Confirmation
-
ప్రైవేటు స్కూలు ఫీజుల వివరాలు వెబ్‌లో ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 1994లో వచ్చిన జీవో 1లో ఉన్న నిబంధనలే దాదాపు పొందు పర్చినప్పటికీ, ప్రైవేటు స్కూళ్ళు వసూలు చేసే ఫీజులను సంబంధిత స్కూల్ వెబ్సైట్లో అందిరికీ అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఫీజుల వివరాలను విద్యాశాఖకు పంపించాలని పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల నిర్థారణకు ప్రతి స్కూలులోనూ కమిటీ ఏర్పాటు చేయాలని, ఇందులో విద్యా సంస్థ నిర్వాహకుడు లేదా కరస్పాండెంట్ అధ్యక్షుడుగా ఉండాలని సూచించారు. స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల్లో ఒకరు, పేరెంట్స్ ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలని స్పష్టం చేశారు. ఏడాదిలో మూడుసార్లు కమిటీ సమావేశమవ్వాలి ఈ తరహాలో ఏర్పడిన పాలక మండలి ఏడాదిలో మూడు సార్లు సమావేశమై, పాఠశాల ఆర్థిక వ్యవహారాలను సమీక్షించాలని సూచించారు. ఏడాదిలో స్కూల్ విద్యార్థులు, పాఠశాల అభివృద్ధికి చేసే ఖర్చును ఆడిట్ చేయించి, ఈ వ్యయం ఆధారంగా ఫీజులు వసూలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం ఫీజులో యాజమాన్య ఆదాయం 5 శాతం, స్కూల్ నిర్వహణకు 15 శాతం, పాఠశాల అభివృద్ధికి 15 శాతం, ఉపాద్యాయుల జీతాలకు 50 శాతం, పాఠశాల ఉద్యోగుల గ్రాట్యుటీ, పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి వాటికి 15 శాతం వసూలు చేసేందుకు వీలు కల్పించారు. పాఠశాల ఆదాయ వ్యయ వివరాలను విధిగా గుర్తింపు కలిగిన ఆడిటర్ చేత ఆడిట్ చేయించి, విద్యాశాఖకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
కుటుంబం తోడ్పాటుతో క్యాన్సర్‌పై విజయం
క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాగానే మొదట డాక్టర్లు దాని తీవ్రతను అంచనావేస్తారు. క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం ‘టీఎన్ఎమ్’ అనే విషయాలను పరీక్షిస్తారు. ఈ ఇంగ్లిష్ పొడి అక్షరాల్లో ‘టీ’ అంటే ట్యూమర్ సైజ్, ‘ఎన్’ అంటే చుట్టుపక్కల ఉండే లింఫ్‌నోడ్స్, ఎమ్ అంటే పరిసరాల్లోని ఏయే భాగాలకు పాకిందని తెలుసుకునే ‘మెటాస్టాసిస్’. ఈ అంశాల ఆధారంగా క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకుంటారు. క్యాన్సర్‌లో ‘0’ నుంచి ‘4’ వరకు దశలు ఉంటాయి. ’0’ అంటే క్యాన్సర్ ప్రారంభానికి ముందు దశ. ప్రారంభం అయిన దశను ‘స్టేజ్ 1’, పెద్ద గడ్డ లింఫ్ గ్రంథులకు సోకితే ‘స్టేజ్ 2’ లేదా ‘స్టేజ్ 3’ అని, ఇతర అవయవాలకు కూడా వ్యాపిస్తే దాన్ని ‘స్టేజ్ 4’ అని నిర్ధారణ చేస్తారు. ఎన్నో రకాలు... ఎన్నో పేర్లు క్యాన్సర్ శరీరంలోని ఏ భాగానికి వచ్చిందో దాన్ని బట్టి ఆ పేరుతో పిలుస్తారు. అయితే వైద్య పరిభాషలో సాంకేతికంగా వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. ఉదాహరణకు చర్మం మీద, అవయవాల లోపలి లేక బయటి పొరల మీద వచ్చే క్యాన్సర్‌ను కార్సినోమా అంటారు. ఎముకలు, రక్తనాళాలు, అవయవాలను కలిపే కనెక్టివ్ టిష్యూతో పాటు కండరాలలో వచ్చే క్యాన్సర్‌ను సార్కోమా అంటారు. రక్తకణాలలో, రక్తకణాలను తయారు చేసే ఎముక మజ్జలో వచ్చే క్యాన్సర్‌ను ల్యుకేమియా అంటారు. ఇక రోగనిరోధక వ్యవస్థను కాపాడే లింఫ్ నాళాల వంటి చోట్ల వచ్చే క్యాన్సర్‌ని లింఫోమా, మైలోమా అంటారు. ఇలా క్యాన్సర్స్‌లో కార్సినోమా, సార్కోమా, ల్యుకేమియా, లింఫోమా/సార్కోమా అని ప్రధానంగా నాలుగు రకాలుంటాయి. కొన్ని లక్షణాలను గమనించాక క్యాన్సర్‌ను నిర్ధారణ చేసే పరీక్షలను చేస్తుంటారు. ఎక్స్–రే, అల్ట్రాసౌండ్ స్కాన్, సీటీ స్కాన్, న్యూక్లియర్ స్కాన్, ఎమ్మారై, పెట్ స్కాన్, బయాప్సీ, రక్తపరీక్షలు, మలమూత్ర, కళ్లె పరీక్షల వంటివి అవసరాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. రకాన్ని బట్టి... తీవ్రతను బట్టి చికిత్స క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ జరిగితే వ్యక్తి వయసు, ఇతర ఆరోగ్య విషయాలను పరిగణనలోకి తీసుకొని ముందుగా సర్జరీ చేసి, ఇతర థెరపీలకు వెళ్తారు. ఒక్కోసారి ఇతర థెరపీల తర్వాత కూడా సర్జరీ చేస్తారు. చికిత్సలో భాగంగా సర్జరీ, కీమో, రేడియో, హార్మోన్ థెరపీలతో పాటు ఒక్కోసారి జీన్, బయొలాజికల్, ఇమ్యూనో వంటి అనేక థెరపీలు చేస్తారు. రక్త సంబంధిత క్యాన్సర్లు ఉన్నవారికి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. ఇటీవల వైద్యరంగంలోని పురోగతితో స్టెమ్‌సెల్ థెరపీ వంటివి కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ఏయే క్యాన్సర్లకు ఏయే తరహా చికిత్సలు అవసరం అన్నది అనేక విషయాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇక సర్జరీల విషయానికి వస్తే కోత తక్కువగా ఉండే లేజర్, కీహోల్ సర్జరీలు చేస్తున్నారు. అలాగే కీమోథెరపీలో క్యాన్సర్ కణాన్ని మాత్రమే ప్రభావితం చేసేలా టార్గెటెడ్ థెరపీ చేస్తున్నారు. రేడియేషన్‌లో ఆధునికమైన వీఎమ్‌ఏటీ రేడియేషన్, 3డీ రేడియేషన్ అందుబాటులో ఉన్నాయి. హార్మోన్లను ప్రభావితం చేసే హార్మోన్ థెరపీ కూడా ఇప్పుడు ఒక చికిత్సాప్రక్రియ. ఇక రోగనిరోధక శక్తిని పెంపొందిస్తూ క్యాన్సర్ కణాల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే ఇమ్యూనోథెరపీ వంటి కొత్త కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. నివారణ సులభమే... మంచి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్, పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, యోగా, ధ్యానం, కాలుష్యాలకు దూరంగా ఉండటం వంటి మన చేతుల్లో ఉండే అంశాలతో చాలావరకు దీన్ని నివారించవచ్చు. అయితే చాలా కొద్దిరకాలలో మాత్రం క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రోగి బాధలను చాలావరకు తగ్గించి, వారి జీవననాణ్యతను మెరుగుపరచి, తక్కువ బాధతో జీవితాంతం గడిపేలా చేసే ప్రక్రియను ‘పాలివేటివ్ కేర్’ అంటారు. పాలియేటివ్ కేర్‌లో కొంచెం కణతి పరిమాణం, బాధలను తగ్గించడానికి మత్తు మందులతో పాటు కీమో, రేడియోథెరపీలు ఇస్తుంటారు. ఈ విభాగంలో మత్తు స్పెషలిస్టులు అయిన ఎనస్థిసిస్ట్, పెయిన్మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, డైటీషియన్, నర్సులు తమ సేవలు అందిస్తుంటారు. అయితే వారితో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల భూమిక చాలా కీలకం. కచ్చితంగా నయం చేస్తామనే ప్రకటనలను నమ్మకండి‘క్యాన్సర్ వ్యాధిని తగ్గించడానికి మా వద్ద కచ్చితమైన చికిత్సలున్నాయి‘ అంటూ చాలా రకాల ప్రకటనలు కనిపిస్తుంటాయి. వాటిని చూసి, నమ్మి, ఆచరించి రోగాన్ని ముదరబెట్టుకునే వాళ్లు చాలామంది ఉంటారు. ఏ వైద్యవిధానంలోనూ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసే మందులు లేవు. సైంటిఫిక్‌గా కచ్చితమైన క్లినికల్ ట్రయల్స్‌తో సాగే అల్లోపతిలోనూ తొలిదశలో గుర్తిస్తేనే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది. అందుకే అలాంటి బోగస్ ప్రకటనలను నమ్మకూడదు. ఇక క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే టార్గెట్ థెరపీలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఆ మందులు చాలా ఖరీదైనవి కాబట్టి ఇప్పటికీ అందరికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మనిషి మనిషి ప్రవర్తనలో తేడాలున్నట్లే క్యాన్సర్ కణం కూడా ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రవర్తిస్తుంటుంది. వయసు, క్యాన్సర్ కణం ప్రవర్తించే తీరును బట్టి వ్యక్తిగత వైద్యచికిత్స ఉంటుంది. అనుసరించే చికిత్స విధానాలు, కీమో, రేడియో థెరపీలన్నీ అందరిలోనూ ఒకేలా ఉండవు. కొందరిలో కొన్ని నెలలు పట్టే చికిత్స మరికొందరికి ఏడాది కూడా పట్టవచ్చు. కుటుంబం సహకారం అవసరం... చాలామంది, మరీ ముఖ్యంగా మహిళలు ఈ వ్యాధికి గురైనప్పుడు చాలా తల్లడిల్లిపోతుంటారు. ఇల్లు, పిల్లలు ఏమైపోతారో అన్న వ్యధతో పాటు, తమ వైద్యానికి చాలా ఎక్కువగా ఖర్చవుతోందని, దాంతో కుటుంబంపై ఆర్థికభారం పడుతోందని మనోవేదనకు గురవుతుంటారు. వారికి డాక్టర్లు ఇచ్చే కౌన్సెలింగ్‌తో పాటు కుటుంబ సభ్యుల సహకారం చాలా ముఖ్యం. నిజానికి వీటిన్నింటికి మించి రోగి కుటుంబ సభ్యుల తోడ్పాటు, సహకారం తప్పనిసరి. మరీ చెప్పాలంటే... అన్నింటికంటే అదే ప్రధానం. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
బాబుది ఏడీహెచ్‌డీ కావచ్చు..?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్ మా బాబుకు ఏడేళ్లు. ఇతర పిల్లలో కలవడం చాలా తక్కువ. మేం ఏమి చెప్పినా వినిపించుకోడు. మాటలు కూడా కొంత ఆలస్యంగానే వచ్చాయి. కొన్నిసార్లు బాగానే ఆడుకుంటాడు గానీ ఒక్కోసారి దేనిమీదా దృష్టికేంద్రీకరించి కుదురుగా ఉండడు. పదే పదే కనురెప్పలు కొడుతుంటాడు. చూసినవాళ్లు... ‘ఇది చిన్నవయసు కదా. ఎదిగేకొద్దీ సర్దుకుంటాడు’ అని అంటున్నారు. అతడి సమస్య ఏమిటి? సరైన సలహా ఇవ్వగలరు. – ఆర్. మహేశ్వరి, నిజామాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి సమస్య ఇదే అని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ మీ లేఖలోని అంశాలను విశ్లేషిస్తే ఇది అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అని చెప్పవచ్చు. అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏ విషయంపైనా చాలాసేపు దృష్టి కేంద్రీకరించలేకపోవడం అని చెప్పవచ్చు. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్‌తో పాటు హైపర్ యాక్టివిటీ, ఇంపల్సివ్ బిహేవియర్ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అటెన్షన్ డెఫిసిట్‌తో పాటుగా కొన్నిసార్లు కొద్దిమందిలో హైపర్ యాక్టివ్ లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని ‘అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ)’ అంటారు. అటెన్షన్ డెఫిసిట్ ఉన్న పిల్లల్లో అకడమిక్‌గా వెనకబడటం, స్నేహితులతో పెద్దగా కలివిడిగా ఉండలేకపోవడం, నిర్లక్ష్యంగా తప్పులు చేస్తూ ఉండటం, ఒక అంశంపైనా లేదా ఒక ఆటపైనా చాలాసేపు ఏకాగ్రత చూపలేకపోవడం, చెప్పినమాట వినకపోవడం, స్కూల్లో ఇచ్చిన హోమ్‌వర్క్ వంటి టాస్క్‌లు గడువులోపల పూర్తి చేయకపోవడం, నిర్వహణశక్తిలోపం, పదే పదే వస్తువులను పోగొట్టుకోవడం, ఏదైనా అంశం నుంచి త్వరగా దారిమళ్లడం, ఎప్పుడూ విషయాలను మరచిపోవడం వంటివన్నీ నిత్యం చేస్తుండటం అన్నవి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ లక్షణాలు. అలాగే హైపర్ యాక్టివిటీకి సంబంధించి... బాగా స్థిమితంగా ఉండలేకపోవడం, ఒకేచోట కుదురుగా కొంతసేపు కూడా కూర్చులేకపోవడం, ఎప్పుడూ గెంతుతూ, ఏదో ఎక్కుతూ ఉండటం, నెమ్మదిగా ఆడుకోలేకపోవడం, ప్రశ్నపూర్తిగా అడగకముందే జవాబిచ్చేలా స్పందించడం వంటివి అన్నీ హైపర్ యాక్టివ్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ ‘ఏడీహెచ్‌డీ’ సమస్య ఉన్నవారిలో నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, యాంగై్జటీ, డిప్రెషన్, కనురెప్పలు అదేపనిగా కొట్టుకోవడం (టిక్ డిజార్డర్), మలమూత్రాల మీద నియంత్రణ లేకపోవడం, నిద్రసంబంధ సమస్యలు వంటివి ఉండవచ్చు. ఇలాంటి పిల్లల్లో సమస్యను సరిగ్గా నిర్ధారణ చేయడం వల్లనే చికిత్స సరిగా జరిగినట్లవుతుంది. ఈ పిల్లలకు పూర్తిస్థాయి చికిత్స రెండు రకాలుగా జరగాలి. ఒకటి... ప్రవర్తనాపరమైన చికిత్స (బిహేవియరల్ థెరపీ), రెండోది మందులతో చేసే చికిత్స. సమాజం ఆమోదించేలాంటి ప్రవర్తనను తీసుకురావడమే థెరపీ లక్ష్యం. బిహేవియరల్ థెరపీలో చాలా చిన్న చిన్న జాగ్రత్తలు, అంశాలదే కీలక భూమిక. సమస్యపై కుటుంబానికి అవగాహన కల్పించడం, కుటుంబ సభ్యుల చేయూత, క్రమబద్ధమైన జీవితం, నిర్ణీత వేళకు నిద్రలేవడం, పడుకోవడం, వేళకు తినడం వంటి మార్పులతో పాటు స్కూల్లోనూ కొద్దిపాటి మార్పులు, పిల్లలపై టైమ్, పరీక్షల ఒత్తిడి లేకుండా చూడటం వంటి వాటితో సత్ఫలితాలు కనిపిస్తాయి. దాంతోపాటు స్టిమ్యులెంట్ మెడిసిన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బిహేవియర్ థెరపీపై అవగాహన కోసం ఇలాంటి పిల్లల పేరెంట్స్ అందరూ గ్రూప్‌గా ఏర్పడి నిర్వహించుకునే తరగతులతో ప్రయోజనం ఉంటుంది. ఇక మీ బాబు విషయానికి వస్తే అతడికి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్‌తో పాటు టిక్స్ డిజార్డర్ ఉన్నట్లుగా అనిపిస్తోంది. కాబట్టి మీరు పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్‌ను కలిసి చికిత్స తీసుకోండి. ఇక ఇది కొద్దిపాటి దీర్ఘకాలిక సమస్య కాబట్టి తల్లిదండ్రులూ ఓపిగ్గా ఉండాలి. ఈ మానసిక రుగ్మత విషయంలో మంచి సంగతి ఏమిటంటే... ఈ సమస్య ఉన్న పిల్లల శక్తియుక్తులను సరిగ్గా గాడిలో పెట్టగలిగితే వాళ్లు గొప్ప విజయాలు సాధించడానికి అవకాశాలున్నాయి. బాబు అదేపనిగా ఏడుస్తున్నాడు మా బాబు వయసు రెండు నెలలు మాత్రమే. వాడెప్పుడూ ఏడుస్తూనే ఉంటున్నాడు. . డాక్టర్‌కు చూపించినా ఏమీ లాభం లేదు. అసలు వాడి సమస్య ఏమిటో తెలుసుకోవడం ఎలా? మాకు తగిన సలహా చెప్పండి. – ఎల్. పవన్‌కుమార్, ఒంగోలు ఇంత చిన్న పిల్లలు తమ బాధలనైనా కేవలం ఏడుపు ద్వారానే వ్యక్తపరుస్తుంటారు. వాళ్లు కమ్యూనికేట్ చేసే ఒక విధనం ఏడుపు మాత్రమే. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్లకు ఏదైనా సమస్య ఉందేమోనని తల్లిదండ్రులు అనుమానించాలి. పిల్లలు ఎప్పుడెప్పుడు, ఎందుకు ఏడుస్తారో, అప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలి. పిల్లల్లో ఏడుపుకు కొన్ని ముఖ్య కారణాలు: ∙ఆకలి వేసినప్పుడు ∙భయపడినప్పుడు ∙దాహం వేసినప్పుడు ∙బోర్ ఫీల్ అయినప్పుడు ∙పక్క తడిగా అయినప్పుడు ∙వాతావరణం మరీ చల్లగా లేదా వేడిగా ఉన్నప్పుడు ∙పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినప్పుడు ∙కాంతి ఎక్కువైనా, పొగలు కమ్ముకున్నా ∙నొప్పులు ఉన్నప్పుడు ∙పళ్ళు వస్తున్నప్పుడు ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షను వచ్చినప్పుడు ∙కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్) ∙జ్వరం ∙జలుబు ∙చెవినొప్పి ∙మెదడువాపు జ్వరం ∙గుండె సమస్యలు ∙కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన వాటిని కూడా పిల్లలు ఏడుపు ద్వారానే తెలియపరుస్తారు. కొన్ని సందర్భాల్లో ఫిట్స్ సమస్యను కూడా ఏడుపు రూపంలోనే వ్యక్తపరుస్తుండవచ్చు. 1–6 నెలల వయసులో ఉన్న పిల్లలు ఎక్కువగా ఏడవటానికి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటివి ప్రధాన కారణాలు. ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్... చిన్న పిల్లల్లో ఏడుపుకు సాధారణ కారణం కడుపునొప్పి. దీన్నే ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్ అంటారు. సాధారణంగా మూడు నెలలలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆ టైమ్‌లో పిల్లలు కొద్ది సేపు మొదలుకొని చాలా ఎక్కువసేపు ఏడుస్తుంటారు. ∙ఆకలి, గాలి ఎక్కువగా మింగడం వల్ల, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్‌కు కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజీషన్), లేదా వాళ్ల పొట్టమీద పడుకోబెట్టడం, ప్రాపర్ ఫీడింగ్ టెక్నిక్ (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు. కొందరికి యాంటీస్పాస్మోడిక్స్తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే అంటే పదే పదే ఏడవటం, ఆపకుండా ఏడవటం చేస్తుంటే తక్షణం పిల్లల డాక్టర్‌కు చూపించాలి. మీరు కూడా ఒకసారి మీ బాబును పీడియాట్రీషియన్‌కు చూపించండి. వారు తగిన కారణాన్ని కనుగొని, దానికి తగినట్లుగా చికిత్స అందిస్తారు. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
బంగారు నానోకణాలతో వ్యాధి నిర్థారణ చవక
కేన్సర్ వ్యాధి నిర్ధారణకు చవకైన కొత్త పద్ధతి ఒకదాన్ని అభివృద్ధి చేశారు క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఒకట్రెండు రకాలకు కాకుండా అన్ని రకాల కేన్సర్లకూ ఈ పద్ధతిని ఉపయోగించగలగడం ఇంకో విశేషం. కేన్సర్ నిర్ధారణకు చౌకైన, మెరుగైన పద్ధతిని ఆవిష్కరించేందుకు ఇప్పటికే పలు ప్రయత్నాలు జరుగుతుండగా అన్ని రకాల కేన్సర్లను ఒకే పద్ధతితో గుర్తించడం మాత్రం ఇప్పటివరకూ వీలు కాలేదు. ఈ నేపథ్యంలో తాము కేన్సర్ కణాల డీఎన్ఏ పోగులపై ప్రత్యేకదృష్టి పెట్టామని అందులోని మిథైల్ పరమాణువుల అమరిక ప్రత్యేక రీతిలో ఉండటాన్ని గుర్తించామని ద్రవంలో ఉంచినప్పుడు ఈ కేన్సర్ డీఎన్ఏ పోగులు ఉండ చుట్టుకుపోయే పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉండటాన్ని గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అబూ సినా తెలిపారు. ఈ మార్పులను గుర్తించేందుకు తాము బంగారు నానో కణాలను ఉపయోగించామని 200 మందిపై ప్రయోగాలు చేయగా 90 శాతం కచ్చితత్వంతో కేన్సర్‌ను గుర్తించగలిగామని వివరించారు. పైగా కేవలం పది నిమిషాల్లోనే పరీక్ష ఫలితాలు వెల్లడవుతాయని కాకపోతే ప్రస్తుతానికి ఈ పరీక్ష కేన్సర్ ఉన్నట్లు మాత్రమే నిర్ధారించగలదని అది రొమ్ము కేన్సరా? లేక ఇంకో రకమైందా? మాత్రం గుర్తించలేదని వివరించారు. -
వయసు నిర్ధారణకు టెన్త్ సర్టిఫికెట్ చాలు
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : బాలల న్యాయచట్టంలోని సెక్షన్ 94, వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలు పరిగణనలోకి తీసుకుని వయసు నిర్ధారణకు వ్యక్తి 10వ తరగతి సర్టిఫికెట్ తుది ఆధారమని జిల్లా బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. జిల్లాలోని టి.నరసాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక కేసుకు సంబంధించి ఏలూరు శనివారపుపేటలోని సమితి కార్యాలయంలో సీడబ్ల్యూసీ తుది నిర్ణయం వెలువరించినట్టు సమితి చైర్పర్సన్ టీఎన్ స్నేహన్ తెలిపారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. టి.నరసాపురం మండలం రాజుపోతేపల్లికి చెందిన దేవరపల్లి బేబి అనే యువతి పెదవేగి మండలం ముండూరుకి చెందిన అన్నపనేని సందీప్ అనే యువకుడిని గతేడాది డిసెంబర్ 24న వివాహం చేసుకుంది. అయితే వివాహంపై బే బి తండ్రి అభ్యంతరం వ్యక్తం చేస్తూ టి.నరసాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాను మేజర్‌నని తన టెన్త్ సర్టిఫికెట్‌ను బేబి పోలీసులకు చూపింది. అయితే ఆమె తండ్రి టెన్త్ సర్టిఫికెట్లో పుట్టినతేదీ తప్పని, పంచాయతీ కార్యాలయం ద్వారా మరో సర్టిఫికెట్‌ను తీసుకువచ్చి పోలీసులకు చూపించారు. దీంతో కేసును పోలీసులు సీడబ్ల్యూసీ ముందుంచారు. తండ్రి చూపిన సర్టిఫికెట్ ఆధారంగా బేబిని మైనర్‌గా భావించి సీడబ్ల్యూసీ సూచనలతో గతనెల 12న ఆమెకు దెందులూరు బాలసదన్‌లో ఆశ్రయం కల్పించారు. సంక్రాంతి సెలవుల అనంత రం బేబీని పోలీసులు సీడబ్ల్యూసీ ముందు హాజరుపరిచారు. ఇరువర్గాల వాదోపవాదాల అనంతరం వయసు నిర్ధారణకు టెన్త్ సర్టిఫికెట్ ప్రామాణికమని భావించి తుది తీర్పు వెల్లడించారు. బేబి చదివిన మూడు పాఠశాలల్లో పుట్టినతేదీ ఒకేవిధంగా ఉందని, ఆమెకు 18 ఏళ్లు నిండినట్టు నిర్ధారించారు. -
స్వప్న లోకం
క్షుద్బాధ తీర్చుకోడానికి వంద జింకల్ని వేటాడి చంపిన సింహరాజు కూడా తన పిల్లల ముందు సాధు జంతువైపోతాడు. అలాంటిది శంకర్రాయుడెంత! ఎన్ని దౌర్జన్యాలు, భూకబ్జాలు, అక్రమ వ్యాపారాలు, బెదిరింపులు, ఒకటీ రెండు హత్యలు చేసి జనాల మనస్సులో ఓ రాక్షసుడిగా మిగిలినా తన ఇరవై రెండేళ్ళ కూతురు స్వప్నకి మాత్రం అతనో ప్రాణ స్నేహితుడు. స్వప్న చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో ఇంకా గారాబంగా పెరిగింది. రెండు నెలల క్రితం స్వప్నకి అదే ఊళ్ళో ఉంటున్న ఒక ప్రముఖ విద్యా సంస్థల అధినేత కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు శంకర్రాయుడు. నాలుగు కోట్ల రూపాయల కట్నం, రెండు కోట్లు ఖర్చు పెట్టి ఘనంగా వివాహం జరిపించాడు. తనకి మట్టుకు ఓ ఫామ్ హౌస్ ఉంచుకుని యావదాస్తీ కూతురి పేరు మీద ఇప్పుడే రాసివ్వడం కొందరికి ఎక్కువ అనిపించినా, శంకర్రాయుడికి అది తన కూతురి సుఖ సంతోషాల ముందు చాలా చిన్నదిగా అనిపించింది. తనని ఒంటరిని చేసి అత్తారింటికెళ్ళి పోయిన స్వప్న ఆలోచనల్లో మునిగిపోయాడు శంకర్రాయుడు. తన ఏసీ గదిలో టీవీ ముందు కూర్చుని ఏం చూడాలో తేల్చుకోలేక రిమోట్ బటన్స్‌ని అప్పుడే పుట్టిన ఇష్టంలేని ఆడ శిశువు గొంతు నులిమినట్టు నొక్కుతున్నాడు. ఎదురుగా డన్ హిల్ సిగరెట్ ప్యాకెట్లు, స్కాచ్ సీసాలు ఖాళీ అవుతున్నాయి. కానీ కూతురి మీద బెంగ, వాత్సల్యం తండ్రిగా అపురూపమైన అనుభూతి మాత్రం కొన్ని సంవత్సరాలుగా రెట్టింపవుతూనే ఉన్నాయి.‘చిట్టి తల్లి ఇప్పుడేం చేస్తోందో’ అనుకుంటూ దిగులుగా తన ఐఫోన్ చేతిలోకైతే తీసుకున్నాడు గానీ సమయం రాత్రి పదకొండు దాటుతోంది. కొత్త జంటని ఈ సమయంలో ఇబ్బంది పెట్టకూడదని గుర్తొచ్చేలోపే తన ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది. ‘‘నాన్నా! దయచేసి రేప్పొద్దున్నే వచ్చి నన్ను తీస్కెళ్ళు. ఇప్పుడు ఫోన్ చెయ్యొద్దు. కంగారేమీ లేదు. నేను బానే ఉన్నాను. గుడ్ నైట్.’’ఫోన్ ఆయన పిడికిట్లో బిగుసుకుంది. శంకర్రాయుడు అచేతనమయ్యాడు. స్వప్న కళ్ళ ముందు కదలాడుతోంది. ‘నాన్నా’ అన్న సంబోధనతో మొదలైన ఆ సందేశం చదువుతున్నట్టు లేదు. చెవులారా కూతురి స్వరం వింటున్నట్టే ఉంది. స్వప్న డిగ్రీ చదివింది. ఏ మాత్రం గడుసుతనం లేని పిల్ల, చాలా భయస్తురాలు. అందరికీ అన్నీ చేస్తుంది కానీ ఎవర్నీ ఏమీ అడగదు. మనసులో ఏదైనా కష్టమున్నా అది అలాగే సమాధైపోవాల్సింది తప్ప బయటకు చెప్పదు.శంకర్రాయుడు రాత్రంతా ‘ఏమయ్యుంటుందా’ అని ఆలోచిస్తూనే గడిపి పొద్దున్నే వియ్యంకుడి ఇంటికి వెళ్ళాడు. స్వప్న అత్తింటి వారు స్వాగత మర్యాదలు బాగా చేశారు. స్వప్నను చూడగానే అప్పటిదాకా ఆపుకున్న కన్నీళ్లను ఇక అదుపు చేయలేక ఏడుస్తూ అస్పష్టంగా ‘‘ఎలా ఉన్నావ్ చిట్టి తల్లీ’’ అని పలకరించాడు. ‘‘బావున్నాను నాన్నా!’’ తండ్రి మొహం సరిగ్గా చూడకుండానే చెప్పింది స్వప్న.‘‘మా కోడలు ఎప్పుడూ మిమ్మల్నే కలవరిస్తుంది బావగారు. అందుకే ఓ రెండ్రోజులు మీరు తీసుకువెళ్ళండి. కాస్త బెంగ తీరుతుంది తనకి. అబ్బాయి కొద్దిగా పనుల ఒత్తిడి వల్ల రాలేడు’’ నవ్వుతూ అన్నాడు స్వప్న మావగారు.‘‘బావగారు, తండ్రి మీద బెంగ మాత్రమే విషయమైతే ఫర్వాలేదు. కానీ అంతకు మించి ఏదైనా ఉందా? స్వప్నకి మీరే అన్నీ ఇక’’ ఆర్ధ్రంగా అన్నాడు శంకర్రాయుడు. తండ్రి అంత వినమ్రతతో మాట్లాడ్డం స్వప్నకి ఏ మాత్రం నచ్చలేదు. చిరుకోపం చూపుల్లో కనిపిస్తూనే ఉంది.‘‘అదేం లేదు బావగారు, మీరు కూడా స్వప్న మీద ఎంతో బెంగగానే ఉన్నారని తెలుస్తూనే ఉంది. కొన్ని రోజులు తీసుకెళ్ళండి. తనకీ ఊరటగా ఉంటుంది’’ అని ముందుగా తన మాట చెప్పాడు స్వప్నమావగారు. ఆమె భర్త, అత్తగారు కూడా అదే బాట పట్టారు. వారిద్దరి ముఖాలు ముభావంగా ఉండడం గమనించకపోలేదు శంకర్రాయుడు.తండ్రీ కూతుళ్ళు ఇంటికొచ్చిన వెంటనే విషయం చెప్పడం ప్రారంభించింది స్వప్న.‘‘నాన్నా నేను తల్లిని కాబోతున్నాను. నిన్న పొద్దున్నే హాస్పిటల్ కి వెళ్లి నిర్ధారణ చేసుకున్నాం’’ సంతోషం, దుఖం, భయం కలగలిసిన కంఠంతో చెప్పింది స్వప్న. తండ్రి పెదవులపై చిరునవ్వు, నుదిటిపై భృకుటి ఒకేసారి వెలిశాయి.‘‘మరి ఈ భయం, బాధ ఏంటమ్మా నీలో’’ ‘‘మా ఆయన, అత్తగారు సంతోషించారు. కానీ మా మావగారికి ఇష్టం లేదు నాన్నా. నేను వింటున్నానని తెలియక మా ఆయనతో ఏమన్నారో తెలుసా?‘ఒరే పిచ్చి సన్నాసి! పెళ్ళైన రెండో నెలలోపే కడుపొచ్చిందంటే అది నీ వల్లే అని నమ్మకం ఏంటి? ఒకవేళ నీ వల్లే వచ్చినా లోకం అలా అనుకోదు. అయినా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? కొన్నాళ్ళు ఆగమని చెప్పేవాడ్ని కదా. అందుకే నువ్వే అమ్మాయిని ఒప్పించి మీ అత్త దగ్గరకు తీసుకెళ్ళి తీయించేయ్. ఎలాగూ ఆమె ఊళ్ళో పెద్ద డాక్టర్. ఏ గొడవలు లేకుండా పని పూర్తి చేస్తుంది.’ శంకర్రాయుడు ఆలోచనల్లో పడ్డాడు. కానీ ముఖంలో కంగారు, ఆశ్చర్యం, కోపం లేవు.‘‘మా ఆయన, అత్తగారు కూడా ఆయనతో ఏకీభవించి నన్ను బలవంతం చేస్తున్నారు నాన్నా. ‘లోకం’ పేరు చెప్పి ఆయన అలా అర్థం పర్థం లేకుండా అకారణంగా దొంగ చాటుగా నాపై అంత నీచమైన నింద వేసి, నా ఎదురుగా మాత్రం గొప్పగా నటించడం ఏమైనా బావుందా. చివరికి ‘మా నాన్నతో చెప్పాలి కదా’ అని అన్నాను. ఆ మాటకి కొంచెం జడుస్తారేమో అని. ‘సరే మంచిది’ అన్నారాయన. నాన్నా! రేపు వెళ్లి నీ ప్రతాపం చూపించు. మా అమ్మాయికిష్టం లేదు, తను బిడ్డని కంటుంది అని చెప్పు. కడుపు తీయించుకోదూ అని చెప్పు’’ ‘‘ఎందుకు తీయించుకోవూ?’’ హఠాత్తుగా పిడుగుపడ్డట్టు అయింది స్వప్నకి.‘‘ఏంటమ్మా ఇంత చిన్న విషయానికి ఇలా హైరానా పడిపోతున్నావ్? మీ మావగారు చెప్పినట్టే చేద్దాం. దాందేముంది? వాళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవించాలి కదా’’ స్థిమితంగా అన్నాడు శంకర్రాయుడు.స్వప్న ఇంకా తేరుకోలేదు. గొంతులో జీవం లేనట్లైంది.‘‘నాన్నా! నువ్వింకా మా మావగారిని గట్టిగా అడుగుతావు, నీ విశ్వరూపం చూపిస్తావు అనుకున్నా కానీ ఇలా ఆయన తరఫున మాట్లాడుతావని అనుకోలేదు. నేనేం తప్పుచెయ్యలేదు. నేను తీయించుకోను.’’ బిక్క మొహంతో చెప్పింది స్వప్న.‘‘అమ్మా! నువ్వింకా చిన్న పిల్లవి కావు. నీ అత్తింటి వారే నీకు అన్నీ. ఇక నువ్వు ఆ ఇంటి పిల్లవి. మీ విషయాల్లో నేను తల దూర్చి నిర్ణయాలు తీస్కోడం మంచి పద్ధతి కాదు.’’స్వప్న మరేం మాట్లాడలేదు. తండ్రి మాట్లాడని మాటలు కూడా ఆమెకు వినబడుతున్నాయి. రెండవ రోజే అత్తింటికి చేరి బలవంతంగానే డాక్టర్ ముందు కాళ్ళు చాపాల్సి వచ్చింది.స్వప్న బాధ భరించరానిది. తర్జన భర్జన పడుతున్న పర్జన్యాలలా ఆమె కనులు. ఎప్పటికీ ఇంకిపోనీ జలధారలుగా మారిపోయాయి ఆమె కన్నీళ్ళు. అమ్మలేని లోటు ఆ రోజు బాగా తెలుస్తోంది.రెండు నెలలు గడుస్తున్నా జరిగిన సంఘటనలోంచి బయట పడకముందే స్వప్న మళ్ళీ గర్భం దాల్చింది. పిల్లల్ని కనే యంత్రం తన భర్తే అయ్యాడు. ఆమె కాదు. వేసవిలో మొదట పండే మామిడి కాయలు అంత రుచిగా ఉండవు కాబట్టి తర్వాత పండే పండ్లను కొనుక్కున్నంత సులువుగా రెండో గర్భాన్ని ఆహ్వానించాడు స్వప్న మావగారు.తండ్రి మద్దతే ఉండుంటే వీళ్ళందరినీ ఓడించేదాన్ని కదా అని ఎంతో సంఘర్షణ పడింది. ఒంటరిగా నిలబడటానికి సమాజం భయపెట్టింది. పేదింటి పిల్లై్లనా పెద్దింటి పిల్లైనా అన్యాయానికి చిహ్నంగా ఇంటికో స్త్రీ మిగులుతూనే ఉంది.పండంటి ఆడబిడ్డకు అమ్మగా కొత్త మెట్టు ఎక్కింది స్వప్న. ఆమె మావగారు ఆనందంగానే ఉన్నారు గానీ మగ బిడ్డ కానందుకు మొహం ఎగబెట్టినట్టే కనబడ్డాడు. చేసిన పనికి ఆయనకా విషయం బయట పెట్టే అవకాశమూ లేకపోయింది.స్వప్న మాత్రం ఆడపిల్ల పుట్టినందుకు మహా ఆనందంగా ఉంది. భర్త తిట్టినప్పుడు ఓదార్చుతుందనో, వృద్ధాప్యంలో ఆదరిస్తుందనో కాదు. మేక వన్నె పులిలా ఇంతకాలం ప్రేమించి మావగారి మాట వినమని మొహం చాటేసిన తండ్రిలా, అర్థం పర్థం లేని అనుమానాలతో తన జీవితంలో ఒక మాయని మచ్చని పెట్టిన మావగారిలా, నోరెత్తలేని అసమర్థ భర్తలా, వారందరి అంశలను మోసుకొచ్చే ఒక మగ పిల్లాడు పుట్టనందుకు. ‘‘ఎందుకు తీయించుకోవూ?’’ హఠాత్తుగా పిడుగుపడ్డట్టు అయింది స్వప్నకి.‘‘ఏంటమ్మా ఇంత చిన్న విషయానికి ఇలా హైరానా పడిపోతున్నావ్? మీ మావగారు చెప్పినట్టే చేద్దాం. దాందేముంది? వాళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవించాలి కదా’’ స్తిమితంగా అన్నాడు శంకర్రాయుడు. - మానస ఎండ్లూరి -
కుటుంబం తోడ్పాటుతో క్యాన్సర్‌పై విజయం తథ్యం...
క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాగానే మొదట డాక్టర్లు దాని తీవ్రతను అంచనా వేస్తారు. క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం ‘టీఎన్ఎమ్’ అనే విషయాలను పరిశీలిస్తారు. ఇంగ్లిష్ పొడి అక్షరాల్లో ‘టీ’ అంటే ట్యూమర్ సైజ్, ‘ఎన్’ అంటే చుట్టుపక్కల ఉండే లింఫ్‌నోడ్స్, ఎమ్ అంటే పరిసరాల్లోని ఏయే భాగాలకు పాకిందని తెలుసుకునే ‘మెటాస్టాసిస్’. ఈ అంశాల ఆధారంగా క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకుంటారు. క్యాన్సర్‌లో ‘0’ నుంచి ‘4’ వరకు దశలు ఉంటాయి. ‘0’ అంటే క్యాన్సర్ ప్రారంభానికి ముందు దశ. ప్రారంభ దశను ‘స్టేజ్ 1’, పెద్ద గడ్డ లింఫ్ గ్రంథులకు సోకితే ‘స్టేజ్ 2’ లేదా ‘స్టేజ్ 3’ అని, ఇతర అవయవాలకు కూడా వ్యాపిస్తే దాన్ని ‘స్టేజ్ 4’ అని నిర్ధారణ చేస్తారు. నిర్ధారణ పరీక్షలు కొన్ని లక్షణాలను పరిశీలించాక, అవసరం అనిపిస్తే క్యాన్సర్‌ను నిర్ధారణ చేసే పరీక్షలను చేస్తుంటారు. ఎక్స్–రే, అల్ట్రాసౌండ్ స్కాన్, సీటీ స్కాన్, న్యూక్లియర్ స్కాన్, ఎమ్మారై, పెట్ స్కాన్, బయాప్సీ, రక్తపరీక్షలు, మలమూత్ర, కళ్లె పరీక్షల వంటివి అవసరాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. రకాన్ని బట్టి... తీవ్రతను బట్టి చికిత్స క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ జరిగితే వ్యక్తి వయసు, ఇతర ఆరోగ్య విషయాలను పరిగణనలోకి తీసుకొని ముందుగా సర్జరీ చేసి, ఇతర థెరపీలకు వెళ్తారు. ఒక్కోసారి ఇతర థెరపీల తర్వాత కూడా సర్జరీ చేస్తారు. చికిత్సలో భాగంగా సర్జరీ, కీమో, రేడియో, హార్మోన్ థెరపీలతో పాటు ఒక్కోసారి జీన్, బయొలాజికల్, ఇమ్యూనో వంటి అనేక థెరపీలు చేస్తారు. రక్త సంబంధిత క్యాన్సర్లు ఉన్నవారికి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. ఇటీవల వైద్యరంగంలోని పురోగతితో స్టెమ్‌సెల్ థెరపీ వంటివి కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ఏయే క్యాన్సర్లకు ఏయే తరహా చికిత్సలు అవసరం అన్నది అనేక విషయాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇక సర్జరీల విషయానికి వస్తే కోత తక్కువగా ఉండే లేజర్, కీహోల్ సర్జరీలు చేస్తున్నారు. అలాగే కీమోథెరపీలో కచ్చితంగా క్యాన్సర్ కణాన్ని మాత్రమే ప్రభావితం చేసేలా టార్గెటెడ్ థెరపీ చేస్తున్నారు. రేడియేషన్‌లో ఆధునికమైన వీఎమ్‌ఏటీ రేడియేషన్, 3డీ రేడియేషన్ అందుబాటులో ఉన్నాయి. హార్మోన్ థెరపీ కూడా ఇప్పుడు ఒక చికిత్సాప్రక్రియ. ఇక రోగనిరోధక శక్తిని పెంపొందిస్తూ క్యాన్సర్ కణాల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే ఇమ్యూనోథెరపీ వంటి కొత్త కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. చికిత్స ప్రక్రియలతో పాటు రోగి మానసిక స్థైర్యం, యోగా, ధ్యానం, మంచి ఆహారం అవసరం. వీటన్నింటికీ మించి రోగి కుటుంబ సభ్యుల తోడ్పాటు, సహకారం తప్పనిసరి.క్యాన్సర్ రావడానికి కచ్చితమైన కారణం తెలియదు. ఏ క్యాన్సర్ ఎవరిలో, ఎందుకు వస్తుందన్నదీ తెలియదు. కానీ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే మాత్రం పూర్తిగా నయం చేయడం సాధ్యమే. మంచి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్, పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, చక్కటి వైవాహిక జీవితం, యోగా, ధ్యానం, కాలుష్యాలకు దూరంగా ఉండటం వంటి మన చేతుల్లో ఉండే అంశాలతో చాలావరకు దీన్ని నివారించవచ్చు. అయితే చాలా కొద్దిరకాలలో మాత్రం క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు రోగి బాధలను తగ్గించి, వారి జీవననాణ్యతను మెరుగుపరచి, తక్కువ బాధతో జీవితాంతం గడిపేలా చేసే ప్రక్రియను ‘పాలివేటివ్ కేర్’ అంటారు. ఈ విభాగంలో మత్తు స్పెషలిస్టులు అయిన ఎనస్థిసిస్ట్, పెయిన్మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, డైటీషియన్, నర్సులు తమ సేవలు అందిస్తుంటారు. వారితో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల భూమిక చాలా కీలకం. కచ్చితంగా నయం చేస్తామనే ప్రకటనలను నమ్మకండి ‘మేం క్యాన్సర్‌ను తగ్గిస్తాం. క్యాన్సర్‌కు మా వద్ద కచ్చితమైన చికిత్సలున్నాయి‘ అంటూ చాలా రకాల ప్రకటనలు కనిపిస్తుంటాయి. వాటిని చూసి, నమ్మి, ఆచరించి రోగాన్ని ముదరబెట్టుకునే వాళ్లు చాలామందే ఉంటారు. ఏ వైద్యవిధానంలోనూ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసే మందులు లేవు. సైంటిఫిక్‌గా కచ్చితమైన క్లినికల్ ట్రయల్స్‌తో సాగే అల్లోపతిలోనూ తొలిదశలో గుర్తిస్తేనే క్యాన్సర్‌ను నయం చేయడం సాధ్యం. అందుకే అలాంటి బోగస్ ప్రకటనలను నమ్మకూడదు. నివారణ సులభమే... పొగతాగే అలవాట్లు, వాడిన నూనెలనే మళ్లీ మళ్లీ మరగకాచి వాడటం, వంటింటి పొగ బయటకు వెళ్లకుండా అక్కడక్కడే తిరగడం, ఇంట్లో క్రిమిసంహారకాలను వాడుతూ ఆ వాసనలను నిత్యం పీల్చడం వంటి అంశాలు లంగ్స్, గొంతు, నాలుక వంటి క్యాన్సర్లకు దారి తీయవచ్చు. పై అంశాల నుంచి దూరంగా ఉంటే చాలావరకు సులభంగా నివారణ సాధ్యమైనట్లే కదా. స్త్రీలు ఈ వ్యాధికి గురైనప్పుడు తల్లడిల్లిపోతుంటారు. ఇల్లు, పిల్లలు ఏమైపోతారో అన్న వ్య«థతో పాటు, వైద్యానికి ఖర్చవుతోందని, ఆర్థికభారం పడుతోందని మనోవేదనకు గురవుతుంటారు. వారికి డాక్టర్లు ఇచ్చే కౌన్సెలింగ్‌తో పాటు కుటుంబ సభ్యుల సహకారం చాలా ముఖ్యం. మహిళల్లో రొమ్ము క్యాన్సర్స్, గర్భాశయ – గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ఎక్కువ. అవి వచ్చాక బాధపడటం కంటే వచ్చే అవకాశం ఉన్న క్యాన్సర్లపై అవగాహన పెంచుకొని తరచూ పరీక్షలు చేయించుకుంటూ నిర్భయంగా ఉండటం మంచిది. - Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
స్వైన్‌ఫ్లూపై వైద్య బృందం సర్వే
ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ పశ్చిమం) : ఇక్కడి ఏపీఎస్ఈబీ కాలనీలో ఒక మహిళకు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల ఆ కాలనీకి చెందిన 45 ఏళ్ల మహిళ అనారోగ్యంతో కేజీహెచ్‌లో చేరింది. అక్కడ పరీక్షలు చేసిన తరువాత సోమవారం స్వైన్ ఫ్లూ వ్యాధిగా నిర్ధారించారు. ఈ సమాచారం మేరకు ఆ ప్రాంతంలో బుచ్చిరాజుపాలెం రూరల్ వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ జ్యోతి, డాక్టర్ పార్థసారథి వైద్య సిబ్బం దితో కలిసి సర్వే చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులను కూడా పరిశీలించామని జ్యోతి తెలిపారు. వీరికి ముందస్తు వ్యాధి నిరోధక మందులను అందించామన్నారు. వ్యాధి సోకి న మహిళను ప్రస్తుతం ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించామని, ఆమెకు ప్రమాదమేమి లేదని, కోలుకుంటోందని తెలిపారు. బాధితురాలు ఇటీవల పలు ప్రాంతాల్లో పర్యటించి రావడం వల్ల ఈ వ్యాధి సోకి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. ఆమె నుంచి మరెవరికీ సోకలేదని వివరించారు. ఈ ప్రాంతంలో ఉన్నవారికి వ్యాధి రాకుండా చేపట్టవలసిన చర్యల గురించి వివరించారు. వ్యాధి సోకినపుడు ఎక్కువగా ద్రవ పదార్థాలు, పోషకాహారాలు తీసుకోవాలన్నారు. -
ఆధునిక వైద్యంతో అదుపులో ఆస్తమా!
ఆస్తమా కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు ఎనిమిదేళ్లు. డాక్టర్లు వాడికి ఆస్తమా ఉన్నట్లు నిర్ధారణ చేసి మందులు ఇస్తున్నారు. ఆస్తమా అటాక్ అంటే ఏమిటి? ఎలాంటి చికిత్స అవసరం? – సుభాష్, రామగుండం చలికాలం తీవ్రమైన చలి, ఎండాకాలంలో విపరీతమైన వేడిమి, అత్యధికంగా రేగే దుమ్ము వంటివి ఎక్కువగా ఉండే మీలాంటి ప్రదేశాలలో ఆస్తమా కేసులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాతావరణంలోని మార్పులు ఎక్కువగా ఉండే ఆస్తమా లక్షణాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దాంతో ఆస్తమాతో బాధపడేవారి పరిస్థితి తీవ్రంగా తయారవడాన్ని ఆస్తమా అటాక్ లేదా ఆస్తమా ఎపిసోడ్ అంటున్నారు. ఈ పరిస్థితి హఠాత్తుగా ఏర్పడవచ్చు. కొన్నిసార్లు ఇది విషమించి తక్షణ వైద్యసాయం అవసరమవుతుంది. ఆస్తమా అటాక్ జరిగినప్పుడు శ్వాసవ్యవస్థలో వేగంగా కొన్ని మార్పులు జరుగుతాయి. ఇవి ప్రాణాంతకం కూడా కావచ్చు. ►వాయునాళాల చుట్టూతా కండరాలు బిగుసుకుంటాయి. దాంతో గాలి ప్రయాణించే మార్గం మరింతగా కుంచిస్తుంది n శ్వాసకోశాలకు చేరే గాలి పరిమాణం బాగా తగ్గిపోతుంది n వాయునాళాల వాపు ఎక్కువై, వాయువులు ప్రయాణం చేసే దారి మరింత సన్నబారిపోతుంది ►వాయునాళాలలో వాపు వల్ల ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు రోగనిరోధక వ్యవస్థ ఎక్కువ మ్యూకస్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో వాయునాళాలు మరింతగా మూసుకుపోతాయి. ఈ మార్పులతో సాధారణ స్థాయి నుంచి ప్రమాదకర స్థాయి వరకు ఆస్తమా అటాక్ జరుగుతుంది. ఈ అటాక్ ప్రారంభంలో ఊపిరితిత్తులకు కొంచెం తక్కువగానైనా ఆక్సిజన్ అందుతుంది. కానీ శ్వాసకోశాల నుంచి కార్బన్ డై ఆక్సైడ్ బయటకు రావడం కష్టంగా ఉంటుంది. ఇది మరికొంత సమయం కొనసాగే సరికి శ్వాసకోశాలలో కార్బన్ డై ఆక్సైడ్ నిలిచిపోయి శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. క్రమంగా ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్ పరిమాణం చాలా తక్కువ స్థాయికి పడిపోతుంది. దీంతో శరీరంలోని వివిధ భాగాలకు రక్తం ద్వారా అందే ఆక్సిజన్ తగ్గుతుంది. ఈ రకమైన ఆస్తమా అటాక్ చాలా ప్రమాదకరమైనది. రోగిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. అత్యవసర ఆధునిక వైద్యసేవలే ప్రాణాలు కాపాడతాయి ఆస్తమా చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యక్తి జీవితంలోని అన్ని రంగాలలో నష్టపోవాల్సి వస్తుంది. పిల్లలు తరచూ స్కూలుకు వెళ్లలేరు. తగినంతగా పనిచేయలేక, శ్రద్ధ చూపలేక, పెద్దవాళ్లు వృత్తి ఉద్యోగాలలో వెనకబడిపోవాల్సి వస్తుంది. శరీరం బలహీనంగా ఉండటం వల్ల వ్యక్తిగత అభిరుచులు, ఆనందాలకు దూరం కావాల్సి వస్తోంది. ఆస్తమా అటాక్ వచ్చి పరిస్థితి విషమించిన సమయంలో అత్యవసర వైద్యసేవలు, నిపుణులైన డాక్టర్ సహాయం అత్యవసరం. మొదట కృత్రిమంగా శ్వాస అందించే ఏర్పాటు చేసి, మందుల ద్వారా వాయునాళాలు తెరిచి సహజంగా ఊపిరి తీసుకునేట్లు చేస్తారు. ఆపైన ఆస్తమా మరీ తీవ్రంగా రావడానికి కారణమైన అంశాలను గుర్తించి వాటి నుంచి కాపాడుకునేందుకు, మరోసారి ఆస్టమా అటాక్ రాకుండా ఉండేందుకు మందులు ఇస్తారు. అలవాట్లలో మార్పులు సూచిస్తారు. ఇలా ఆస్తమాను అదుపులో ఉంచుకొని సాధారణ జీవితం గడపడం సాధ్యమవుతుంది. డాక్టర్ పి.నవనీత్ సాగర్ రెడ్డి సీనియర్ పల్మునాలజిస్ట్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ అర్టికేరియాతో చర్మంపై దద్దుర్లు...! హోమియో కౌన్సెలింగ్ నా వయసు 24 ఏళ్లు. నాకు అప్పుడప్పుడు చర్మం మీద ఎర్రని దద్దుర్లు కనిపిస్తున్నాయి. మర్నాటికి అవి తగ్గుతున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘అర్టికేరియా’ అన్నారు. మందులు వాడుతున్నా ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. హోమియో చికిత్స ద్వారా సమస్య పూర్తిగా నయమవుతుందా? – చంద్రశేఖర్, కర్నూల్ అర్టికేరియా చాలా సాధారణంగా కనిపించే చర్మ సమస్య. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇది ఏ వయసు వారికైనా కనిపించవచ్చు. కొందరిలో ఈ సమస్య 24 గంటల్లో దానంతట అదే తగ్గుతుంది. కానీ మరికొందరిలో ఇది దీర్ఘకాలం కొనసాగుతూ తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది. దీన్ని రెండురకాలుగా విభజించవచ్చు. అవి... అక్యూట్ అర్టికేరియా: సమస్య ఆరు వారాల కంటే తక్కువ రోజులు ఉన్నట్లయితే దాన్ని అక్యూట్ అర్టికేరియా అంటారు. సమస్యను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు ఇది కలుగుతుంది. క్రానిక్ అర్టికేరియా: ఆరువారాలకు పైబడి కొనసాగితే దాన్ని క్రానిక్ అర్టికేరియా అంటారు. ఇలా దీర్ఘకాలిక సమస్యగా మారడానికి కారణాలు ఇంకా స్పష్టంగా లభించలేదు. అయితే మన ఒంట్లో అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సమస్యలైన థైరాయిడ్, లూపస్ వంటి వాటి వల్ల అర్టికేరియా కనిపించవచ్చు. కారణాలు: మన శరీరానికి సరిపడని పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిస్పందనగా మన ఒంట్లో హిస్టమైన్స్ అనే పదార్థంలో పాటు కొన్ని రకాల రసాయనాలు రక్తప్రవాహంలోకి విడుదల అవుతాయి. వాటి ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. ఇదే సమస్య మన రోగ నిరోధక శక్తి మనపైనే దుష్ప్రభావం చూపినప్పుడు కూడా కనిపిస్తుంది. అర్టికేరియాను ప్రేరేపించే అంశాలు: n నొప్పి నివారణకు ఉపయోగించే మందులు n కీటకాలు, పరాన్నజీవులు n ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, వైరస్లు, n అధిక ఒత్తిడి, సూర్యకాంతి n మద్యం, కొన్ని సరిపడని ఆహార పదార్థాలు n అధిక లేదా అల్ప ఉష్ణోగ్రతలు n జంతుకేశాలు, పుప్పొడి రేణువులు వంటి చాలా అంశాలు అర్టికేరియాను ప్రేరేపిస్తాయి. లక్షణాలు: n చర్మంపై ఎరుపు లేదా డార్క్ కలర్లో దద్దుర్లు ఏర్పడటం n విపరీతమైన దురదగా అనిపించడం n దద్దుర్లలో మంట, నొప్పి కూడా అనిపించడం n కళ్లచుట్టూ, చెంపలు, చేతులు, పెదవులపై కూడా అవి ఏర్పడవచ్చు n గొంతులో వాపు ఏర్పడి అది వాయునాళాలకు అడ్డుగా పరిణమించి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు n దద్దుర్ల పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ వాటిని ప్రేరేపించే అంశాలకు గురైనప్పుడు కనిపిస్తూ... ఆ తర్వాత అదృశ్యమవుతూ ఉండవచ్చు. చికిత్స: హోమియో ప్రక్రియ ద్వారా కాన్స్టిట్యూషన్ పద్ధతుల్లో అత్యంత సునిశితమైన పరిశీలతో తగిన మందులు ఇవ్వవచ్చు. వాటి వల్ల రోగనిరోధక కణాల్లో పునరుజ్జీవనం కలిగి అవి అర్టికేరియాను సమర్థంగా ఎదుర్కొంటాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
ఆటిజమ్ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ మా అబ్బయి ఐదేళ్లు. మాటలు సరిగా రావడం లేదు. డాక్టర్‌కు చూపిస్తే ఆటిజమ్ అంటున్నారు. హోమియోలో చికిత్స ఉందా? - నాగేశ్వర్రావు, తెనాలి మాటలు సరిగా రాకపోవడం అన్నది ఆటిజమ్ ఉన్నపిల్లల్లోని ఒక లక్షణం. వారిలో చాలా ఇతర సమస్యలు కూడా కనిపిస్తాయి. అందుకే ఆటిజమ్ నిర్ధారణ చేయాలంటే ఇతర సమస్యలు ఉన్నాయేమో చూడాలి. కేవలం పిల్లల లక్షణాలను బట్టి ఆటిజమ్ అని నిర్ధారణకు రాకుండా వైద్యులకు చూపించుకున్న తర్వాతే దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆటిజమ్ఉన్న పిల్లలలో ఆరోగ్యంగా ఉన్న పిల్లలలో తేడాను కనిపెట్టడం అంత సులభం కాదు. ఆటిజమ్ లక్షణాల తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో ఈ లక్షణాలు స్పష్టంగా, నిర్దిష్టంగా ఉంటాయి. దాన్ని క్లాసికల్ ఆటిజమ్ అంటారు. కొందరిలో లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటుంది. అది వారి జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపించదు. దీన్ని మైల్డ్ ఆటిజమ్, ఆస్పర్జర్ సిండ్రోమ్ అని అంటారు. తీవ్రత ఎలా ఉన్నా ఆటిజమ్ ఉన్న పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇవి... మాట్లాడటం, భావవ్యక్తీకరణలో, ఏకాగ్రతను చూపలేకపోవడం, అందులో ఇబ్బందులు ఎదుర్కోవడం. (ఆటిజమ్ ఉన్న 40 శాతం మందిలో మాటలే రాకపోవచ్చు) పిల్లలు స్నేహితులను చేసుకోలేకపోవడం ఎదుటివారి మనోభావాలను అర్థం చేసుకోలేకపోవడం నలుగురిలో కలవలేకపోవడం; ఆనందాలను, బాధలను పంచుకోలేకపోవడం ఒకేమాటను పదే పదే ఉచ్చరించడమో లేదా అడిగిన ప్రశ్ననే మళ్లీ తిరిగి అడగటమో చేస్తుంటారు. ఎప్పుడూ రొటీన్‌నే కోరుకోవడం... అంటే ఒకేరకమైన ఆహారం లేదా దుస్తులు వేయమని అడగడం. వయసుకు తగినంత మానసిక పరిపక్వత చూపలేకపోవడం చేతులు, కాళ్లు విచిత్రంగా ఆడించడం, కదపడం, చుట్టూ తిరగడం, గజిబిజిగా నడవడం, శరీరంలో జర్క్ ఇచ్చినట్లుగా కదలికలు ఉండటం- ఇవన్నీ ‘ఆటిజమ్’ను గుర్తించడానికి బాగా తోడ్పడతాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. మాటలు రాని వారికి స్పీచ్ థెరపీ ఉపయోగపడుతుంది. బిహేవియరల్ థెరపీ వంటి చికిత్స ప్రక్రియల వల్ల పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది. హోమియోలో పిల్లల లక్షణాలు, కారణాల వంటి అనేక అంశాను పరిగణనలోకి తీసుకుని ఔషధాలను సూచిస్తారు. హోమియో చికిత్సలో ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. సరైన హోమియో మందులను, తగిన మోతాదులో అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడటం వల్ల పిల్లల్లో ఆటిజమ్ చాలావరకు నయమవుతుంది. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్ పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ లింఫోమా అంటే ఏమిటి? లింఫోమా క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. గత కొద్ది రోజులుగా నేను ప్లీహం (స్ల్పీన్) పెరగడం వల్ల బాధపడుతున్నాను. పొట్టలో నొప్పి, గజ్జలలో వాపు, జ్వరం-చలి, రాత్రిపూట చెమటలు పట్టడం లక్షణాలు కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను కలిసి ఈ లక్షణాలను చెబితే, కొన్ని పరీక్షలు నిర్వహించి నేను లింఫోమా వ్యాధితో బాధపడుతున్నాని నిర్ధారణ చేశారు. లింఫోమా అంటే ఏమిటి, దానికి చికిత్స ఏమిటో చెప్పండి. - విశ్వేశ్వరరావు, వైజాగ్ లింఫోమా అనేది లింఫోసైట్స్ (తెల్ల రక్త కణాలను) ఉత్పత్తి చేసి, నిల్వ చేసి, తీసుకెళ్లే కణజాలాల వ్యవస్థలో కలిగే క్యాన్సర్. ఇది ప్రాథమికంగా రెండు రకాలుగా ఉంటుంది. 1) హాడ్జ్కిన్స్ లింఫోమా 2) నాన్-హాడ్జ్కిన్స్ లింఫోమా లింఫోమా లక్షణాలు నొప్పి లేకుండా మెడలో, చంకలో, గజ్జల్లో వాపు ప్లీహం (స్ప్లీన్) పెరగడం, పొట్టనొప్పి, అసౌకర్యం జ్వరం చలి లేదా రాత్రిళ్లు చెమటలు పట్టడం నిస్సత్తువగా అనిపించడం. రోగ నిర్ధారణ పరీక్షలు రక్త పరీక్షలు బయాప్సీ ఎముక మూలుగ పరీక్ష సెరిబ్రో స్పినల్ ఫ్లుయిడ్స్ మాలిక్యులార్ రోగ నిర్ధారణ పరీక్షలు ఎక్స్‌రే, సీటీ స్కాన్, పెట్ స్కాన్ అనే ఇమేజింగ్ పరీక్షలు. వైద్య పరీక్షలను క్షుణ్ణంగా చేశాక మీ శరీరంలో లింఫోమా ఏ దశలో ఉందో మీ వైద్యుడికి తెలుస్తుంది. ఆ తర్వాత మీకు ఎలాంటి చికిత్స అందించాలన్న అంశం మూడు ప్రధాన విషయాలపై ఆధారపడి ఉంటుంది. అవి... మీకు ఏ రకరమైన లింఫోమా ఉంది మీకు ఉన్న లింఫోమా ఏ దశలో ఉంది (అంటే లింఫోమా వల్ల ఏయే అవయవాలు దెబ్బతిన్నాయి) మీ సాధారణ ఆరోగ్యాన్నీ చూస్తారు. లింఫోమా తర్వాతి జీవితం పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి,. అయితే ఒకేసారి ఎక్కువగా భోజనం చేయకూడదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినాలి మీ నోట్లో ఏదైనా పుండు వంటిది ఉంటే మెత్తటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, బత్తాయి పండ్ల రసం తీసుకోకూడదు ద్రవాహారం పుష్కలంగా తీసుకోండి మీ డాక్టర్ సలహా మేరకు సింపుల్ స్ట్రెచింగ్ వ్యాయామాలు, కొద్ది పాటి నడక వంటి ఎక్సర్సైజ్లు చేయాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి, కంటి నిండా నిద్రపోవాలి తాజా గాలి బాగా పీల్చాలి కుంగుబాటు లేకుండా జీవించాలి ఒకవేళ కుంగుబాటు ఎక్కువ కాలం ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. లింఫోమాను కనుగొన్న తర్వాత మీ లిపిడ్లను, థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాలను క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకుంటూ ఉండటం ముఖ్యం. అవేగాక మరికొన్ని పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. డాక్టర్ సోనాలి సదావర్తి కన్సల్టెంట్ హెమటో ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్ మాటిమాటికీ నిద్ర... ఏం చేయాలి? స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్‌లో పాల్గొంటున్నప్పుడూ, తింటున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీని వల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి. - నవీన్, హైదరాబాద్ మీరు చెబుతున్న దాన్ని బట్టి మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కదిలే దశ... ఇలాగ. కనుపాపలు వేగంగా కలిదే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్ఈఎమ్ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి. నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. అయితే ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. ఇక మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది. అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాట కూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీ డిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో దీనికి చికిత్స చేయవచ్చు. డాక్టర్ రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
డెంగ్యూ జ్వరం... నిర్ధారణ ఎలా?
డెంగ్యూ ఫీవర్ కౌన్సెలింగ్ నా వయసు 24 ఏళ్లు. ఈమధ్య మా ఊరికి వెళ్లి వచ్చాను. ఆ తర్వాతి రోజు నుంచి నాకు జ్వరం వస్తోంది. మాకు దగ్గర్లో ఉన్న ఒక డాక్టర్ గారిని సంప్రదిస్తే డెంగ్యూ జ్వరంలా అనిపిస్తోందని అంటున్నారు. ఇంకా పెద్ద డాక్టర్గారికి చూపించలేదు. డెంగ్యూ జ్వరాన్ని ఎలా నిర్ధారణ చేస్తారు. - శ్రీనివాస్, విశాఖపట్నం డెంగ్యూ జ్వరానికి లక్షణాలకే చికిత్స చేస్తారు. దీని నిర్ధారణ కోసం డెంగ్యూ ఎన్ఎస్1, డెంగ్యూ సీరాలజీ, డెంగ్యూ ఐజీజీ, ఐజీఎమ్ అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఫలితాలు రావడానికి నాలుగు నుంచి ఆరు రోజుల సమయం పడుతుంది. ఈ పరీక్షలు కొద్దిగా ఖర్చుతో కూడుకున్నవి. పైగా వ్యాధి నిర్ధారణ రిపోర్టులు వచ్చే సమయం కూడా ఎక్కువ కాబట్టి లక్షణాలను బట్టి ముందుగానే చికిత్స తీసుకోవడం మంచిది. రక్తంలోని ప్లేట్లెట్ కౌంట్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ, అవి తగ్గిపోకుండా చూసుకోవాలి. లక్షణాలు : జ్వరం, తలనొప్పి (ముఖ్యంగా నుదురు ప్రాంతంలో), కళ్ల వెనక నొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, రాష్, ఒంటిపై ఎర్రని మచ్చలు రావడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ వచ్చిన వారిలో రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. లక్షణాలకు మందులు ఇవ్వడమే తప్ప డెంగ్యూకు ప్రత్యేకంగా చికిత్స అంటూ లేదు. కాబట్టి రాకుండా నివారించుకోవడమే ఉత్తమమైన పద్ధతి. అలాగే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, దోమలు పెరగకుండా చూసుకోవడం మంచిది. ఒళ్లంతా కప్పి ఉంచేలా లాంగ్స్లీవ్ దుస్తులు ధరిస్తూ వుండాలి. రాత్రివేళ్లల్లో దోమలు కుట్టకుండా మస్కిటో రిపెలెంట్స్ వాడండి. ప్లేట్లెట్స్ తగ్గుతున్నప్పుడు మాత్రం వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలి. అయితే రోజుకు ఒకసారి ప్లేట్లెట్స్ చెక్ చేసుకుంటే చాలు. - డాక్టర్ అనిల్ కోటంరెడ్డి వెల్నెస్ కన్సల్టెంట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
నిర్ధారణ అంతంతే..
* లైంగిక వేధింపుల కేసుల్లో నిర్ధారణ 3శాతం మించడం లేదు * ఐదు శాతం కంటే తక్కువ మందికి మాత్రమే పరిహారం * మహిళల రక్షణ కోసం కమిటీలు కూడా లేవు సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో రోజూ ఏదో ఒక మూల మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు సర్వసాధారణమైపోయాయి. ఇలాంటి ఘటనల్లో గడప దాటి పోలీస్‌స్టేషన్ వరకు వచ్చే కేసులు చాలా తక్కువ. సమాజం పేరిట, కుటుంబ గౌరవం పేరిట ఎన్నో అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనలు నాలుగ్గోడల మధ్యనే సమాధి అయిపోతున్నాయి. పోనీ ఇలాంటి ఎన్నో అడ్డంకులను దాటుకొని ధైర్యంగా పోలీస్‌స్టేషన్ వరకు వచ్చిన కేసుల్లో కూడా నిర్ధారణ ఎంత వరకు జరుగుతోంది అంటే కేవలం 3శాతం మించడం లేదన్న సమాధానం వినిపిస్తోంది. ఈ విషయాలన్నీ మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న లైంగిక వేధింపుల కేసుల్లో నిర్ధారణ అయి నిందితులకు శిక్షలు పడుతోంది 3శాతం మాత్రమే. అంటే ప్రతి 100 మంది నిందితుల్లో ముగ్గురికి మాత్రమే జైలు శిక్ష పడుతోంది. మిగతా 97 మంది సులువుగా చట్టం చేతుల నుంచి తప్పించుకుంటున్నారు. ఇక రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ తరహా కేసుల నిర్ధారణ శాతం ఎలా ఉందో గమనిస్తే మైసూరు, బాగల్కోటె జిల్లాల్లో రాష్ట్రంలోనే అధికంగా 4శాతం కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఇక కల్బుర్గి, బీదర్‌లో 2శాతం, ఉడుపిలో 1.7శాతం, హావేరిలో 1.6శాతం కేసులు నిర్ధారణ అవుతున్నట్లు తెలుస్తోంది. పరిహారమూ అందడం లేదు... ఇక ఇదే సందర్భంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు అందజేయాల్సిన పరిహారం సైతం వారికి సరిగ్గా అందడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 5శాతం మంది బాధితులకు మాత్రమే నష్ట పరిహారం అందిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత చట్టాల ప్రకారం యాసిడ్ దాడి కేసుల బాధితులకు రూ.3లక్షలు, లైంగిక దాడుల బాధితులకు రూ.2లక్షలు, హ్యూమన్ ట్రాఫికింగ్‌లో చిక్కుకొని బయటపడిన బాధితులకు పునర్వసతి కల్పించేందుకు రూ.2లక్షలు ప్రభుత్వం పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే 100 మంది బాధితుల్లో కేవలం ఐదుగురికి మాత్రమే పరిహారం అందుతోంది. మిగిలిన బాధితులు ఏళ్ల తరబడి తమకు అందాల్సిన పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. 90శాతం సంస్థల్లో రక్షణ కమిటీలు కూడా లేవు....... పనిచేసే ప్రాంతాల్లో ఉద్యోగినులపై లైంగిక దాడులను నిరోధించేందుకు గాను రూపొందించిన ‘సెక్సువల్ హెరాష్‌మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్కప్లేస్(ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్-2013’ ప్రకారం ప్రతి సంస్థలోనూ మహిళల రక్షణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి ఒక మహిళ అధ్యక్షత వహించాలి. అయితే రాష్ట్రంలోని సంస్థల్లో కేవలం 10శాతం సంస్థలు మాత్రమే ఈ కమిటీలను ఏర్పాటు చేశాయి. మిగిలిని 90శాతం సంస్థల్లో మహిళల భద్రతకు అవసరమైన రక్షణ కమిటీలను ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. -
ఉగ్రవాదుల కదలికలపై నిఘా
ఏడాది క్రితం వికారుద్దీన్ ఎన్కౌంటర్.. అదే తేదీన కోర్టులో పేలుడు తమిళనాడు జైళ్లకు పలు లేఖలు రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు చిత్తూరు (అర్బన్):చిత్తూరు కోర్టులో జరిగిన బాంబు పేలుడు ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దీనికి తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులకు మరిన్ని ఆధారాలు లభిం చాయి. దీంతో ఉగ్రవాదుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. 2015 ఏప్రిల్ 7న తెలంగాణలో జరిగిన వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ చిత్తూరు కోర్టులో పేలుడు సృష్టించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఏడాది తరువాత 2016 ఏప్రిల్ 7న చిత్తూరు కోర్టులో బాంబు పేలడమే ఇందుకు నిదర్శనం. ఇది తమ పనేననంటూ ‘బేస్ మూమెంట్’ పేరిట చిత్తూరులోని వాణిజ్య పన్నులశాఖ డెప్యూటీ కమిషనరుకు లేఖ రావడం, దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి పుత్తూరులో దొరికిన ఆల్-ఉమా తీవ్ర వాదులపై అనుమానపడడం తెలిసిందే. ఇందులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సిద్దికి కోసం గాలింపులు చేపట్టారు. ఎవరీ సిద్దికి... ముస్లింల అణచివేతను నిరసిస్తూ 20 ఏళ్ల క్రితం తమిళనాడుకు చెందిన సిద్దికి ఆల్-ఉమా అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. అప్పట్లో తమిళనాడు పోలీసులు అతన్ని అరెస్టు చేసినా తప్పించుకున్నాడు. తరువాత 1998లో ఎల్కే అద్వాని లక్ష్యంగా కొయంబత్తూరులో పేలుడు జరగడం, 58 మంది మృతి చెందడంతో సిద్దికి పేరు తెరపైకి వచ్చింది. అనంతరం అతను కనుమరుగయ్యాడు. 2013 అక్టోబర్‌లో పుత్తూరులో జరిగిన ఆపరేషన్‌లో ఆల్-ఉమాకు సంబంధించిన బిలాల్ మాలిక్, పన్నా ఇస్మాయిల్, ఫకృద్దీన్‌ను అరెస్టు చేశారు. తమిళనాడులో జరిగిన బీజేపీ, శివసేన కార్యకర్తల హత్య కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. చెన్నై నుంచి వీళ్లను మన జిల్లాలోని కోర్టుల్లో వాయిదాకు హాజరు పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరులో జరిగిన పేలుళ్లు ఆల్-ఉమా, బేస్ మూమెంట్ సంస్థలకు పనేనని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో సిద్దికి హస్తం ఉన్నట్లు తాజాగా పోలీసులు చెబుతున్నారు. జైళ్లకు లేఖలు.. కోయంబత్తూరు పేలుళ్లు, బీజేపీ నేతల హత్యల్లో నిందితులుగా ఉన్న వారు ప్రస్తుతం తమిళనాడు జైళ్లల్లో ఉన్నారు. వీరికి మద్దతుగా ఆర్నెళ్లుగా ఆయా జైళ్ల శాఖలకు ఇంగ్లీషులో టైప్ చేసిన లేఖలు పోస్టుల ద్వారా వస్తున్నాయి. ముస్లింలపై నిర్బంధం, అణచివేతకు ప్రతీకా రం తప్పదని హెచ్చరించారు. చిత్తూరు కోర్టులో బాంబు పెట్టింది తామేనని, మరి కొన్ని దాడులు చేస్తామంటూ పేర్కొన్నారు. ఈ లేఖలను పరిశీలించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), యాంటీ టైస్ట్ ఫోర్సు (ఏటీఎఫ్), బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (బీఐ)కు మన రాష్ట్ర హోంశాఖ నుంచి చిత్తూరు ఘటన వివరాలు వెళ్లాయి. -
ప్యాంక్రియాటైటిస్ అంటే...?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నేను ఒక రెస్టారెంట్లో పనిచేస్తుంటాను. కొన్ని రోజుల నుంచి నాకు కడుపులో తీవ్రమైన మంటగా ఉంటోంది. అసిడిటీ అనుకొని దానికి సంబంధించి సొంతంగా మందులు వాడాను. కానీ తగ్గలేదు. తర్వాత పొట్ట ఉబ్బడం, కళ్లు తిరగడం, వాంతి అవుతున్నట్లు అనిపించడంతో పాటు అన్నం తిన్న తర్వాత పొట్ట పై భాగంలో నొప్పి మొదలై అక్కడి నుంచి వీపు వైపు పాకడం లాంటి లక్షణాలను చోటు చేసుకున్నాయి. దీంతో నేను వెంటనే డాక్టర్‌ను కలిశాను. ఆయన కొన్ని పరీక్షలు చేయించి, ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధి వచ్చినట్లు నిర్ధారణ చేసి, సర్జరీ చేయాలంటున్నారు. అసలు ఈ జబ్బు ఎందుకు వస్తుంది? సర్జరీ కాకుండా మందులతో తగ్గదా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - మహ్మద్ అబ్దుల్లా, హైదరాబాద్ శరీరంలోని అవయవాలలో ‘ప్యాంక్రియాస్’ (క్లోమ గ్రంథి) చిన్న పేగుకు పక్కనే ఉండి జీర్ణ ప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. ఇందులో ఉండే కణజాలాలు గ్లూకగాన్, ఇన్సులిన్, సొమటోస్టాటిన్ అనే హార్మోన్లను రక్తంలోకి విడుదల చేసి దానిని శక్తిగా మారుస్తుంటాయి. డయాబెటిస్ సమస్య నుంచి కూడా ఈ గ్రంథి కాపాడుతుంది. అయితే ప్యాంక్రియాస్ స్రావాలు ఒక గొట్టం ద్వారా వచ్చి చిన్న పేగులో కలుస్తాయి. ఈ గొట్టంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే అక్కడ వాపు వస్తుంది. దీనినే ప్యాంక్రియాటైటిస్ వ్యాధి అంటారు. మరికొన్ని సందర్భాలలో క్లోమరసంలో ప్రోటీన్ల పరిమాణం ఎక్కువై ఉండలుగా ఏర్పడి, అవి గొట్టంలో అడ్డుపడటం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మితిమీరిన మద్యపానం కూడా ఈ జబ్బుకు ఒక కారణం కావచ్చు. నిష్ణాతులైన డాక్టర్ల పర్యవేక్షణలోపం వల్ల దీన్ని ప్రాథమిక దశలోనే కనిపెట్టలేకపోవడంతో ఈ వ్యాధి ముదిరి రోగికి ప్రమాదకరంగా మారుతుంది. మీకు రక్తపరీక్షలు, సీరమ్ లైపేజ్ పరీక్షలు, అలాగే సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కాన్ లాంటివి చేసి, ప్యాంక్రియాస్ రక్తనాళం ఏ స్థాయిలో ఉబ్బి ఉందో అలాగే క్లోమం ఏ మేరకు దెబ్బతిన్నదో నిర్ధారణ చేసి మీకు చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. ఉంటే మీ డాక్టర్ చెప్పింది అక్షరాలా వాస్తవం. అయితే కొన్ని సందర్భాల్లో మందులతో కూడా ఈ వ్యాధి తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం ఆధునిక శస్త్రచికిత్స ప్రక్రియ అయిన లాప్రోస్కోపిక్ సర్జరీ / కీ హోల్ సర్జరీ ద్వారా విధానం ద్వారా చెడిపోయిన మేరకు క్లోమగ్రంథి భాగాన్ని తొలగించవచ్చు. కీహోల్ సర్జరీ వల్ల హాస్పిటల్లో రోగిని ఉండాల్సిన వ్యవధి గణనీయంగా తగ్గుతుంది. సర్జరీ తర్వాత కొద్దికాలంలోనే కోలుకొని మీ వృత్తి జీవితాన్ని కొనసాగించవచ్చు. మీరెంత మాత్రమూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ టి.ఎల్.వి.డి. ప్రసాద్ బాబు, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. నేను మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. చారు వంటి వాటిల్లోనూ కాస్త కొవ్వులతో వండిన దాల్చా వేసుకుంటూ తింటుంటాను. కొవ్వులతో కూడిన ఆహారం ఇంత ఎక్కువగా తీసుకోకూడదనీ, దీనివల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పేరుకుంటుందనీ, అది ఈ వయసులో గుండె జబ్బులకు దారితీస్తుందని ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - సిరాజుద్దిన్, వరంగల్ కొలెస్ట్రాల్ అనే కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఒంటికి మేలు చేసే కొవ్వులు. వీటిని హైడెన్సిటీ లైపో ప్రొటీన్ (హెచ్‌డీఎల్)అంటారు. ఇవి గుడ్డు తెల్లసొనలో ఉంటాయి. శరీరానికి హానికారకమైన కొవ్వులను ఎల్డీఎల్ (లోడెన్సిటీ లైపో ప్రొటీన్స్) అంటారు. చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు గుండెజబ్బులకు ఒక రిస్క్ ఫాక్టర్. చెడు కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో, ఫాస్ట్ ఫుడ్ తీసుకునే వారిలో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో ఈ రెండు రకాల కొవ్వులు కలుపుకొని 200 లోపు ఉండాలి. ఎల్డీఎల్ 100 లోపు, హెచ్‌డీఎల్ 40పైన ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే మరో రకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి. ఇవి 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరంలోకి రెండు రకాలుగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మరొకటి లివర్ పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ కోసం, శిశువు రెండేళ్ల పాటు ఎదగడానికి ఈ కొలెస్ట్రాల్ కొవ్వులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే జన్యుతత్వాన్ని బట్టి ఈ కొవ్వులు (మంచి, చెడు ఈ రెండు రకాల కొలెస్ట్రాల్స్) ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్లు, బేకరీ పదార్థాలు, కృత్రిమ నెయ్యి వంటి పదార్థాలను ఎక్కువగా తినేవాళ్లలో ఈ కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి... డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తుంటారు. ఈ తరహా మందులు వాడుతున్న వారు వాటిని మధ్యలోనే ఆపకూడదు. మీరు మాంసాహారం పూర్తిగా మానేయలేకపోతే... కొవ్వులు తక్కువగా ఉండే చేపలు, చికెన్ వంటి వైట్‌మీట్ తీసుకోండి. వీటిలోనూ చికెన్ కంటే చేపలు చాలా మంచిది. కాబట్టి మాంసాహారం తీసుకోవాలనిపిస్తే చేపలు తినడం మేలు. అది కూడా ఉడికించినవే. వేపుడు వద్దు. డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 24 ఏళ్లు. గత నాలుగేళ్లుగా గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నాం. నాకు రుతుక్రమం సక్రమంగా రాదు. డాక్టర్‌కు చూపించుకుంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని చెప్పారు. ఈ నెల నేను అండం కోసం ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్ తీసుకుని, కొద్దిరోజుల క్రితమే స్కానింగ్ చేయించుకున్నాను. స్కానింగ్ రిపోర్టును చూసిన డాక్టర్లు చాలా అండాలు, ఫాలికిల్స్ ఉన్నాయనీ, అందుకోసం ఈ నెల గర్భధారణకు ప్రయత్నించవద్దని అన్నారు. నేను ఏదో అర్జెంట్ పని ఉండి హైదరాబాద్ నుంచి దగ్గర్లోని మా ఊరికి వచ్చాను, అప్పట్నుంచి నాకు కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, ఆయాసంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. నాకు ఆందోళనగా ఉంది. దీనికి కారణం ఏమిటి? - ఒక సోదరి, కోదాడ మీరు చెబుతున్న అంశాలను బట్టి మీ ఓవరీ ఎక్కువగా ప్రతిస్పందించినట్లు కనిపిస్తోంది. ఈ కండిషన్‌ను ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటారు. మీలా తక్కువ వయసుండే వారు, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నవారికి గర్భధారణ కోసం మందులు తీసుకున్నప్పుడు ఇది కొన్ని సార్లు జరుగవచ్చు. మందులకు కొందరి శరీరాలు చాలా ఎక్కువగా ప్రతిస్పందిస్తుంటాయి. మీరు తక్షణం దగ్గర్లోని డాక్టర్‌ను కలిసి, వారి సలహా మేరకు మందులను తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్లు మీ కండిషన్ తీవ్రతను అంచనా వేసి, మీలో నొప్పి, ఆయాసం రావడానికి కారణాలు తెలుసుకొని, దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు. చాలా మందిలో ఇలా ప్రతిస్పందనలు కొంత తక్కువ (మైల్డ్)గానే ఉంటాయి. మైల్డ్‌గా ఉన్న సందర్భంలో ఔట్‌పేషెంట్ ప్రాతిపదికనే చికిత్స అందించవచ్చు. అయితే మీరు పూర్తిగా నార్మల్ అయ్యే వరకు క్రమం తప్పకుండా చెకప్‌లు అవసరం. అయితే మీరు తగినంతగా ద్రవాహారం తీసుకుంటూ, మీకు సాఫీగా మూత్రం వస్తుందా అన్నది చూసుకోవాలి. బరువైన పనులు చేయకండి. మీ డాక్టర్ మీకు కొన్ని రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయిస్తారు. ఒకవేళ మీ పరిస్థితిలో తీవ్రత ఎక్కువగా ఉంటే మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ కడుపులో, ఊపిరితిత్తుల్లో నీరు చేరితే దాన్ని తొలగించాల్సి అవసరం ఉంటుంది. మీరు వీలైనంత త్వరగా మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. మీ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ప్రమోషన్‌తో లావెక్కుతారట!
పరిపరి శోధన ప్రమోషన్ వస్తే పరపతి, పలుకుబడి, అధికారం పెరుగుతాయని అందరికీ తెలిసిందే. అయితే, ప్రమోషన్ వస్తే చాలామంది లావెక్కుతారట! పదోన్నతి వల్ల లభించే అధికారం వల్ల స్వయంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ఒత్తిడికి గురై, దానిని అధిగమించడానికి అతిగా తినడమే దీనికి కారణమని ఆస్ట్రేలియన్ పరిశోధకులు చెబుతున్నారు. వివిధ పదవుల్లో పనిచేస్తున్న 450 మందిపై విస్తృతంగా అధ్యయనం చేసి వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా నైపుణ్యాలతో నిమిత్తంలేని నిర్ణయాలు తీసుకునే పదవుల్లో పెకైగబాకిన వారు, స్వయం నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో విపరీతమైన ఒత్తిడికి గురై, లావెక్కుతున్నట్లు గుర్తించారు. నైపుణ్యాన్ని పెంచుకునే ఆస్కారం ఉన్న పదవుల్లో పదోన్నతులు సాధించిన వారిలో ఇలాంటి మార్పేమీ కనిపించలేదని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన అడిలాయిడ్ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. -
ఇసుక తరలింపునకు ఈ వే బిల్లు
సిల్వర్ హోలో గ్రామ్‌తో జారీ బుక్ చేసుకున్నప్పుడే వాహనం నిర్ధారణ దారిమళ్లించే చాన్స్ తక్కువంటున్న అధికారులు ఇసుక తరలింపులో ‘ఈ వే బిల్లు’ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే గుంటూరులో అమలవుతున్న ఈ విధానాన్ని వచ్చే వారం నుంచి జిల్లాలోనూ అమలు చేస్తున్నారు. దీని వల్ల ఇసుక రవాణాలో జరుగుతున్న అవకతవకలకు బ్రేకు పడనుంది. విశాఖపట్నం: జిల్లాలో గుర్తించిన 16 రీచ్‌లలో ప్రస్తుతం 12 రీచ్‌ల్లో తవ్వకాలు..అమ్మకాలు జరుగుతున్నాయి. మొత్తం 16 రీచ్‌లలో 3,23,565 క్యూబిక్‌మీటర్ల ఇసుక ఉన్నట్టుగా గుర్తించినప్పటికీ రివైజ్డ్ సర్వేలో ఐదులక్షల క్యూబిక్‌మీటర్ల వరకు ఇసుక ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు 50 క్యూబిక్ మీటర్ల ఇసుకను అమ్మకం ద్వారా రూ. 2.49 కోట్లు, రవాణా కింద 22.77లక్షల ఆదాయం వచ్చింది. రవాణా అవుతున్న ఇసుకలో ఇండెంట్ ప్రకారం 60 శాతం ప్రభుత్వ, ప్రైవేటు అవసరాల కోసం కేటాయిస్తుండగా, 40 శాతం సామాన్యులకు విక్రయిస్తున్నారు. కాగా సామాన్యుల పేరిట బుక్ చేసుకోవడం.. మధ్యలో ఇసుకను మాఫియా దొరలు దారి మళ్లించి బ్లాక్మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతున్నది. ఇప్పటి వరకు కొనుగోలుచేసే ఇసుకను పరిమాణాన్ని బట్టి క్యూబిక్‌మీటర్‌కు రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. రవాణా కోసం కిలోమీటర్‌కు నిర్దేశించిన మొత్తాన్ని ఆ తర్వాత చెల్లిస్తున్నారు. దీని వల్ల అనేక అవకతవకలు జరుగుతున్నట్టుగా గుర్తించారు. దీని నిరోధానికి సాధ్యమైనంత త్వరగా జీపీఎస్‌తో పాటు సీసీ కెమెరాలను అమర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా తొలుత ఈ వే బిల్లు విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మీ సేవలో బుక్ చేసుకున్నప్పుడే ఇసుకతో పాటు రవాణాకు కూడా చెల్లిస్తే కొనుగోలు దారుడికి ఆర్డర్ స్లిప్ ఇస్తారు. అదే విధంగా ఆన్లైన్లో సంబంధిత రీచ్‌కు డిమాండ్ ఆర్డర్ వెళ్తుంది. ఇందుకోసం 80మప్లాన్షీట్పై ప్రత్యేకంగా తయారు చేసిన హోలో గ్రామ్ను ముద్రించిన మూడు రసీదులుంటాయి. వీటిలో ఒకటి మీసేవా కేంద్రంలో ఉండగా, ఒకటి రీచ్‌కు పంపిస్తారు. మరొకటి లారీడ్రైవర్‌కు ఇస్తారు. డెలవరీ చేయగానే కొనుగోలుదారుడి వద్ద నున్న డిమాండ్ స్లిప్‌ను తీసుకుని హోలోగ్రామ్‌తో ఉన్న స్లిప్‌ను అందజేస్తారు. దీని వల్ల లారీ డ్రైవర్ మధ్యలో దారి మళ్లించే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఎవరైతే బుక్ చేసు కున్నారో వారికే నేరుగా డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఈ నెల నుంచి విశాఖలో కూడా అమలుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత లా వాడుతున్నా అక్రమార్కులు రెచ్చి పోతూనే ఉన్నారు. -
స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కాలేదు
డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సరోజని విశాఖ మెడికల్: నగర పరిధిలో స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్థారణ కాలేదని సోమవారం అందిన నివేదిక స్పష్టం చేసిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జొన్నలగడ్డ సరోజని చెప్పారు. నగర పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు నాలుగు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు నమోదయ్యాయని, వీరినుంచి సేకరించిన లాలాజల నమూనాలను హైదరాబాద్‌లోని ఐపీఎం ల్యాబ్‌కు పంపి పరీక్షలు నిర్వహించగా, ముగ్గురిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు నిర్థారణ కాలేదన్నారు. నాల్గో కేసు ఇసుకతోటకు చెందిన నాలుగేళ్ల బాలుడికి సంబంధించి నివేదిక ఇంకా అందాల్సి ఉందన్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ స్వైన్ అనుమానిత లక్షణాలతో మృతి చెందిన ఆరేళ్ల అభిరామ్‌కు, ప్రస్తుతం చికిత్స పొందుతున్న గోపాలపట్నానికి చెందిన సిహెచ్.శ్రీదేవికి స్వైన్‌ప్లూ లేనట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. మర్రిపాలెంలో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రీదేవి తల్లికి స్వైన్‌ఫ్లూ లేదని ఇటీవల అందిన నివేదిక ఆధారంగా నిర్ధారణ అయ్యిందన్నారు.