కుటుంబం తోడ్పాటుతో క్యాన్సర్‌పై విజయం తథ్యం... | Victory on Cancer with family support | Sakshi
Sakshi News home page

కుటుంబం తోడ్పాటుతో క్యాన్సర్‌పై విజయం తథ్యం...

Published Thu, Nov 16 2017 1:00 AM | Last Updated on Thu, Nov 16 2017 1:00 AM

Victory on Cancer with family support - Sakshi

క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ కాగానే మొదట డాక్టర్లు దాని తీవ్రతను అంచనా వేస్తారు.  క్యాన్సర్‌ ఏ దశలో ఉందో తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం ‘టీఎన్‌ఎమ్‌’ అనే విషయాలను పరిశీలిస్తారు. ఇంగ్లిష్‌ పొడి అక్షరాల్లో ‘టీ’ అంటే ట్యూమర్‌ సైజ్, ‘ఎన్‌’ అంటే చుట్టుపక్కల ఉండే లింఫ్‌నోడ్స్, ఎమ్‌ అంటే పరిసరాల్లోని ఏయే భాగాలకు పాకిందని తెలుసుకునే ‘మెటాస్టాసిస్‌’. ఈ అంశాల ఆధారంగా క్యాన్సర్‌ ఏ దశలో ఉందో తెలుసుకుంటారు. క్యాన్సర్‌లో ‘0’ నుంచి ‘4’ వరకు దశలు ఉంటాయి. ‘0’ అంటే క్యాన్సర్‌ ప్రారంభానికి ముందు దశ. ప్రారంభ దశను ‘స్టేజ్‌ 1’,  పెద్ద గడ్డ లింఫ్‌ గ్రంథులకు సోకితే ‘స్టేజ్‌ 2’ లేదా ‘స్టేజ్‌ 3’ అని, ఇతర అవయవాలకు కూడా వ్యాపిస్తే దాన్ని ‘స్టేజ్‌ 4’ అని నిర్ధారణ చేస్తారు.

నిర్ధారణ పరీక్షలు
కొన్ని లక్షణాలను పరిశీలించాక, అవసరం అనిపిస్తే క్యాన్సర్‌ను నిర్ధారణ చేసే పరీక్షలను చేస్తుంటారు. ఎక్స్‌–రే, అల్ట్రాసౌండ్‌ స్కాన్, సీటీ స్కాన్, న్యూక్లియర్‌ స్కాన్, ఎమ్మారై, పెట్‌ స్కాన్, బయాప్సీ, రక్తపరీక్షలు, మలమూత్ర, కళ్లె పరీక్షల వంటివి అవసరాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది.

రకాన్ని బట్టి... తీవ్రతను బట్టి చికిత్స
క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ జరిగితే వ్యక్తి వయసు, ఇతర ఆరోగ్య విషయాలను పరిగణనలోకి తీసుకొని ముందుగా సర్జరీ చేసి, ఇతర థెరపీలకు వెళ్తారు. ఒక్కోసారి ఇతర థెరపీల తర్వాత కూడా సర్జరీ చేస్తారు. చికిత్సలో భాగంగా సర్జరీ, కీమో, రేడియో, హార్మోన్‌ థెరపీలతో పాటు ఒక్కోసారి జీన్, బయొలాజికల్, ఇమ్యూనో వంటి అనేక థెరపీలు చేస్తారు. రక్త సంబంధిత క్యాన్సర్లు ఉన్నవారికి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తారు. ఇటీవల వైద్యరంగంలోని పురోగతితో స్టెమ్‌సెల్‌ థెరపీ వంటివి కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ఏయే క్యాన్సర్లకు ఏయే తరహా చికిత్సలు అవసరం అన్నది అనేక విషయాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇక సర్జరీల విషయానికి వస్తే కోత తక్కువగా ఉండే లేజర్, కీహోల్‌ సర్జరీలు చేస్తున్నారు. అలాగే కీమోథెరపీలో కచ్చితంగా క్యాన్సర్‌ కణాన్ని మాత్రమే ప్రభావితం చేసేలా టార్గెటెడ్‌ థెరపీ చేస్తున్నారు. రేడియేషన్‌లో ఆధునికమైన వీఎమ్‌ఏటీ రేడియేషన్, 3డీ రేడియేషన్‌ అందుబాటులో ఉన్నాయి. హార్మోన్‌ థెరపీ కూడా ఇప్పుడు ఒక చికిత్సాప్రక్రియ. ఇక రోగనిరోధక శక్తిని పెంపొందిస్తూ క్యాన్సర్‌ కణాల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే ఇమ్యూనోథెరపీ వంటి కొత్త కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి.

చికిత్స ప్రక్రియలతో పాటు రోగి మానసిక స్థైర్యం, యోగా, ధ్యానం, మంచి ఆహారం అవసరం. వీటన్నింటికీ మించి రోగి కుటుంబ సభ్యుల తోడ్పాటు, సహకారం తప్పనిసరి.క్యాన్సర్‌ రావడానికి కచ్చితమైన కారణం తెలియదు. ఏ క్యాన్సర్‌ ఎవరిలో, ఎందుకు వస్తుందన్నదీ తెలియదు. కానీ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే మాత్రం పూర్తిగా నయం చేయడం సాధ్యమే. మంచి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్, పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, చక్కటి వైవాహిక జీవితం, యోగా, ధ్యానం, కాలుష్యాలకు దూరంగా ఉండటం వంటి మన చేతుల్లో ఉండే అంశాలతో చాలావరకు దీన్ని నివారించవచ్చు.

అయితే చాలా కొద్దిరకాలలో మాత్రం క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు రోగి బాధలను తగ్గించి, వారి జీవననాణ్యతను మెరుగుపరచి, తక్కువ బాధతో జీవితాంతం గడిపేలా చేసే ప్రక్రియను ‘పాలివేటివ్‌ కేర్‌’ అంటారు. ఈ విభాగంలో మత్తు స్పెషలిస్టులు అయిన ఎనస్థిసిస్ట్, పెయిన్‌మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్, మెడికల్‌ ఆంకాలజిస్ట్, సర్జికల్‌ ఆంకాలజిస్ట్, డైటీషియన్, నర్సులు తమ సేవలు అందిస్తుంటారు.  వారితో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల భూమిక చాలా కీలకం. కచ్చితంగా నయం చేస్తామనే ప్రకటనలను నమ్మకండి

‘మేం క్యాన్సర్‌ను తగ్గిస్తాం. క్యాన్సర్‌కు మా వద్ద కచ్చితమైన చికిత్సలున్నాయి‘ అంటూ చాలా రకాల ప్రకటనలు కనిపిస్తుంటాయి. వాటిని చూసి, నమ్మి, ఆచరించి రోగాన్ని ముదరబెట్టుకునే వాళ్లు చాలామందే ఉంటారు. ఏ వైద్యవిధానంలోనూ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసే మందులు లేవు. సైంటిఫిక్‌గా కచ్చితమైన క్లినికల్‌ ట్రయల్స్‌తో సాగే అల్లోపతిలోనూ తొలిదశలో గుర్తిస్తేనే క్యాన్సర్‌ను నయం చేయడం సాధ్యం. అందుకే అలాంటి బోగస్‌ ప్రకటనలను నమ్మకూడదు.

నివారణ సులభమే...
పొగతాగే అలవాట్లు, వాడిన నూనెలనే మళ్లీ మళ్లీ మరగకాచి వాడటం, వంటింటి పొగ బయటకు వెళ్లకుండా అక్కడక్కడే తిరగడం, ఇంట్లో  క్రిమిసంహారకాలను వాడుతూ ఆ వాసనలను నిత్యం పీల్చడం వంటి అంశాలు లంగ్స్, గొంతు, నాలుక వంటి క్యాన్సర్లకు దారి తీయవచ్చు. పై అంశాల నుంచి దూరంగా ఉంటే చాలావరకు సులభంగా నివారణ సాధ్యమైనట్లే కదా. స్త్రీలు ఈ వ్యాధికి గురైనప్పుడు తల్లడిల్లిపోతుంటారు. ఇల్లు, పిల్లలు ఏమైపోతారో అన్న వ్య«థతో పాటు, వైద్యానికి ఖర్చవుతోందని, ఆర్థికభారం పడుతోందని మనోవేదనకు గురవుతుంటారు. వారికి డాక్టర్లు ఇచ్చే కౌన్సెలింగ్‌తో పాటు కుటుంబ సభ్యుల సహకారం చాలా ముఖ్యం. మహిళల్లో రొమ్ము క్యాన్సర్స్, గర్భాశయ – గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ఎక్కువ. అవి వచ్చాక బాధపడటం కంటే వచ్చే అవకాశం ఉన్న  క్యాన్సర్లపై అవగాహన పెంచుకొని తరచూ పరీక్షలు చేయించుకుంటూ నిర్భయంగా ఉండటం మంచిది.
- Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, Kurnool 08518273001

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement