలో పడిన ఆనాటి ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకున్నాను. అలాంటి వేధింపులు ఇప్పటి అమ్మాయిలకు పునరావృతం కాకుండా, పురుషుల ప్రవర్తనలో సమూల మార్పులు తెచ్చేందుకు వీలుగా ఈ చట్టాన్ని రూపొందించాం. నేను చదువుకునే రోజుల్లో క్షేత్రస్థాయిలో ఎదురైన ఇబ్బందులు, అనుభవాలు ఈ చట్టం రూపకల్పనలో నాకెంతగానో తోడ్పడ్డాయి. ఇద్దరం అమ్మాయిలమే ‘‘మాది పంజాబ్‌లోని చండీగఢ్. పాఠశాల విద్య వరకు అక్కడే చదివాను. నాన్న మదన్‌లాల్ బాత్రాకి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ బ్రాంచ్ ఉండేది. అమ్మ హర్షా బాత్రా గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్. చండీగఢ్‌లోనే పనిచేసేవారు. మేము ఇద్దరం అమ్మాయిలమే. మా చెల్లెలు రీచా బాత్రా ఇప్పుడు హైదరాబాద్‌లోని నొవారిటీస్లో మేనేజర్. స్కూల్ ఎడ్యుకేషన్ తరువాత మా మిగతా చదువులన్నీ ఢిల్లీలోనే సాగాయి. మేమిద్దరం అమ్మాయిలమే అయినప్పటికీ మా అమ్మ పట్టుదలతో మంచి చదువు చెప్పించాలని.. దూరమైనప్పటికీ మమ్మల్ని ఢిల్లీ పంపింది. నేను అక్కడి శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదివాను. ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా ఉండి చదువుకున్నాను. డిగ్రీ పూర్తి కాగానే మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. సంవత్సరానికి రూ. 15 లక్షలపైగా ప్యాకేజీ ఆఫర్ కూడా వచ్చింది. ఐఎఎస్కి కూడా మా అమ్మ ప్రోత్సాహంతోనే నేను ప్రిపేర్ అయ్యాను. ఐఎఏస్లో ఉద్యోగ సంతృప్తి మాత్రమే కాకుండా, సమాజంలో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని అమ్మ చెప్పేవారు. పదిమంది పేదలకు మంచి చేసే భాగ్యం లభిస్తుందని అనేవారు. దాంతో నాకు ఐఏఎస్ చదవాలనే సంకల్పం బలంగా ఏర్పడింది. అమ్మ ఇచ్చిన ప్రేరణ, ప్రోత్సాహంతోనే నేను 23 ఏళ్లకే ఐఏఎస్ పాస్ అయ్యాను’’. కులాంతర వివాహం మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజి. నా భర్త హిమాన్షు శుక్లాది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్. మా ఐఏఎస్ ట్రైనింగ్ అయిన తరువాత పెద్దల అంగీకారంతో 2015 లో పెళ్లి చేసుకున్నాం. రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. హిమాన్షు నా పని ఒత్తిడి అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేస్తుంటారు. ఇద్దరం కలిసి వంట చేసుకుంటాం. నేను గర్భిణిగా ఉన్నప్పుడు ఆయనే నా డైరెక్షన్‌తో వంట చేసేవారు. వడ్డించేవారు. ఇంటి పనిని కూడా షేర్ చేసుకుంటాం. ఒక్కోసారి నేను ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లడం ఆలస్యం అవుతుంది. అప్పుడు ఆయనే బాబును సముదాయిస్తుంటారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిల్నీ చూసే మార్పు ఇంట్లోంచే మొదలవ్వాలి. ఇంటి పనంతా అమ్మాయిలదే అనే భావనను అబ్బాయిల్లో పోగొట్టి, వాళ్లకూ బాధ్యతల్ని అప్పగించాలి. ముఖ్యంగా అమ్మాయిల్ని రెస్పెక్ట్ చెయ్యడం నేర్పాలి. అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో తల్లిదండ్రులు గైడ్ చేయాలి. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది తెలియజెప్పాలి. అమ్మాయిల్ని వేధిస్తే జరగబోయే పరిణామాలను కూడా వివరించాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది’’ అని ముగించారు కృతికా శుక్లా. – ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి అమరావతి బ్యూరో, గుంటూరు ఫొటోలు: గజ్జెల రాంగోపాల్ రెడ్డి తక్షణ స్పందన ‘దిశ’ చట్టానికి స్పెషల్ ఆఫీసర్‌గా నాకు బాధ్యతను అప్పగించడాన్ని మంచి అవకాశంగా భావిస్తున్నాను. ముఖ్యమంత్రి సూచనలు, సలహాలతో మార్పులు, చేర్పులు చేసి వారం వ్యవధిలోనే దిశ బిల్లును తయారు చేశాం. అది మా మొదటి విజయం. మహిళలు, పిల్లల భద్రత కోసం ఏపీ సి.ఎం.జగన్మోహన్రెడ్డి ఈ చట్టాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చారు. చట్టాన్ని సమర్థంగా అమలు చేయడం కోసం పోలీసుశాఖ, న్యాయశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఫోరెన్సిక్ సంస్థల సమన్వయంతో పని చేయబోతున్నాం. ఎప్పటికప్పుడు తక్షణ స్పందన ఉండేలా చర్యలు తీసుకుంటాం. త్వరగా విచారణ దిశ చట్టం అమలు ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టేశాం. ప్రతి జిల్లాలో దిశ ఉమెన్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ స్టేషన్లో ఓ డీఎస్పీ, ముగ్గురు ఎస్సైలు, సైబర్ ఎక్స్పర్ట్ ట్రైనర్, సపోర్టు స్టాఫ్ ఉంటారు. జీరో ఎఫ్ఐఆర్ సదుపాయం, బాధితురాలికి కౌన్సెలింగ్, వైద్య పరీక్షల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రతి జిల్లాలో దిశ కోర్టును ఏర్పాటు చేసి మహిళలు, పిల్లలపై జరిగే లైంగిక దాడులపైన వెంటనే విచారణ చేపడతాం. మహిళలకు ఈ చట్టం ఖచ్చితంగా భరోసా ఇస్తుందని నమ్ముతున్నాం. ఈ చట్టం ద్వారా మహిళలను చైతన్యం చేయబోతున్నాం. వివిధ బాధ్యతల్లో కృతిక ►డైరెక్టర్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. ►మేనేజింగ్ డైరెక్టర్, ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ. ►మేనేజింగ్ డైరెక్టర్, జువెనైల్ వెల్ఫేర్. ►డైరెక్టర్, వెల్ఫేర్ ఆఫ్ రిఫరెండ్లీ ఎయిడెడ్ అండ్ సీనియర్ సిటిజన్స్ ►మేనేజింగ్ డైరెక్టర్, డిఫరెంట్లీ ఎయిడెడ్ అండ్ సీనియర్ సిటిజన్ అసిస్టెంట్స్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్, దిశ -
ఆవేదన లోంచి ఓ ఆలోచన
మగవారు ఇంట్లో తలుపులు వేసుకుని ఉంటేనే మహిళలకు రక్షణ అంటున్నారు ఒక మహిళ. ఆ మహిళ పోస్టు చేసిన ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ‘దిశ’ ఘటనకు స్పందనగా విడుదలైన వీడియో అది. ఆ మహిళ చేతిలో ఒక ప్లకార్డు ఉంది. దాని మీద ‘షీ గాట్ రేప్డ్’ , ‘హీ రేప్డ్’ అని రెండు నినాదాలు రాసి ఉన్నాయి. మొదటి నినాదం పక్కన ఉన్న బాక్స్‌లో ఇంటూ మార్క్, రెండో నినాదం ముందున్న బాక్స్‌లో రైట్ మార్క్ ఉన్నాయి. వీడియోలో ఈ మహిళ చెబుతున్న మాటలు అందరినీ ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. ‘మహిళ రేప్ చేయబడింది’ అని మొదటి నినాదానికి అర్థం. ‘ఒక మగవాడు బలాత్కరించాడు’ అనేది రెండో నినాదం. మొదటి నినాదం సరైనది కాదు అని ఈ ప్లకార్డు అంతరార్థం. ‘‘రాత్రి ఏడు గంటల తరవాత మహిళలు ఇంటి దగ్గరే ఎందుకు ఉండాలి, పురుషులే ఉండొచ్చుగా. ఈ విషయాన్ని ప్రచారంలోకి తీసుకురావాలి. మగవారంతా రాత్రి ఏడు గంటల లోపు ఇంటికి వచ్చి, తలుపులు వేసుకుని ఇంట్లో ఉండాలి. అప్పుడే మహిళలకు రక్షణ. నన్ను ఒక పోలీసు రక్షించాలని కోరుకోను, నా అన్నదమ్ములు నాకు రక్షణగా ఉండాలని కోరుకోను. మహిళల మీద జరుగుతున్న అరాచకాలకు కారణం పురుషుడు. అందువల్ల పురుషులు రాత్రి ఏడు గంటల లోపు ఇంటికి చేరుకుంటే, ప్రపంచమంతా స్వేచ్ఛగా విహరించగలదు’’ అని ఆ మహిళ ఆవేదనగా, ఆలోచింపచేసేలా మాట్లాడారు. ఈ వీడియో మీద ఇంటర్నెట్లో చర్చ జరుగుతోంది. చాలామంది నెటిజన్లు, ‘ఒక భారతీయ స్త్రీ చెప్పాలనుకుంటున్న విషయాన్ని ఈ మహిళ ధైర్యంగా చెబుతున్నారు’ అని ఆమెను ప్రశంసిస్తున్నారు. -
బాధ్యత ఎవరు తీసుకోవాలి
స్త్రీలను గౌరవించాలి. వారు భద్రమైన వాతావరణంలో ఉండాలి.వారికి అనుక్షణం రక్షణ ఇచ్చే వ్యవస్థ ఉండాలి. వారిని లైంగిక వస్తువులుగా చూడని సంస్కారం పురుషులలో ఏర్పడాలి. ఇందుకు ఎవరు పూనుకోవాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? తల్లిదండ్రులా? టీచర్లా? పోలీసులా? ‘ధైర్యం, స్వేచ్ఛ ఎంత ముఖ్యమో పరిస్థితులను ఎరిగి జాగ్రత్తలో ఉండడం కూడా అంతే ముఖ్యం’ ‘దిశ’ హత్య సంఘటన నేపథ్యంలో ఫేస్బుక్లో కనిపించిన ఒక కామెంట్ అది. ఈ కామెంట్లో వాస్తవం ఉంది. ‘దిశ’ ఘటనలోగాని, వరంగల్‌లో కారులో అత్యాచారం జరగడం వల్ల షాక్‌కు గురై మరణించిన మానస విషయంలోగాని జరిగింది అదే. పరిస్థితులను ఎరిగి జాగ్రత్తలో లేకపోవడం. ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగాక మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలను మరింత కట్టుదిట్టం చేశారు. కొత్త చట్టాన్నీ తెచ్చారు. అయినా లైంగిక దాడులతో కూడిన హత్యలు ఆగడం లేదు. ఇందులో సమాజంలో స్త్రీల పట్ల పేరుకునిపోయిన క్రూర దాడి స్వభావంతో పాటు మహిళలు తామున్న పరిస్థితిని గుర్తెరిగి ప్రవర్తించకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఒక తప్పుకు కేవలం ఒకరు మాత్రమే బాధ్యత వహించవలసిన పని లేదు. సమష్టిగా బాధ్యత వహించాల్సిందే. అందులో తల్లిదండ్రులు, టీచర్లు, పోలీసులు.. ఈ అన్ని వ్యవస్థల సంరక్షణా కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన ప్రభుత్వం కూడా ఉంది. ఎందుకు? మంచి జీవితం కోసం ఇప్పుడు అమ్మానాన్నా ఇద్దరూ జీతం తేవాల్సిందే. పిల్లలకు ‘మంచి’ చదువు ఇప్పించడం కోసం ప్రైవేట్ స్కూల్లో వేయాల్సిందే. బాగా చదువుచెప్పే పనిలో ఆ స్కూళ్లూ పిల్లలను దాదాపు ఉదయం ఏడు నుంచి సాయంకాలం ఆరుగంటల దాకా ఎంగేజ్ చేస్తున్నాయి. దీంతో పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో కంటే స్కూల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇంటికొచ్చాక కూడా స్కూల్ ఇచ్చిన పనిలో కొంతసేపు ఉండి, మిగిలిన కాసేపు సోషల్ మీడియా బడిలో సేద తీరుతున్నారు. కాలేజ్ పిల్లల షెడ్యూల్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంది కొంత మార్పుతో. ఏతావాతా పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయ పరిమాణం, సమయ నాణ్యత గణనీయంగా తగ్గింది. తల్లిదండ్రుల పాత్రను టీచర్లే పోషించాల్సిన అవసరం ఏర్పడింది. అలాగని పిల్లల సమయం ఎక్కడోఒకచోట పూరింపబడుతోంది కదా అని సంతోషపడాల్సిన ముచ్చట లేదు. ప్రైవేట్ లేదా కార్పొరేట్ స్కూళ్లు పిల్లలను తెలివైన విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని తల్లిదండ్రులకు మాటిస్తాయి తప్ప మంచి విద్యార్థిగా అని కాదు. తల్లిదండ్రుల షరతు కూడా తెలివైన బిడ్డలు కావాలనే. మంచి పిల్లలు అని కాదు. ఇక ప్రభుత్వ పాఠశాల విషయానికి వస్తే.. వికాసవంతమైన విద్య, క్రీడా విద్య, ఆరోగ్యం, లైఫ్ స్కిల్స్ మొదలైనవన్నీ కరిక్యులమ్‌లో భాగాలే. ప్రతి యూనిట్, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పరీక్షల్లో పై వాటికీ మార్కులుంటాయి. ప్రతి విద్యార్థి ప్రవర్తనను, ఆరోగ్య, మానసిక దృఢత్వాన్ని పరీక్షించే మార్కులు వేయాలి. కాని ప్రాక్టికల్‌గా అలా ఉండదు. ఎందుకంటే చాలా ప్రభుత్వ పాఠశాలలు దాదాపుగా ఇద్దరు టీచర్ల నిర్వహణలో నడుస్తున్నాయి. ఈ స్థితిలో మొక్కుబడిగా మార్కులివ్వడం తప్పిస్తే పరీక్షించి రిపోర్ట్ రాయడం కుదరని పని. ఈ కరిక్యులమ్‌కు రూపకల్పన చేసిన ప్రభుత్వ సిబ్బందికీ ఆ విషయం తెలుసు. ఇక పోలీసులు.. సమాజంలోని కుల, మత, వర్గ, లింగ వివక్ష చూపకుండా, చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ రక్షణ చూసుకోవాల్సిన వారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి నుంచి విధానాలు రూపొందే అసెంబ్లీ (రాష్ట్రం వరకు మాట్లాడుకుంటే) వరకు శాంతి, భద్రతల బరువును మోయాల్సిన వారు. అంటే పిల్లలకు సంబంధించి పేరెంటింగ్ పాత్రనూ చేపట్టాల్సిన వారు. వీటన్నిటినీ సమన్వయం చేయాల్సిన ప్రభుత్వమూ ఉమ్మడి కుటుంబంలో పెద్ద వాళ్ల భూమికను పోషించాలి. ఆడవాళ్ల మీద హింస తగ్గించడానికి, అలాంటి నేరాలు జరిగినప్పుడు అమ్మాయిలు ధైర్యంగా పోలీసులను సంప్రదించడానికి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అది – ఆ జిల్లాలోని స్కూళ్ల నుంచి అమ్మాయిలను ఎంపిక చేసి వారానికి ఒకరోజు ఆ ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్ ఇన్చార్జిగా పెట్టడం. దీనివల్ల నేరాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా రిపోర్ట్ చేయాలి వంటి వాటి మీద అమ్మాయిలకు అవగాహన పెరగడమే కాక భయం పోతుంది. పోలీసులు సున్నితంగా వ్యవహరించే వీలుంటుంది అని. ఇలాంటివి ఇక్కడా ప్రయోగించవచ్చేమో. ‘దిశ’ ఘటన నేపథ్యంలో ఆయా వర్గాలు ఏమంటున్నాయో చూద్దాం. ఒక్కోనెల ఒక్కోరంగంలోని నిపుణుడితో సెషన్ పెట్టించాలి పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా ముందు పిల్లలను మార్కుల కోసం వత్తిడి చేయడం ఆపాలి. వారి లైఫ్ స్కిల్స్ పట్ల దృష్టి పెట్టాలి. ఇంతకుముందు ఇంట్లోంచి ఇవి అందేవి. ఇప్పుడు స్కూల్లో అందేలా చూడాలి. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లకు శ్రద్ధ పెట్టే టైమ్‌లేక నైతికవిద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్, జీవన నైపుణ్యాలు వంటి అంశాలను కూడా మామూలు పరీక్షల్లాగే భావించి అందరికీ ఒకే రకంగా మార్కులు వేసి పాస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలా చేయడం నిజంగా ఏ టీచర్‌కూ ఇష్టం ఉండదు. బాధగానే ఉంటుంది. కాని ఏం చేస్తాం? నేను కోరేది ఒక్కటే.. ప్రతి స్కూల్లో ప్రతి నెల ఆయా రంగాల్లోని నిపుణులను పిలిపించి ఆ రోజు పిల్లలతోపాటు, టీచర్లు, పేరెంట్స్‌కి కూడా క్లాస్ ఇప్పించాలి. అంటే కౌన్సిలింగ్ సెషన్‌లా ఉండాలన్నమాట. – గాజోజు నాగభూషణం, మన్నెపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కరీంనగర్ జిల్లా. విపరీతంగా ప్రచారం చేయాలి ఈరోజు ప్రతి వాళ్లకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ దినచర్యలో ప్రయాణం తప్పనిసరి అయింది. నేరాలు జరిగే అవకాశం కూడా ఈ మూమెంట్లోనే ఎక్కువ. ఒక ప్రొడక్ట్‌కి మార్కెట్లో ఎలా అయితే ప్రచారం జరుగుతుందో అలాగే ఈ సేఫ్టీ అండ్ సెక్యురిటీని కూడా మార్కెటైజ్ చేయాలి అంటాను. వాట్సప్‌లో అప్పుడప్పుడూ కొన్ని మెసేజెస్ వస్తూంటాయి.. ఫలానా దేవుడి నామాన్ని 108 మందికి ఫార్వర్డ్ చేయండి.. లేదంటే ఏదో అవుతుంది అనుకుంటూ! అదిగో ఆ స్థాయిలో ఈ సేఫ్టీ అండ్ సెక్యురిటీ ప్రచారం సాగాలి. ఇంటి నుంచి డెస్టినేషన్‌కు వెళ్లే దారిలో ప్రజల దృష్టి పడే చోట్లంతా దీనికి సంబంధించిన పత్రాలను, హోర్డింగ్స్‌ను పెట్టాలి. పేరెంట్స్, టీచర్స్, పోలీసులు అని కాకుండా అందరం దీన్నో క్యాంపెయిన్‌లా ముందుకు తీసుకుపోవాలి. – సుమతి, ఐపీఎస్ పేరెంట్స్ మీటింగ్‌కి కూడా హాజరు కావడం లేదు నిజమే .. స్కూల్లో టీచర్ పేరెంట్ పాత్ర పోషించాలి. పోషిస్తున్నాం కూడా. కాని ఇంట్లో తల్లిదండ్రులూ శ్రద్ధ పెట్టాల్సిందే. పాఠాలు ఎంత ముఖ్యమో.. బతుకు పాఠాలు అంతకన్నా ముఖ్యం. నేను ప్రతి క్లాస్‌లో లెసన్ చెప్పేకంటే ముందు పదినిమిషాలు జనరల్ విషయాల గురించే పిల్లలతో మాట్లాడ్తా. వాళ్ల అబ్జర్వేషన్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా. దాంతో వాళ్ల ఆలోచనా ధోరణి తెలుస్తుందని. ఏ కొంచెం తేడా అనిపించినా తల్లిదండ్రులతో మాట్లాడొచ్చు అని. ఇవి కరిక్యులమ్‌లో భాగమైనా కాకపోయినా ఓ టీచర్ పాఠంలో భాగం కావాలని అనుకుంటా, నమ్ముతా, అమలుచేస్తా. ఇలాంటి ఎక్సర్సైజ్ ఇంట్లోనూ జరగాలి. పేరెంట్స్ మీటింగ్‌లో పిల్లల మార్కులనే కాదు ప్రవర్తననూ డిస్కస్ చేస్తా. అందుకే పేరెంట్ మీటింగ్‌కి తప్పకుండా తల్లి, తండ్రి ఇద్దరూ హాజరుకావాలి. కాని వాస్తవం ఏమిటంటే తల్లిదండ్రులకు అందుకోసం కూడా టైమ్ ఉండటం లేదు. – కె. కవిత, ప్రభుత్వ టీచర్, మనోహరాబాద్, మెదక్ జిల్లా. ఇంగితాన్ని నేర్పాలి కొన్ని పరిస్థితుల్లో గుడ్డిగా నమ్మడం కంటే అనుమానించడమే మంచిది అని ఇంగ్లిష్ సామెత. అయితే అబ్బాయిల కన్నా అమ్మాయిల్లో నమ్మకం పాలు ఎక్కువని సైంటిఫిక్‌గా రుజువైంది. అమ్మాయిల్లో విడుదలయ్యే కొన్ని హార్మోన్సే ఇందుకు కారణం. జాలి, దయ, సహాయం చేస్తుంటే వారించలేనితనాన్ని ఈ హార్మోన్లు ప్రేరేపిస్తూంటాయి. కాని ఎల్లవేళలా ఇది మంచిదికాదు కదా. ఏ పరిస్థితికి ఆ పరిస్థితి వేరు అనే స్పృహను, ఎవరినీ అంతలా నమ్మకూడదు అనే అవగాహనను పెంచాలి. ప్రతి సంఘటనను దేనికదే విడిగా చూడాలనే ఇంగితాన్నీ నేర్పాలి. ఇది స్కూల్లో పాఠంగా మారాలి. ఎనిమిదేళ్లు నిండిన ప్రతివాళ్లకు చెప్పాలి. అమ్మాయిలకు కూడా శారీరక దృఢత్వంతోపాటు మానసిక దృఢత్వమూ అవసరం అనే ఎరుకను పెంచాలి. శిక్షణనూ ఇవ్వాలి. ప్రతిరోజు అసెంబ్లీలో దీనికి సంబంధించిన చర్చ ఒకటి చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్లైన్లను ఎలా సంప్రదించాలో చెపుతూ అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రవర్తించాల్సిన తీరునూ వివరించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి అమ్మాయి తనకు నిర్భయలాంటి ప్రమాదకర స్థితి పొంచి ఉందనే జాగరూకతతో వ్యవహరించాలి. – కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్. -
అమ్మాయిల్ని ధైర్యంగా పెంచాలి
‘వరంగల్ యాసిడ్ ఘటన’.. నేను చదువుకునే రోజుల్లోనే జరిగింది. ఆ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. నేరస్తులపై నాటి పోలీసుల చర్య రాష్ట్ర వ్యాప్తంగా ఆడవాళ్లలో కొండంత విశ్వాసం నింపింది. అయితే మహిళలపై దాడులు తగ్గాలంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీసుకునే చర్యలతో పాటు మగవాళ్లలోనూ పరివర్తన రావాలి. పరివర్తన తెచ్చే బాధ్యతను తల్లిదండ్రులు, సమాజం తీసుకోవాలి. ఆడపిల్లలు కూడా ఆత్మరక్షణకు సదా సిద్ధంగా ఉండాలి. అబలలమని భావించకుండా.. వేధింపులను, దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలి’’ అంటున్నారు మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి. బాలికలు, యువతులు, మహిళల సంరక్షణ కోసం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటూ మహిళా ఐపీఎస్ ఆఫీసర్లలో తనకుంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దీప్తితో మాట్లాడుతున్నప్పుడు మహిళా ప్రపంచానికి ఆమె ఒక స్ఫూర్తి అని ‘సాక్షి’కి అనిపించింది. నాన్న మైనింగ్ శాఖలో అధికారి. తరచూ బదిలీలు అవుతుండేవి. వరంగల్, కాకినాడ, నల్లగొండ, చిత్తూరు.. ఇలా అనేక ప్రాంతాల్లో నివాసం ఉన్నాము. చిత్తూరు జిల్లాలో ఎక్కువగా నా బాల్యం గడించింది. చిత్తూరులోని గుడ్‌షెపర్డ్‌లో హైస్కూల్, ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్లో మరింత కష్టపడి చదివా. ఆ తర్వాత నాన్న గైడెన్స్ నా ఉన్నత విద్యాభ్యాసానికి ఎంతో తోడ్పడింది. .. కన్నీళ్లు ఆగలేదు ఐఐటీలో చేరాలన్నది నా కల. ఎలాగైనా ఐఐటీ సాధించాలని పట్టుదలతో ఉండేదాన్ని. హైదరాబాద్‌లో రామయ్య కోచింగ్ సెంటర్లో ప్రవేశానికి ప్రయత్నించా. అయితే అప్పటికే సీట్లు నిండిపోవటంతో అది కుదరలేదు. చిత్తూరు జిల్లా పక్కనే ఉన్న నెల్లూరు పట్టణంలో పేరున్న ఒక కోచింగ్ సెంటర్లో చేరాలని అనుకున్నా. అక్కడికి వెళ్లి ఓ లెక్చరర్ని అడిగితే, ‘‘చూడమ్మాయ్.. ఐఐటీలు అబ్బాయిలకు మాత్రమే సూట్ అవుతాయ్. ఇంజనీరింగ్, సైన్స్ సబ్జెక్టుల్లో వాళ్లు మాత్రమే రాణిస్తారు. అమ్మాయిలు అలా కాదు. మీరు ఐఐటీలో సెట్ కాలేరు. వెళ్లి చక్కగా డిగ్రీ చదువుకో’ అని చాలా నిరుత్సాహంగా మాట్లాడారు. ఆ లెక్చరర్ మాటలతో నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆరోజు రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను. నేను ఎదుర్కొన్న మొదటి వివక్ష అదే. ఎలాగైనా ఆ లెక్చరర్ అభిప్రాయాన్ని తప్పుగా నిరూపించాలనుకున్నా. పట్టుదలతో కోచింగ్ తీసుకుని ఐఐటీ సాధించా. అమ్మాయిలు ఏ రంగంలోనైనా అబ్బాయిలతో పోటీ పడవచ్చన్న ఆత్మవిశ్వాసం అప్పుడే నాకు కలిగింది. సైంటిస్టు అవ్వాలనుకున్నా ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరా. క్లాస్‌లో 60 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో ముగ్గురం మాత్రమే అమ్మాయిలం. ఢిల్లీ ఐఐటీ వాతావరణం బాగుంటుంది. అబ్బాయిలు, అమ్మాయిలు అన్న వివక్ష ఎక్కడా కనిపించదు. అప్పటి వరకు సైంటిస్టు కావాలనుకున్న నన్ను మా నాన్న సివిల్ సర్వీసెస్ వైపు మళ్లేలా చేశారు. ఐఐటీ పూర్తికాగానే హైదరాబాద్‌లో ఆర్సీ రెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చేరిపోయా. మొదటి ప్రయత్నంలో సక్సెస్ కాలేదు. రెండో ప్రయత్నంలో ఐపీఎస్ ర్యాంకు సాధించాను. కోపం కట్టలు తెంచుకుంది ఐపీఎస్ ఆఫీసర్ కాక ముందు ఒక ఘటన నాపై తీవ్ర ప్రభావం చూపింది. నాన్న సుపీరియర్ ఆఫీసర్ ఒకరు హైదరాబాద్‌లో ఉండేవారు. ఒక అబ్బాయి ఆయన కూతురు వెంటపడి ప్రేమించమంటూ వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో పైశాచికంగా హత్య చేశాడు. ఆ ఘటన నన్ను కుదిపేసింది. మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్నవారిపై నాలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ క్షణంలోనే అనుకున్నా.. ఇలాంటి దాడులు ఆగిపోవాలని. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్‌గా నా పరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నాను. మరీ ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాను. మెదక్ జిల్లాలో మహిళలపై దాడులు అరికట్టేందుకు ‘షీ భరోసా’లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఈవ్‌టీజింగ్ అరికట్టేందుకు పోలీస్స్టేషన్ల వారీగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని మహిళా కానిస్టేబుళ్లను పోలీసు అధికారులు, సిబ్బంది గౌరవించేలా చూస్తున్నాము. మరీ ముఖ్యంగా ప్రజలు తమ సమస్యలు ఎప్పుడైనా చెప్పుకునేందుకు ఎస్పీగా ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటున్నాను. అంబులెన్స్ కోసం చూడలేదు రంగారెడ్డి జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ఓ రోజు సీఎం బందోబస్తు ముగించుకుని తిరిగి వస్తుండగా వికారాబాద్ రూట్లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. మోటార్‌బైక్ నడుపుతున్న ఓ వ్యక్తిని వాహనం ఢీకొంది. అందరూ ఆ వ్యక్తి చనిపోయాడు అనుకున్నారు. నేను వాహనం దిగి అతని పల్స్ చూశాను. బతికి ఉన్నట్లు అనిపించింది. అంబులెన్స్ కోసం చూడకుండా వెంటనే, కారుతున్న ఆ రక్తగాయాలతోనే అతడిని నా వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లా. వికారాబాద్ ఆసుపత్రిలో చికిత్స తర్వాత హైదరాబాద్‌కు తరలించాం. బతికాడు. అతడితో పాటు నాకూ ప్రాణం వచ్చినట్లయింది. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో చాలా మంది ప్రజాప్రతినిధులు, అధికారులు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్బంలో 108 వాహనాలకోసం ఎదురుచూడకుండా సొంత వాహనంలో క్షతగాత్రులను తరలించిన వార్తలు విన్నప్పుడు సంతృప్తిగా ఉంటుంది. ఆ రెండు కేసులు..! ఐపీఎస్ అయ్యాక మొదట ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నల్లగొండ జిల్లాలో పనిచేశా. అదనపు ఎస్పీగా మొదటి పోస్టింగ్ వికారాబాద్ ఇచ్చారు. వికారాబాద్‌లో ఏఎస్పీగా పనిచే స్తున్న సమయంలోనే.. ఓ వ్యక్తి కన్నకూతురుపై అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మొదట ఈ కేసు మాకు ఒక సవాలుగా మారింది. తన కూతురును తీసుకుని వెళ్తుంటే గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారని ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్పీ శ్రీనివాస్‌తో కలిసి నేను ఘటనా స్థలానికి వెళ్లాను. తండ్రిని విచారిస్తే పొంతన లేకుండా సమాధానం చెబుతున్నాడు. తండ్రే అత్యాచారం చేసి, హత్యకు పాల్పడి ఉంటాడని మాకు అనుమానం వచ్చింది. ఘటనా స్థలంలో తండ్రి చెప్పులు కనిపించటంతో మా అనుమానం రూఢీ అయ్యింది. గట్టిగా విచారిస్తే నేరం అంగీకరించాడు. ఇప్పటికీ కదిలిపోతాను మరో కేసు గురించి కూడా చెప్పాలి. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో గత ఏడాది నవంబర్‌లో ఈ క్రైం చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన కుటుంబాలు ఉపాధి కోసం ముప్పిరెడ్డిపల్లికి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాయి. కలీం, హసీనా జంట అలాగే బాబు, పాపతో వలస వచ్చారు. 2017 డిసెంబర్ 6న వాళ్ల ఆరేళ్ల పాప ఖుష్బూ కనిపించకుండా పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరుసటిరోజు ముప్పిరెడ్డిపల్లిలోని మొండికుంట అనే ప్రాంతంలోని కల్వర్టులో ఆరేళ్ల పాప శవం కనిపించింది. క్లూస్‌టీం, పోలీసు జాగిలాలను రంగంలోకి దించి దర్యాప్తు వేగవంతం చేశాం. స్వయంగా నేనే కేసును దర్యాప్తు పర్యవేక్షించాను. మాకు అందిన క్లూస్ మేరకు అజయ్ అలియాస్ శమీరాజ్ బ్రార్ అనే అతన్ని నిందితునిగా గుర్తించాము. శమీరాజ్ బ్రార్ డిసెంబర్ 6వ తేదీన ఖుబ్బూ(6) చదువుకునే పాఠశాలకు వెళ్లి భోజన విరామం సమయంలో పాపకు చాక్లెట్లు ఇచ్చి బయటకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత గ్రామ శివారులో చిన్నారిపై కిరాతకంగా అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశాడు. శమీరాజ్ బ్రార్‌కు ఆరేళ్ల కూతురు ఉంది. మానవమృగంలా మారి శమీరాజ్ బ్రార్ ఖుష్బూలో తన కూతురును చూసుకోకపోవటం నన్ను కలిచివేసింది. ఈ కేసులో శమీరాజ్ బ్రార్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఇలాంటి కేసులు చూసినప్పుడల్లా నేను కదలిపోతాను. చిన్నారులు, మహిళల విషయంలో పురుషుల ప్రవర్తన మారాలని బలంగా కోరుకుంటున్నాను’’ అని ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు చందన దీప్తి. మగపిల్లలకో పాఠ్యాంశం ఉండాలి మహిళలపై దాడులు అరికట్టాలంటే ముందు పురుషుల్లో మార్పు రావాలి. మహిళలు తమ ఆత్మరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా వేధిస్తున్నారు అంటే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలి. తల్లిదండ్రులు తమ చిన్నారులకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలి. ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీటీమ్స్ ఏర్పాటు చేయటంతోపాటు గృహహింస చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. అయితే మహిళల సంరక్షణ కోసం మరికొన్ని చర్యలు తీసుకోవచ్చు. నిర్మానుష్య ప్రదేశాల్లోనే ఎక్కువగా మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇలాంటి ప్రదేశాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేస్తే దాడులు తగ్గుతాయి. చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించాలన్న విషయం మగపిల్లల మనస్సు ల్లోకి ఎక్కించేందుకు పాఠ్యాంశాల్లో మహిళల ఔన్నత్యం గురించి తెలియజెప్పే అంశాలను చేరిస్తే బాగుంటుంది. – మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి – కాకోళ్ల నాగరాజు, సాక్షి, మెదక్ -
మహిళల భద్రతకు అత్యాధునిక టెక్నాలజీ
శ్రీనగర్‌కాలనీ: నగరంలో మహిళల రక్షణ భద్రతకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాలను అదుపులోకి తెచ్చామని అడిషనల్ సీపీ స్వాతి లక్రా అన్నారు. మంగళవారం లామకానలో సైబర్ స్టాకింగ్, మహిళారక్షణ, పోలీసు వ్యవస్థలో మార్పులు తదితర అంశాలపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నామని, నేరం చేసిన వారు తప్పించుకోలేరన్నారు. మహిళల్లోని భయాలను తొలగిస్తూ వారికి అవగాహన కల్పిస్తూ వారు నిర్భయంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు, మహిళా పోలీసుల సంఖ్య పెంచామని, మహిళల కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా సంఘటన జరిగితే క్షణాల్లో పోలీసులు అక్కడ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. . సోషల్ మీడియాల సహకారంతో ఎప్పటికప్పుడు ఉన్నత సేవలు అందిస్తున్నట్లు వివరించారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని నేరం చేసిన వారెవరూ తప్పించుకోలేరన్నారు. ఈ సందర్భంగా పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సామాధానంఇచ్చారు. విద్యార్థులు, పౌరులు పోలీస్ స్టేషన్లలను దర్శించి టెక్నాలజీ వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. -
అభయమివ్వని నిర్భయ!
చట్టం చేసి చేతులు దులుపుకున్న యంత్రాంగం మహిళలకు అవగాహన కల్పించని వైనం.. అధికారులకూ తెలియని విషయాలెన్నో నీరుగారుతున్న ‘నిర్భయ-2013’ చట్టం మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రవేశపెట్టిన నిర్భయ చట్టంపై సరైన అవగాహన లేక...ఎంతో మంది బాధితులు దాన్ని వినియోగించుకోవడం లేదు. చట్టాన్ని చేసిన యంత్రాంగాలు తమ పని అరుుపోరుుందన్నట్లు చేతులు దులుపుకొన్నారుు. ఫలితంగా ‘నిర్భయ’ అంటే ఏమిటి? అందులో ఏముంది? అది ఎన్ని రకాలుగా రక్షణ ఇస్తుంది? ఎలాంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని ప్రయోగించాలి? అనే అంశాలు మహిళలకే కాదు చివరకు దర్యాప్తు అధికారుకూ తెలియవు. దీంతో నిర్భయ చట్టం ఆశించిన ఫలితాలివ్వట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: కూకట్పల్లి పరిధిలోని శ్రీనివాసకాలనీ మెడికల్ సొసైటీలో నివసించే సుజాత ఇంటి యజమాని వేధింపులు, వ్యవహారశైలి భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ‘నిర్భయ’ చట్టమంటే కేవలం అఘారుుత్యాలకు, లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టమనే భావన అనేక మందిలో ఉంది. ఈ కారణంగానే చట్ట పరిధిలో తమకు ఉన్న రక్షణ విషయం తెలియక అర్ధాంతంరంగా తనువు చాలిస్తున్నారు. సుజాత ఉదంతం ఈ కోణంలోనిదే. ఆమెకు ఎదురైన వేధింపులను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడింది. నిర్భయ చట్టం గురించి పూర్తిగా తెలిసి...ధైర్యంగా ఫిర్యాదు చేసి ఉంటే సుజాతకు న్యాయం జరిగి ఉండేది. ఏదైనా కొత్త చట్టం తీసుకురావడంలో నిందితుల్ని కఠినంగా శిక్షించడానికి అనేది పైకి కనిపించే అంశమైతే...అంతర్గతంగా ఉండే దీని ప్రధాన ఉద్దేశం ఆ తరహా నేరాలు పునరావృతం కాకుండా చూడటం. ‘ఢిల్లీ ఉదంతం’తో కదిలిన కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నిర్భయ చట్టం-2013 ఈ కోణంలో ఆశించిన స్థారుు ఫలితాలు ఇవ్వట్లేదు. దీనిపై అతివలకు పూర్తిస్థారుులో అవగాహన ఉండట్లేదు. ‘నిర్భయ’ ప్రకారం ఆయా నేరాలకు శిక్షలు ఇలా... ►ఉద్దేశపూర్వకంగా యాసిడ్ దాడి చేసి గాయపరిస్తే ఐపీసీ సెక్షన్ 326-ఎ ప్రకారం పదేళ్లు లేదా జీవితఖైదు, జరిమానా ►ఉద్దేశపూర్వకంగా యాసిడ్ దాడికి ప్రయత్నిస్తే ఐపీసీ సెక్షన్ 326-బి ప్రకారం ఐదు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా ► స్త్రీ తత్వానికి భంగం కలిగించేలా, అవమానించేలా, దౌర్జన్యం/బలప్రయోగం చేస్తే ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ఏడాది నుంచి ఐదేళ్ల వరకు శిక్ష, జరిమానా ►లైంగిక వేధింపులు (ఫోన్ ద్వారా అరుునా), అశ్లీల చిత్రాలు చూపించడం చేస్తే ఐపీసీ సెక్షన్ 354-ఎ ప్రకారం మూడేళ్ల జైలు, జరిమానా ►దౌర్జన్యం/బలప్రయోగం ద్వారా వివస్త్రను చేస్తే ఐపీసీ సెక్షన్ 354-బి ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా ► స్త్రీల రహస్యాంగాలను చాటుగా చూసినా, ఫొటోలు తీసినా ఐపీసీ సెక్షన్ 354-సి ప్రకారం ఏడాది నుంచి ఏడేళ్ల జైలు ►దురుద్దేశంతో స్త్రీని భౌతికంగా కానీ, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా కానీ పదేపదే వెంబడిస్తే ఐపీసీ సెక్షన్ 354-డి ప్రకారం ఐదేళ్ల జైలు, జరిమానా ►మహిళల్ని అక్రమ రవాణా చేసి వ్యభిచారం చేరుుస్తే ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం ఏడు నుంచి పదేళ్ల జైలు, జరిమానా ►ఒకరి కంటే ఎక్కువ మందిని/మైనర్‌ను అక్రమ రవాణా చేసి వ్యభిచారం చేరుుస్తే గరిష్టంగా 14 ఏళ్లు లేదా జీవితఖైదు విధిస్తారు ►{పభుత్వ ఉద్యోగి లేదా పోలీసు అధికారి అక్రమ రవాణాకు పాల్పడితే మరణించే వరకు జీవిత ఖైదు ►అక్రమ రవాణాకు గురైన వారిని వ్యభిచారంలోకి దింపితే ఐపీసీ సెక్షన్ 370-ఎ ప్రకారం ఐదు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా ►అత్యాచారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష లేదా చనిపోయే వరకు జీవిత ఖైదు ►అత్యాచారం కారణంగా లేదా గాయపరిచిన కారణంగా సదరు మహిళ చనిపోతే ఐపీసీ 376-ఎ ప్రకారం 20 ఏళ్ల జైలు లేదా మరణించే వరకు జీవిత ఖైదు ►న్యాయబద్ధంగా విడిపోరుు వేరుగా నివసిస్తున్న భార్యను బలాత్కరిస్తే ఐపీసీ సెక్షన్ 376-బి ప్రకారం రెండు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా ►అధికారాన్ని వినియోగించి స్త్రీలను లొంగదీసుకుంటే ఐసీపీ సెక్షన్ 376-సి ప్రకారం ఐదు నుంచి పదేళ్ల జైలు, జరిమానా ►మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 376-డి ప్రకారం 20 ఏళ్ల జైలు లేదా చనిపోయే వరకు జీవితఖైదు ►ఒకటి కంటే ఎక్కువ సార్లు అత్యాచారం చేస్తే ఐపీసీ సెక్షన్ 376-ఇ ప్రకారం మరణించే వరకు జీవితఖైదు ►మహిళల్ని అల్లరిపెట్టి అవమానపరిస్తే..వేధింపులకు గురిచేస్తే ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం మూడేళ్ల జైలు, జరిమానా వాటన్నింటి సమాహారమే... 2012 డిసెంబర్లో దేశ రాజధానిలో చోటు చేసుకున్న నిర్భయ ఉదంతంతో యావత్ భారతావనీ గళం విప్పింది. ఢిల్లీ వీధులు దద్దరిల్లే స్థారుులో జరిగిన ఉద్యమంతో కంగుతిన్న కేంద్ర ప్రభుత్వం ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు వర్మ కమిటీ ఏర్పాటు చేసింది. ఆపై దీన్ని పట్టించుకోని కేంద్రం ఆ కమిటీ సిఫార్సుల్ని పొందు పరచకుండా ‘ఉరి’తో కూడిన ఆర్డినెన్సను అమలులోకి తెచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో పార్లమెంట్లో చర్చించి నిర్భయ చట్టం తీసుకువచ్చింది. 2013 ఏప్రిల్ 2 నుంచి అమలులోకి వచ్చిన ఈ యాక్ట్‌లో ప్రత్యేకించి ఏర్పాటు చేసినవంటూ పెద్దగా లేవు. అప్పటికే ఐపీసీలో ఉన్న యాసిడ్ దాడులు, ఆత్మగౌరవానికి, స్త్రీ తత్వానికి భంగం కలిగించడం, అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి మహిళా సంబంధిత నేరాలను క్రోడీకరించి ఒకే గొడుకు కిందికి తెస్తూ విసృ్తత పరిచింది. ఒక్కో సెక్షన్‌కు ఎ,బి,సి,డి,ఇ... ఇలా క్లాజ్లు చేరుస్తూ విపులీకరించారు. అధికారులకూ తెలియని అంశాలెన్నో... నిర్భయ చట్టంలో ఉన్న కీలకాంశాలపై సాక్షాత్తు పోలీసు అధికారులకే అవగాహన ఉండట్లేదు. ఫలితంగా దీని పరిధిలోకి వచ్చే కేసుల్ని సైతం మూస ధోరణిలోనే పాత సెక్షన్ల కిందే నమోదు చేస్తున్నారు. ‘నిర్భయ’లో ఉన్న మూడు అత్యంత సున్నితాంశాల కారణంగా దీని కింద నమోదయ్యే కేసుల్లో శిక్షలు పడే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో వైద్యుల నివేదిక సైతం న్యాయస్థానంలో ఆధారంగా మారుతుంది. ఈ కేసుల దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. న్యాయస్థానం సైతం దీని విచారణను ఆరు నెలల్లో పూర్తి చేసి తీర్పు ఇవ్వాలి. సాధారణ కేసుల్లో నిందితులకు ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ అనే అంశం కలిసి వచ్చి నిర్దోషులుగా బయటపడుతుంటారు. అరుుతే నిర్భయ చట్టం కింద నమోదైన కేసులకు మాత్రం ఇది వర్తించదు. బాధితురాలు చెప్తోంది కాబట్టి కచ్చితంగా నేరం చేసి ఉంటాడనే అంశం పరిగణలోకి వస్తుంది. సాంకేతికంగా దీన్ని ప్రిజెమ్షన్ అంటారు. వీటివల్ల ఈ కేసుల్లో శిక్షల శాతం పెరిగి మరొకరు నేరం చేయడానికి భయపడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇవి గుర్తుంచుకోండి... మహిళలపై జరుగుతున్న దారుణాల్లో సగం కూడా పోలీసుల వరకు రావడం, రికార్డుల్లోకి ఎక్కడం జరగట్లేదు. కొన్ని సందర్భాల్లో అనేక మంది ‘సుజాత’లుగా మారుతున్నారు. దీనికి పరువు, కుటుంబ నేపథ్యం వంటి ఎన్నో కారణాలు ఉంటున్నారుు. ఓ బాధితురాలి మౌనంతో వస్తున్న ఈ ఉదాసీనత మరింత మంది ముష్కరులు రెచ్చిపోవడానికి ఊతం ఇచ్చినట్లేనని గుర్తుంచుకోండి. ఈ అంశానికి సంబంధించి చట్టం, పోలీసులు బాధితులకు కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించారు. ► మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి పరిధితో సమస్య లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. ► ఎట్టిపరిస్థితుల్లోనూ బాధితుల పేర్లు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారు. ► అవసరమైతే నిందితుల అరెస్టు సంబంధించిన అంశాన్నీ మీడియాకు తెలపరు. ► ఇలాంటి కేసుల్లో వీలున్నంత వరకు మహిళా అధికారిణులకే దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తారు. ► కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీరు పోలీసుస్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా దర్యాప్తు అధికారులు మీ వద్దకే వస్తారు. ► న్యాయస్థానం కూడా బాధితుల్ని ప్రత్యేకంగా పరిగణిస్తుంది. ►వాదోపవాదనలన్నీ ఇన్ కెమెరా (రహస్య పద్దతి)లోనే జరుగుతారుు. -
మహిళల రక్షణకు బాధ్యత లేదా: నేరెళ్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల రక్షణ బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవడంలేదని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద విమర్శించారు. హైదరా బాద్‌లో గురువారం ఆమె మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. కొల్లాపూర్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, సమస్యలపై వివరించడానికి సమయం అడుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నరు సమయం కూడా ఇవ్వడం లేదని శారద విమర్శించారు. -
నిర్ధారణ అంతంతే..
* లైంగిక వేధింపుల కేసుల్లో నిర్ధారణ 3శాతం మించడం లేదు * ఐదు శాతం కంటే తక్కువ మందికి మాత్రమే పరిహారం * మహిళల రక్షణ కోసం కమిటీలు కూడా లేవు సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో రోజూ ఏదో ఒక మూల మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు సర్వసాధారణమైపోయాయి. ఇలాంటి ఘటనల్లో గడప దాటి పోలీస్‌స్టేషన్ వరకు వచ్చే కేసులు చాలా తక్కువ. సమాజం పేరిట, కుటుంబ గౌరవం పేరిట ఎన్నో అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనలు నాలుగ్గోడల మధ్యనే సమాధి అయిపోతున్నాయి. పోనీ ఇలాంటి ఎన్నో అడ్డంకులను దాటుకొని ధైర్యంగా పోలీస్‌స్టేషన్ వరకు వచ్చిన కేసుల్లో కూడా నిర్ధారణ ఎంత వరకు జరుగుతోంది అంటే కేవలం 3శాతం మించడం లేదన్న సమాధానం వినిపిస్తోంది. ఈ విషయాలన్నీ మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న లైంగిక వేధింపుల కేసుల్లో నిర్ధారణ అయి నిందితులకు శిక్షలు పడుతోంది 3శాతం మాత్రమే. అంటే ప్రతి 100 మంది నిందితుల్లో ముగ్గురికి మాత్రమే జైలు శిక్ష పడుతోంది. మిగతా 97 మంది సులువుగా చట్టం చేతుల నుంచి తప్పించుకుంటున్నారు. ఇక రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ తరహా కేసుల నిర్ధారణ శాతం ఎలా ఉందో గమనిస్తే మైసూరు, బాగల్కోటె జిల్లాల్లో రాష్ట్రంలోనే అధికంగా 4శాతం కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఇక కల్బుర్గి, బీదర్‌లో 2శాతం, ఉడుపిలో 1.7శాతం, హావేరిలో 1.6శాతం కేసులు నిర్ధారణ అవుతున్నట్లు తెలుస్తోంది. పరిహారమూ అందడం లేదు... ఇక ఇదే సందర్భంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు అందజేయాల్సిన పరిహారం సైతం వారికి సరిగ్గా అందడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 5శాతం మంది బాధితులకు మాత్రమే నష్ట పరిహారం అందిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత చట్టాల ప్రకారం యాసిడ్ దాడి కేసుల బాధితులకు రూ.3లక్షలు, లైంగిక దాడుల బాధితులకు రూ.2లక్షలు, హ్యూమన్ ట్రాఫికింగ్‌లో చిక్కుకొని బయటపడిన బాధితులకు పునర్వసతి కల్పించేందుకు రూ.2లక్షలు ప్రభుత్వం పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే 100 మంది బాధితుల్లో కేవలం ఐదుగురికి మాత్రమే పరిహారం అందుతోంది. మిగిలిన బాధితులు ఏళ్ల తరబడి తమకు అందాల్సిన పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. 90శాతం సంస్థల్లో రక్షణ కమిటీలు కూడా లేవు....... పనిచేసే ప్రాంతాల్లో ఉద్యోగినులపై లైంగిక దాడులను నిరోధించేందుకు గాను రూపొందించిన ‘సెక్సువల్ హెరాష్‌మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్కప్లేస్(ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్-2013’ ప్రకారం ప్రతి సంస్థలోనూ మహిళల రక్షణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి ఒక మహిళ అధ్యక్షత వహించాలి. అయితే రాష్ట్రంలోని సంస్థల్లో కేవలం 10శాతం సంస్థలు మాత్రమే ఈ కమిటీలను ఏర్పాటు చేశాయి. మిగిలిని 90శాతం సంస్థల్లో మహిళల భద్రతకు అవసరమైన రక్షణ కమిటీలను ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. -
మహిళల రక్షణకు ప్రాధాన్యం
అతివల రక్షణకు కొత్త సాఫ్ట్వేర్ శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి కొత్త సీపీ అమిత్ గార్గ్ విశాఖపట్నం: మహిళల రక్ష ణకు తొలి ప్రాధాన్యమిస్తానని కొత్త పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన సీపీ గా బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ కమిషనరేట్‌లో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ నగరంలో శాంతి భద్రతలు కాపాడానికి అహర్నిశలు శ్రమిస్తానన్నారు. మహిళల రక్షణ కోసం కొత్త సాఫ్ట్వేర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ సాఫ్ట్వేర్లను రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ జె.వి.రాముడు ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఆయనను డీఐజీ పి.ఉమాపతి, ఎస్పీ కోయ ప్రవీణ్, డీసీపీలు త్రివిక్రమవర్మ, రవికుమార్‌మూర్తి, రాంగోపాల్ నాయక్, ఏడీసీపీలు వరదరాజు, మహేంద్రపాత్రుడు, వెంకటేశ్వరావు, మెరైన్ ఏసీపీ మహ్మద్‌ఖాన్, సీఐలు, ఎస్ఐలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఐ క్లిక్’..మహిళలకు ‘అభయం’ మహిళల రక్షణకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాఫ్ట్వేర్లను రూపొందించారు. వాటిని నగర మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు ఈ కార్యక్రమాలకు హాజరవుతారు. ఉదయం 11గంటలకు సీఎంఆర్ ప్లాజాలో హోమ్ మంత్రి ‘ఐ క్లిక్ కౌసిక్’ సాంకేతిక పరికరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పోలీస్ కమిషనరేట్‌లో ఐ క్లిక్కు సంబంధించిన సీ అండ్ సీ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. సీఎఆర్లో జరిగే ‘అభయం’ ఆవిష్కరణ సభలో పాల్గొని సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించి ప్రసంగిస్తారు. రాష్ట్ర మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఐ క్లిక్ పరికరాలను నగరంలోని షాపింగ్‌మాల్స్, ఏటీఎం సెంటర్లు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఆపదలో ఉన్న మహిళలు ఈ పరికానికి ఉంటే బటన్ నొక్కితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సీ అండ్ సీ సెంటర్ ఈ మొత్తం ఆపరేషన్‌ను సమన్వయం చేస్తుంది. ‘అభయం’ సాఫ్ట్‌వేర్‌ను స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని ఐదు మొబైల్ నెంబర్లను దానిలో నిక్షిప్తం చేసుకుంటే ఆపదలో ఉన్నప్పుడు ఆ నంబర్లకు ఎస్ఎమ్ఎస్ రూపంలో సమాచారం వెళుతుంది. ఈ సదుపాయాల గురించి మహిళలకు అవిగాహన కల్పించడం కోసం విస్తృత ప్రచారం కల్పించనున్నారు. -
పారదర్శక పాలనే అజెండా!
⇒ప్రభుత్వ భూముల పరిరక్షణ ⇒క్రమబద్ధీకరణకు అదనపు కౌంటర్లు ⇒జిల్లాలో రెండు నిర్భయ కేంద్రాలు ⇒ఆసరాపై ఫిర్యాదులు లేకుండా చేస్తా ⇒విద్యా ప్రమాణాలు మెరుగునకు చర్యలు ⇒సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తాం ⇒‘సాక్షి’తో హైదరాబాద్ కలెక్టర్ నిర్మల సాక్షి, సిటీబ్యూరో: పారదర్శక పాలన.. ప్రజా ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం.. పేదలకు పక్కా ఇళ్లు.. విద్యారంగంలో వెనుకబాటుకు చెక్.. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిచడం.. మహిళా రక్షణకు నిర్భయ కేంద్రాలు..ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు.. ఉద్యోగుల్లో జవాబుదారి తనాన్ని పెంచడం.. ప్రతి సోమవారం నిర్వహించేప్రజావాణి కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు.. అర్హులకు పింఛన్ల పంపిణీ.. ప్రభుత్వ భూముల పరిరక్షణ.. ఇవీ తన ముందున్న లక్ష్యాలని కలెక్టర్ కె.నిర్మల స్పష్టం చేస్తున్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు మండలాలు, బస్తీల వారీగా భూ వివరాలు సేకరించడంతోపాటు వాటి పరిరక్షణపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. సంబంధిత రెవెన్యూ అధికారులు, తహశీల్దారులను ఆదేశించామని తెలిపారు. జీఓలు 58, 59లకు అనుగుణంగా ప్రభుత్వ భూముల్లోని అభ్యంతరకర ఇళ్ల క్రమబద్ధీకరణ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. పేద ప్రజలు తమ ఇళ్లను క్రమబద్ధీకరించుకునేందుకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని తహశీల్దారులకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఆసరాపై ఫిర్యాదులు లేకుండా చేస్తా.. ఆసరా పథకం కింద అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నిర్మల తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో లక్షా నాలుగు వేల పింఛన్లు మంజూరయ్యాయని, పెండింగ్‌లో ఉన్న పింఛ న్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. చార్మినార్, ఆసిఫ్‌నగర్, బహుదూర్‌పురా మండలాల్లో పింఛన్లకు సంబంధించి సమస్యలున్నాయని, వాటిని సత్వరమే అధిగమించగలమన్నారు. ఆహార భద్రతా కార్డులు అర్హులైన వారందరికీ అందిస్తామని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం సక్రమంగా కొనసాగేలా నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, చిన్న పిల్లల పరిపుష్టి కోసం ఒక పూట సంపూర్ణ భోజన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. విద్యా ప్రమాణాల మెరుగు కోసం... జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగు కోసం తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పదోతరగతి ఉత్తీర్ణతలో హైదరాబాద్ వెనుకబడి ఉందని.... ఫలితాల మెరుగు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలను మెరుగు పరచడంతోపాటు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణంపై దృష్టి సారిస్తామని చెప్పారు. మహిళల రక్షణ కోసం నిర్భయ కేంద్రాలు... మహిళలపై జరుగుతున్న ఆ సాంఘిక దాడులు, గృహ హింస నుంచి కాపాడేందుకు హైదరాబాద్ జిల్లాలో రెండు నిర్భయ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యాన నగరంలో పేట్లబురుజు, గాంధీనగర్‌ల్లో నిర్భయ కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్టు చెప్పారు. బాలికల వివాహం సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్యాణ లక్ష్మి పథకం కింద అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. పటిష్టంగా ‘మీ కోసం’.. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి (మీకోసం) కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఇందులో వచ్చిన ప్రజా ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యతనివ్వటంతోపాటు సత్వర పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటామన్నారు. అప్పటివరకు దరఖాస్తులతో కలెక్టరేట్ చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోవద్దని జిల్లా ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. -
ఒంటరి ‘గస్తీ’ వొద్దు..!
‘మహిళా మార్షల్స్’ విధులపై ఉన్నతాధికారుల ఆదేశాలు ఇతర బాధ్యతలు అప్పగించవద్దని హుకుం సాక్షి, ముంబై: మహిళల రక్షణ కోసం నగరంలో ఏర్పాటుచేసిన మహిళా బీట్ మార్షల్స్ వ్యవస్థను అధికారులు నీరుగారుస్తున్నారు. బీట్ మార్షల్స్‌ను గస్తీ కోసం కాకుండా ఇతర పనులు అప్పగిస్తున్నారు. దీంతో గస్తీ సమయంలో ఒక్కొక్కరే బండిపై వెళ్లాల్సి వస్తోంది. దీంతో అసలు ఉద్దేశమే దెబ్బతినే అవకాశం ఉందని గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో మహిళ బీట్ మార్షల్స్‌ను ద్విచక్ర వాహనంపై ఒంటరిగా పంపించవద్దని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేగాకుండా వారికి గస్తీ మినహా ఇతర బాధ్యతలు అప్పగించరాదని అన్ని పోలీసు స్టేషన్ల ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. నగరంలో ఈవ్‌టీజింగ్, రోడ్‌సైడ్ రోమియోలు, ఆకతాయిల ఆగడాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కాలిబాటన వెళ్లే యువతులకు, మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ముంబై పోలీసు శాఖలో శిక్షణ పొందిన 200 మందికి పైగా మహిళ బీట్ మార్షల్స్‌ను రంగంలోకి దింపారు. నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో ఇద్దరు మహిళ బీట్ మార్షల్స్‌ను నియమించారు. వీరికి ఒక బైక్, రివాల్వర్, వాకీటాకీ ఇచ్చారు. గస్తీ నిర్వహించే సమయంలో ఇద్దరిలో ఒకరు బైక్ నడుపుతారు. వెనక కూర్చున్న వారి చేతిలో వాకీటాకీ, రివాల్వర్ ఉంటుంది. వీరు తమ పోలీసు స్టేషన్ హద్దులో రోడ్లపై తిరుగుతూ ఉంటారు. కాని అనేక సందర్భాలలో ఇద్దరిలో ఒకరికి ఇతర బాధ్యతలు అప్పగిస్తున్నారు. గస్తీ నిర్వహించేందుకు బైక్‌పై ఒక్కరినే పంపిస్తున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు ప్రధాన కార్యాలయ వర్గాలు ఇద్దరిని తప్పకుండా పంపించాల్సిందేనని ఆదేశించారు. ‘అత్యవసర సమయంలో నిందితులను బైక్‌పై వెంబడిస్తూ వాకీటాకీలో మాట్లాడటం కష్టం.. దీంతో సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు లేదా జంక్షన్ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సమాచారం చేరవేసేందుకు అవకాశం ఉండదు. దాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు తప్పించుకుని పారిపోయే ప్రమాదం ఉంది. దీంతో వాకీటాకీ, రివాల్వర్ ఉన్న మరో మార్షల్స్‌ను తప్పనిసరి వెంట పంపించాల్సిందే..’నని ఇన్స్పెక్టర్లందరికి ఆదేశాలు జారీచేశారు. ఈ బీట్ మార్షల్స్ బైక్‌లను పోలీసు స్టేషన్ ఆవరణలో పార్కింగ్ చేసే సౌకర్యం కల్పించాలని, రాత్రులందు ఈ ైబైక్లను సొంత పనులకుగాని, అధికారిక పనులకుగాని పురుష సిబ్బంది వాడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కచ్చితంగా లాగ్ బుక్ మెంటైన్ చేయాలని, విధులు పూర్తయిన తర్వాత రివాల్వర్, వాకీటాకీ, బైక్ తాళాలు, లాగ్ బుక్ భద్రపర్చుకునేందుకు పోలీసు స్టేషన్లో ప్రత్యేకంగా ఓ లాకర్ సమకూర్చాలని సంబంధిత పోలీసు స్టేషన్లకు హుకుం జారీచేశారు. -
చట్టాలు కాదు.. భరోసా ఇవ్వండి
- లైంగిక దాడులపై మహిళల గళం - శిక్షల అమలులో వేగం అవసరమని అభిప్రాయం కుత్బుల్లాపూర్: ‘మహిళా రక్షణ’ అనేది చర్చించుకోవడానికే గాని, ఆచరణలో మాత్రం విఫలమవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారిపై దాడులు జరుగుతునే ఉన్నాయి. ‘మహిళా రక్షణకు రాజీలేని చర్చలు, చట్టంలో సమూల మార్పులు చేసి వారికి పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామ’ని ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మన హైటెక్ నగరంలో మహిళలకు హైటెక్ లెవల్ సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పి.. అందుకు భరోసాగా ఈ మధ్యే ఐటీ కారిడార్‌లో మహిళా పోలీస్‌స్టేషన్‌ను సైతం ప్రారంభించారు. కానీ ఇవేవీ మహిళల భద్రతకు భరోసా ఇవ్వలేక పోతున్నాయి. మహిళా హెల్ప్‌లైన్, మహిళా భద్రత చట్టాలు, మహిళా పోలీస్స్టేషన్లు.. ఎన్ని ఉన్నా మృగాళ్ల వికృత చేష్టలు సాగుతునే ఉన్నాయి. వ్యవస్థలో లోపాలు, చట్టంలోని లొసుగులతో శిక్షల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉండడంతో వారి ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. నగర శివారులో స్నేక్ గ్యాంగ్ ఆగడాలు మరవక ముందే.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో తల్లీ కూతుళ్లపై సామూహిక లైంగిక దాడి జరగడం శోచనీయం. ఈ విషయంపై పలు మహిళా సంఘాల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇలాండి ఘటనల్లో దాడికి పాల్పడ్డవారికి కఠిన శిక్షలు వేగంగా అమలు చేయాలన్నారు. శిక్షలు వేగవంతం చేయాలి రెండేళ్ల కిందట ఢిల్లీలో మెడికల్ విద్యార్థినిపై జరిగిన ఘటన దేశాన్ని కుదిపేసింది. తర్వాత నిర్భయ లాంటి చట్టాలను తీసుకువచ్చినా ఉపయోగం లేదు. పాలకులకు మహిళల పట్ల ఉండే చిత్తశుద్ధి తాత్కాలికమే అని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి, ఇప్పటికైనా లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. శిక్షలు కఠినంగా వేగంగా అమలు చేయాలి. - అనురాధ, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షురాలు కౌన్సెలింగ్ సెంటర్లు అవసరం ‘నిర్భయ చట్టం’ అమల్లోకి వచ్చిన తర్వాత లైంగిక దాడుల సంఖ్య మరింత పెరిగింది. వావి వరసలు మరిచి వేధిస్తున్నారు. చట్టాలు చుట్టాలుగా ఉండకుండా ఉండాలంటే నిందితులకు కఠిన శిక్షలు పడాలి. పూనం మాలకొండయ్య ఆధ్వర్యంలో కమిటీ వేసినా లైంగిక వేధింపులు ఆగకపోవడం సిగ్గుచేటైన విషయం. అన్ని చోట్లా కౌన్సెలింగ్ సెంటర్లు పెట్టి పురుషులకు శిక్షలపైన, తదుపరి పరిణామాలపైనా అవగాహన కల్పించాలి. - శివపార్వతి, జాగృతి సొసైటీ అధ్యక్షురాలు స్వేచ్ఛ కూడా లేదు.. అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగినపుడే మనకు స్వాతంత్య్రం వచ్చినట్టు.. అని ఆనాడు గాంధీ చెప్పారు. కానీ ప్రస్తుత పాలక వర్గాల నిర్లక్ష్యం వల్ల మహిళ ఇంట్లో ఉన్నా లైంగిక దాడులు జరుగుతున్నాయి. మార్కెట్, బడికి, గుడికి వెళ్లినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. యాసిడ్ దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు బాధాకరం. స్వాతంత్య్రం కాదు కదా.. స్వేచ్ఛగా తిరిగే అవకాశం కూడా లేదు. - చెరుకు లావణ్య గౌడ్, పట్టణ స్లమ్ సమాఖ్య ఉపాధ్యక్షురాలు బహిరంగ శిక్షలు తప్పనిసరి లైంగిక దాడులకు పాల్పడుతున్న వారు కూడా ఓ తల్లికి పుట్టిన వారే. వారు ఏం చేస్తున్నారో గుర్తు చేసుకుంటే ప్రతి వ్యక్తిలో మార్పు వస్తుంది. లైంగిక దాడులకు పాల్పడేవారిని బహిరంగంగా శిక్షించాలి. - కృష్ణవేణి, ఉజ్వల మహిళా మండలి అధ్యక్షురాలు -
మహిళల రక్షణకు ప్రత్యేక కార్యక్రమం
ఏలూరు : రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను నిరోధించి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా సమాజంలోని యువత, ఇతరుల భాగస్వామ్యంతో చేపట్టే కార్యక్రమాలను స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత రూపొందించారు. ఆదివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి నివాసంలో సుజాత సీఎం చంద్రబాబునాయుడును కలిసి కార్యక్రమాన్ని వివరించారు. ఈ సందర్భంగాసుజాతను సీఎం అభినందించారు. సమాజంలోని యువతను చైతన్యపరిచి వారి ద్వారా మహిళలపై జరిగే దాడులను అరికట్టనున్నట్టు మంత్రి చెప్పారు. -
కదలండి ముందుకు.. నిర్భయంగా..
ఢిల్లీలో నిర్భయ.. హైదరాబాద్‌లో అభయ.. ఆడపిల్ల బయటకు వెళ్లిందంటే చాలు ఇంటికొచ్చేవరకూ తల్లిదండ్రులకు టెన్షన్. ఎటువైపు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో.. ? ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో..? అన్న భయం వారిని అనునిత్యం వెంటాడుతుంది. కారణం.. నిత్యం ఎక్కడో ఒకచోట యువతులపై లైంగికదాడులు జరుగుతుండడం. కామాంధులకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. ఏదో ఏ మూల ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులను బాధిస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో యువతులు స్వీయరక్షణపై దృష్టి సారిస్తున్నారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరి ఆసక్తిని గమనిస్తున్న వివిధ కంపెనీలు రక్షణ కోసం వివిధ రకాల ఉత్పత్తులు చేస్తూ.. మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ వస్తువులన్నీ ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్‌తోపాటు నగరంలోని వివిధ షాపుల్లో లభిస్తున్నాయి. వాటిలో కొన్ని... - కరీంనగర్ క్రైం * మహిళల రక్షణకు మార్గాలనేకం.. * లైంగిక దాడులు ఎదుర్కొనేందుకు కొత్త ఉత్పత్తులు * ఇప్పటికే వినియోగంలో పెప్పర్ స్ప్రే, మొబైల్ యాప్స్ * అందుబాటులోకి రానున్న బ్రాస్లెట్లు, నెక్లెస్‌లు, జాకెట్లు బజ్జింగ్ యాంటీ రేప్ డివైస్ ఈ అత్యాచార వ్యతిరేక పరికరాన్ని మొబైల్గానీ.. బ్యాగ్కుగానీ.. చేతికిగానీ.. వేలాడదీసుకోవచ్చు. ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే తప్పించుకునే క్రమంలో ఈ పరికరానికి ఉన్న రాడ్ లాంటిది లాగితే చాలు పెద్ద శబ్దంతో సుమారు 90 డెసిబుల్స్‌తో అలారం మోగుతుంది. ఈ శబ్దంతో చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమవుతారు. దుండగులు పారిపోయే అవకాశాలుంటాయి. ఈ డివైస్ చిన్నగా.. అందంగా ఉండడంతోపాటు చూడడానికి అలంకార వస్తువుగా కనిపిస్తుంది. తీసుకెళ్లడం కూడా చాలా సులభం. బరువు తక్కువగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ యాప్స్... స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్లో పలు రకాల మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అనుకోని ప్రమాదం ఏర్పడినప్పుడు స్పందించే విధానం, కాపాడుకోవడానికి ప్రత్యేకంగా పలు కంపెనీలు యాప్స్ రూపొందించాయి. మీ మొబైల్లో ‘విత్ యూ, మైపానిక్ అలారం, ఏఓఎస్ ఎమర్జెన్సీ, గ్లోబల్ ఎస్ఓఎస్, అటాక్ అలారం, ఎస్ఎంఎస్ వంటి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెప్పర్ స్ప్రే స్వయరక్షణ కోసం మహిళలు, యువతులు ఎక్కువగా వినియోగిస్తున్న ఉత్పత్తులో పెప్పర్ స్ప్రే ప్రధానమైంది. నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా యువతులు వారి వెంట పుప్పర్ స్ప్రే ఉంచుకోవడం పరిపాటిగా మారింది. దాడి చేయడానికి వచ్చిన వారిపై దీనిని స్ప్రే చేస్తే వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. కళ్లు మంటలు లేస్తాయి. ఆ సమయంలో మహిళలు తప్పించుకోవచ్చు. అన్ని సమయాల్లో దీనిని వెంట తీసుకెళ్లడం సులభం. అందుకే దీనిని చాలామంది వెంట ఉంచుకుంటున్నారు. యాంటీ రేప్ అండర్వేర్.. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ రేప్ ఇన్నర్‌వేర్ ఇది. దీనిని గతేడాది చెన్నైకి చెందిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఎస్హెచ్ఈ (సొసైటీ హర్నెసింగ్ ఎక్విప్మెంట్)ను రూపొందించారు. సాధారణ నైటీ మాదిరిగా కనిపిం చే దీని లో దుస్తుల్లో 3800 కిలో వోల్టుల విద్యుత్‌షాక్ ఇచ్చే సామర్థ్యం ఉంటుంది. వీటికి అమర్చిన జీపీఎస్ పరికరం సహాయంతో బాధితులు ఎక్కడ ఉన్నా.. వెంటనే బంధువులు, పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది. ‘సాక్షి‘ అభయ దాడులకు గురవుతున్న మహిళలు, యువతుల కోసం ‘సాక్షి’ యాజమాన్యం అత్యంత ఆధునిక టెక్నాలజీతో అందుబాటులో ఉండేలా ‘సాక్షి అభయ’ పేరుతో యాప్స్‌ను రూపొందించింది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిని వినియోగించడం కూడా చాలా సులభం. ఒక్క క్లిక్‌తో యాప్స్‌లో ముందే ఉంచిన నంబర్లకు సెకన్లలో సమాచారం వెళ్లిపోతుంది. దీనికి పోలీస్ నంబర్లను ఫీడ్ చేసినా వారికి కూడా మెసేజ్ వెళ్తుంది. ఇది నెట్‌తో పని లేకుండానే పనిచేయడం గమనార్హం. యాంటీ మోల్స్టేషన్ జాకెట్ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులివి. ఏదైన అవాంఛనీయం పరిణామం ఎదురైతే ఈ జాకెట్ మహిళలపై దాడికి చేయడానికి వచ్చిన వ్యక్తులకు విద్యుత్‌షాక్ ఇస్తుంది. రెగ్యులర్ జాకెట్ మాదిరిగా కనిపించే ఈ దుస్తుల బటన్స్ 110 వోల్టుల విద్యుత్‌శక్తిని కలిగి ఉంటాయి. దీని ప్రభావంతో 10 నుంచి 15 నిమిషాల పాటు తేరుకోలేరు. దీంతో అక్కడి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. ఈ జాకెట్‌ను నిఫ్ట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్) విద్యార్థులు రూపొందించారు. డెనిమ్, యాక్రలిన్ రంగుల్లో లభిస్తుంది. యాంటీ రేప్ నెక్లెస్.. ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల యాంటీ రేప్ నెక్లెస్‌లు, బ్రాస్లెట్లు అందుబాటులో ఉన్నాయి. అనూహ్య పరిణామాలు ఎదురైతే ఈ బ్రాస్లేట్కు ఉన్న బటన్ నొక్కితే చాలు.. అందులో ఫీడ్ చేసిన నంబర్లకు ఫోన్‌కాల్ వెళ్తుంది. బటన్ అలాగే నొక్కి పట్టుకుంటే బాధితులు ఏ ప్రాంతంలో ఉన్నారో.. పూర్తి వివరాలతో మెసేజ్ వెళ్తుంది. దాన్ని బట్టి అవతలి వ్యక్తి మీరు ప్రమాదంతో ఉందని గుర్తించి చేరుకునే అవకాశం ఉంది. కొన్ని నెక్లెస్ డివైస్‌లో విద్యుత్ షాక్ ఇచ్చే వాటితో పాటు పెద్ద శబ్దంతో సౌండ్ చేసేవి కూడా ఉన్నాయి. చిన్నగా అందంగా మెడలో వేసుకుని తీసుకెళ్లవచ్చు. -
ఓటనే వజ్రాయుధాన్ని సరిగ్గా సంధించాలి: శుభ్ర అయ్యప్ప
ప్రజాస్వామ్య పరిరక్షణకు, మహిళల సంరక్షణకు ఎవరైతే సమర్థంగా కృషిచేయగలరని భావిస్తారో అటువంటి నేతలనే ఎన్నుకోవాలి. మన అభివృద్ధి మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలి. ఓటును నోటుకు అమ్ముకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. చాలామంది అమాయకులు తెలియక ఎవరెక్కువ డబ్బులిస్తే వారికే ఓటేస్తున్నారు.. ఇలా చేస్తే రానున్న ఐదేళ్లూ మనం కష్టాలు పడాలి. సమర్ధులైన వారికి, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చగల సత్తా ఉన్న వారికే ఓటెయ్యాలి. వజ్రాయుధమైన ఓటును సరిగ్గా సంధించాలి.. - శుభ్ర అయ్యప్ప, హీరోయిన్ -
మహిళల రక్షణకు ప్రత్యేక చట్టం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలో మహిళల రక్షణ, భద్రతకు ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాలని గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. మహిళల భద్రత, రక్షణపై నగరంలో గురువారం రెండు రోజుల జాతీయ సమావేశాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. దేశంలో రోజు రోజుకు మహిళలపై దౌర్జన్యాలు అధికమవుతున్నాయంటూ, చట్టాలంటే భయం లేకపోవడం కూడా దీనికి కారణమని అన్నారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలపై విచారణ జరపడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను కూడా నెలకొల్పాల్సిన అవ సరం ఉందన్నారు. దోషులకు తగిన శిక్ష పడితే ఇలాంటి నేరాలు తగ్గుముఖం పడతాయని సూచించారు. మనలో నిజాయతీ కలిగిన అధికారులకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దౌర్జన్యాలు తగ్గకపోవడానికి ఇదీ ఒక కారణమేనని తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులను నియమించడం ద్వారా ఇలాంటి నేరాలను నివారించాలని ప్రభుత్వానికి సూచించారు. అమెరికా లాంటి దేశాల్లో విదేశ వ్యవహారాల మంత్రులుగా మహిళలను నియమిస్తున్నారని, మన దేశంలో వారిని నమ్మడం లేదంటూ ఇదే మన దౌర్భాగ్యమని విచారం వ్యక్తం చేశారు. మహిళలకు బాధ్యతలను అప్పగిస్తే పురుషుల కంటే సమర్థంగా నిర్వర్తిస్తారని కితాబునిచ్చారు. మహిళలకు అధికారం అప్పగిస్తే సక్రమంగా వ్యవహరించలేరనే అప నమ్మకం ఏర్పడిందని అన్నారు. దీనిని పోగొట్టి మహిళలను గౌరవించాలని ఆయన సూచించారు. హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ మాట్లాడుతూ... మహిళల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలపై దౌర్యనాల కేసుల సత్వర పరిష్కారానికి పది ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామని వెల్లడించారు. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ, డీజీపీ లాల్ రుకుమ్ పచావ్, నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎంఎన్. వెంకటాచలయ్య ప్రభృతులు పాల్గొన్నారు.