నిర్ధారణ అంతంతే.. | Sexual Assault Cases are 3% Confirmation | Sakshi
Sakshi News home page

నిర్ధారణ అంతంతే..

Published Sat, Jul 2 2016 1:45 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

నిర్ధారణ అంతంతే.. - Sakshi

నిర్ధారణ అంతంతే..

* లైంగిక వేధింపుల కేసుల్లో నిర్ధారణ 3శాతం మించడం లేదు
* ఐదు శాతం కంటే తక్కువ మందికి మాత్రమే పరిహారం
* మహిళల రక్షణ కోసం కమిటీలు కూడా లేవు

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో  రోజూ ఏదో ఒక మూల మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు సర్వసాధారణమైపోయాయి. ఇలాంటి ఘటనల్లో గడప దాటి పోలీస్‌స్టేషన్ వరకు వచ్చే కేసులు చాలా తక్కువ. సమాజం పేరిట, కుటుంబ గౌరవం పేరిట ఎన్నో అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనలు నాలుగ్గోడల మధ్యనే సమాధి అయిపోతున్నాయి.

పోనీ ఇలాంటి ఎన్నో అడ్డంకులను దాటుకొని ధైర్యంగా పోలీస్‌స్టేషన్ వరకు వచ్చిన కేసుల్లో కూడా నిర్ధారణ ఎంత వరకు జరుగుతోంది అంటే కేవలం 3శాతం మించడం లేదన్న సమాధానం వినిపిస్తోంది. ఈ విషయాలన్నీ మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ విడుదల చేసిన గణాంకాలు  స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న లైంగిక వేధింపుల కేసుల్లో నిర్ధారణ అయి నిందితులకు శిక్షలు పడుతోంది  3శాతం మాత్రమే. అంటే ప్రతి 100 మంది నిందితుల్లో ముగ్గురికి మాత్రమే జైలు శిక్ష పడుతోంది. మిగతా 97 మంది సులువుగా చట్టం చేతుల నుంచి తప్పించుకుంటున్నారు. ఇక రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ తరహా కేసుల నిర్ధారణ శాతం ఎలా ఉందో గమనిస్తే మైసూరు, బాగల్‌కోటె జిల్లాల్లో రాష్ట్రంలోనే అధికంగా 4శాతం కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఇక కల్బుర్గి, బీదర్‌లో 2శాతం, ఉడుపిలో 1.7శాతం, హావేరిలో 1.6శాతం కేసులు నిర్ధారణ అవుతున్నట్లు తెలుస్తోంది.
 
పరిహారమూ అందడం లేదు...
ఇక ఇదే సందర్భంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు అందజేయాల్సిన పరిహారం సైతం వారికి సరిగ్గా అందడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా  5శాతం మంది బాధితులకు మాత్రమే నష్ట పరిహారం అందిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత చట్టాల ప్రకారం యాసిడ్ దాడి కేసుల బాధితులకు రూ.3లక్షలు, లైంగిక దాడుల బాధితులకు రూ.2లక్షలు, హ్యూమన్ ట్రాఫికింగ్‌లో చిక్కుకొని బయటపడిన బాధితులకు పునర్వసతి కల్పించేందుకు రూ.2లక్షలు ప్రభుత్వం పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.

అయితే 100 మంది బాధితుల్లో కేవలం ఐదుగురికి మాత్రమే పరిహారం అందుతోంది. మిగిలిన బాధితులు ఏళ్ల తరబడి తమకు అందాల్సిన పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
 
90శాతం సంస్థల్లో రక్షణ కమిటీలు కూడా లేవు.......
పనిచేసే ప్రాంతాల్లో ఉద్యోగినులపై లైంగిక దాడులను నిరోధించేందుకు గాను రూపొందించిన ‘సెక్సువల్ హెరాష్‌మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్కప్లేస్(ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్-2013’ ప్రకారం ప్రతి సంస్థలోనూ మహిళల రక్షణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి ఒక మహిళ అధ్యక్షత వహించాలి. అయితే రాష్ట్రంలోని సంస్థల్లో కేవలం 10శాతం సంస్థలు మాత్రమే ఈ కమిటీలను ఏర్పాటు చేశాయి. మిగిలిని 90శాతం సంస్థల్లో మహిళల భద్రతకు అవసరమైన రక్షణ కమిటీలను ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం శోచనీయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement