స్వప్న లోకం | special story to women faced problems | Sakshi
Sakshi News home page

స్వప్న లోకం

Published Sun, Dec 10 2017 12:05 AM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

special  story to women faced problems - Sakshi

క్షుద్బాధ తీర్చుకోడానికి వంద జింకల్ని వేటాడి చంపిన సింహరాజు కూడా తన పిల్లల ముందు సాధు జంతువైపోతాడు. అలాంటిది శంకర్రాయుడెంత! ఎన్ని దౌర్జన్యాలు, భూకబ్జాలు, అక్రమ వ్యాపారాలు, బెదిరింపులు, ఒకటీ రెండు హత్యలు చేసి జనాల మనస్సులో ఓ రాక్షసుడిగా మిగిలినా తన ఇరవై రెండేళ్ళ కూతురు స్వప్నకి మాత్రం అతనో ప్రాణ స్నేహితుడు. స్వప్న చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో ఇంకా గారాబంగా పెరిగింది. రెండు నెలల క్రితం స్వప్నకి అదే ఊళ్ళో ఉంటున్న ఒక ప్రముఖ విద్యా సంస్థల అధినేత కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు శంకర్రాయుడు. నాలుగు కోట్ల రూపాయల కట్నం, రెండు కోట్లు ఖర్చు పెట్టి ఘనంగా వివాహం జరిపించాడు. తనకి మట్టుకు ఓ ఫామ్‌ హౌస్‌ ఉంచుకుని యావదాస్తీ కూతురి పేరు మీద ఇప్పుడే రాసివ్వడం కొందరికి ఎక్కువ అనిపించినా, శంకర్రాయుడికి అది తన కూతురి సుఖ సంతోషాల ముందు చాలా చిన్నదిగా అనిపించింది.

తనని ఒంటరిని చేసి అత్తారింటికెళ్ళి పోయిన స్వప్న ఆలోచనల్లో మునిగిపోయాడు శంకర్రాయుడు. తన ఏసీ గదిలో టీవీ ముందు కూర్చుని ఏం చూడాలో తేల్చుకోలేక రిమోట్‌ బటన్స్‌ని అప్పుడే పుట్టిన ఇష్టంలేని ఆడ శిశువు గొంతు నులిమినట్టు నొక్కుతున్నాడు. ఎదురుగా డన్‌ హిల్‌ సిగరెట్‌ ప్యాకెట్లు, స్కాచ్‌ సీసాలు ఖాళీ అవుతున్నాయి. కానీ కూతురి మీద బెంగ, వాత్సల్యం తండ్రిగా అపురూపమైన అనుభూతి మాత్రం కొన్ని సంవత్సరాలుగా రెట్టింపవుతూనే ఉన్నాయి.‘చిట్టి తల్లి ఇప్పుడేం చేస్తోందో’ అనుకుంటూ దిగులుగా తన ఐఫోన్‌ చేతిలోకైతే తీసుకున్నాడు గానీ సమయం రాత్రి పదకొండు దాటుతోంది. కొత్త జంటని ఈ సమయంలో ఇబ్బంది పెట్టకూడదని గుర్తొచ్చేలోపే తన ఫోన్‌కి ఒక మెసేజ్‌ వచ్చింది.

‘‘నాన్నా! దయచేసి రేప్పొద్దున్నే వచ్చి నన్ను తీస్కెళ్ళు. ఇప్పుడు ఫోన్‌ చెయ్యొద్దు. కంగారేమీ లేదు. నేను బానే ఉన్నాను. గుడ్‌ నైట్‌.’’ఫోన్‌ ఆయన పిడికిట్లో బిగుసుకుంది. శంకర్రాయుడు అచేతనమయ్యాడు. స్వప్న కళ్ళ ముందు కదలాడుతోంది. ‘నాన్నా’ అన్న సంబోధనతో మొదలైన ఆ సందేశం చదువుతున్నట్టు లేదు. చెవులారా కూతురి స్వరం వింటున్నట్టే ఉంది. స్వప్న డిగ్రీ చదివింది. ఏ మాత్రం గడుసుతనం లేని పిల్ల, చాలా భయస్తురాలు. అందరికీ అన్నీ చేస్తుంది కానీ ఎవర్నీ ఏమీ అడగదు. మనసులో ఏదైనా కష్టమున్నా అది అలాగే సమాధైపోవాల్సింది తప్ప బయటకు చెప్పదు.శంకర్రాయుడు రాత్రంతా ‘ఏమయ్యుంటుందా’ అని ఆలోచిస్తూనే గడిపి పొద్దున్నే వియ్యంకుడి ఇంటికి వెళ్ళాడు. స్వప్న అత్తింటి వారు స్వాగత మర్యాదలు బాగా చేశారు. స్వప్నను చూడగానే అప్పటిదాకా ఆపుకున్న కన్నీళ్లను ఇక అదుపు చేయలేక ఏడుస్తూ అస్పష్టంగా ‘‘ఎలా ఉన్నావ్‌ చిట్టి తల్లీ’’ అని పలకరించాడు.

‘‘బావున్నాను నాన్నా!’’ తండ్రి మొహం సరిగ్గా చూడకుండానే చెప్పింది స్వప్న.‘‘మా కోడలు ఎప్పుడూ మిమ్మల్నే కలవరిస్తుంది బావగారు. అందుకే ఓ రెండ్రోజులు మీరు తీసుకువెళ్ళండి. కాస్త బెంగ తీరుతుంది తనకి. అబ్బాయి కొద్దిగా పనుల ఒత్తిడి వల్ల రాలేడు’’ నవ్వుతూ అన్నాడు స్వప్న మావగారు.‘‘బావగారు, తండ్రి మీద బెంగ మాత్రమే విషయమైతే ఫర్వాలేదు. కానీ అంతకు మించి ఏదైనా ఉందా? స్వప్నకి మీరే అన్నీ ఇక’’ ఆర్ధ్రంగా అన్నాడు శంకర్రాయుడు.   తండ్రి అంత వినమ్రతతో మాట్లాడ్డం స్వప్నకి ఏ మాత్రం నచ్చలేదు. చిరుకోపం చూపుల్లో కనిపిస్తూనే ఉంది.‘‘అదేం లేదు బావగారు, మీరు కూడా స్వప్న మీద ఎంతో బెంగగానే ఉన్నారని తెలుస్తూనే ఉంది. కొన్ని రోజులు తీసుకెళ్ళండి. తనకీ ఊరటగా ఉంటుంది’’ అని ముందుగా తన మాట చెప్పాడు స్వప్నమావగారు. ఆమె భర్త, అత్తగారు కూడా అదే బాట పట్టారు. వారిద్దరి ముఖాలు ముభావంగా ఉండడం గమనించకపోలేదు శంకర్రాయుడు.తండ్రీ కూతుళ్ళు ఇంటికొచ్చిన వెంటనే విషయం చెప్పడం ప్రారంభించింది స్వప్న.‘‘నాన్నా నేను తల్లిని కాబోతున్నాను. నిన్న పొద్దున్నే హాస్పిటల్‌ కి వెళ్లి నిర్ధారణ చేసుకున్నాం’’ సంతోషం, దుఖం, భయం కలగలిసిన కంఠంతో చెప్పింది స్వప్న. తండ్రి పెదవులపై చిరునవ్వు, నుదిటిపై భృకుటి ఒకేసారి వెలిశాయి.‘‘మరి ఈ భయం, బాధ ఏంటమ్మా నీలో’’

‘‘మా ఆయన, అత్తగారు సంతోషించారు. కానీ మా మావగారికి ఇష్టం లేదు నాన్నా. నేను వింటున్నానని తెలియక మా ఆయనతో ఏమన్నారో తెలుసా?‘ఒరే పిచ్చి సన్నాసి! పెళ్ళైన రెండో నెలలోపే కడుపొచ్చిందంటే అది నీ వల్లే అని నమ్మకం ఏంటి? ఒకవేళ నీ వల్లే వచ్చినా లోకం అలా అనుకోదు. అయినా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? కొన్నాళ్ళు ఆగమని చెప్పేవాడ్ని కదా. అందుకే నువ్వే అమ్మాయిని ఒప్పించి మీ అత్త దగ్గరకు తీసుకెళ్ళి తీయించేయ్‌. ఎలాగూ ఆమె ఊళ్ళో పెద్ద డాక్టర్‌. ఏ గొడవలు లేకుండా పని పూర్తి చేస్తుంది.’   శంకర్రాయుడు ఆలోచనల్లో పడ్డాడు. కానీ ముఖంలో కంగారు, ఆశ్చర్యం, కోపం లేవు.‘‘మా ఆయన, అత్తగారు కూడా ఆయనతో ఏకీభవించి నన్ను బలవంతం చేస్తున్నారు నాన్నా. ‘లోకం’ పేరు చెప్పి ఆయన అలా అర్థం పర్థం లేకుండా అకారణంగా దొంగ చాటుగా నాపై అంత నీచమైన నింద వేసి, నా ఎదురుగా మాత్రం గొప్పగా నటించడం ఏమైనా బావుందా. చివరికి ‘మా నాన్నతో చెప్పాలి కదా’ అని అన్నాను. ఆ మాటకి కొంచెం జడుస్తారేమో అని. ‘సరే మంచిది’ అన్నారాయన. నాన్నా! రేపు వెళ్లి నీ ప్రతాపం చూపించు. మా అమ్మాయికిష్టం లేదు, తను బిడ్డని కంటుంది అని చెప్పు. కడుపు తీయించుకోదూ అని చెప్పు’’ ‘‘ఎందుకు తీయించుకోవూ?’’

హఠాత్తుగా పిడుగుపడ్డట్టు అయింది స్వప్నకి.‘‘ఏంటమ్మా ఇంత చిన్న విషయానికి ఇలా హైరానా పడిపోతున్నావ్‌? మీ మావగారు చెప్పినట్టే చేద్దాం. దాందేముంది? వాళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవించాలి కదా’’ స్థిమితంగా అన్నాడు శంకర్రాయుడు.స్వప్న ఇంకా తేరుకోలేదు. గొంతులో జీవం లేనట్లైంది.‘‘నాన్నా! నువ్వింకా మా మావగారిని గట్టిగా అడుగుతావు, నీ విశ్వరూపం చూపిస్తావు అనుకున్నా కానీ ఇలా ఆయన తరఫున మాట్లాడుతావని అనుకోలేదు. నేనేం తప్పుచెయ్యలేదు. నేను తీయించుకోను.’’ బిక్క మొహంతో చెప్పింది స్వప్న.‘‘అమ్మా! నువ్వింకా చిన్న పిల్లవి కావు. నీ అత్తింటి వారే నీకు అన్నీ. ఇక నువ్వు ఆ ఇంటి పిల్లవి. మీ విషయాల్లో నేను తల దూర్చి నిర్ణయాలు తీస్కోడం మంచి పద్ధతి కాదు.’’స్వప్న మరేం మాట్లాడలేదు. తండ్రి మాట్లాడని మాటలు కూడా ఆమెకు వినబడుతున్నాయి. రెండవ రోజే అత్తింటికి చేరి బలవంతంగానే డాక్టర్‌ ముందు కాళ్ళు చాపాల్సి వచ్చింది.స్వప్న బాధ భరించరానిది. తర్జన భర్జన పడుతున్న పర్జన్యాలలా ఆమె కనులు. ఎప్పటికీ ఇంకిపోనీ జలధారలుగా మారిపోయాయి ఆమె కన్నీళ్ళు. అమ్మలేని లోటు ఆ రోజు బాగా తెలుస్తోంది.రెండు నెలలు గడుస్తున్నా జరిగిన సంఘటనలోంచి బయట పడకముందే స్వప్న మళ్ళీ గర్భం దాల్చింది. పిల్లల్ని కనే యంత్రం తన భర్తే అయ్యాడు. ఆమె కాదు. వేసవిలో మొదట పండే మామిడి కాయలు అంత రుచిగా ఉండవు కాబట్టి తర్వాత పండే పండ్లను కొనుక్కున్నంత సులువుగా రెండో గర్భాన్ని ఆహ్వానించాడు స్వప్న మావగారు.తండ్రి మద్దతే ఉండుంటే వీళ్ళందరినీ ఓడించేదాన్ని కదా అని ఎంతో సంఘర్షణ పడింది. ఒంటరిగా నిలబడటానికి సమాజం భయపెట్టింది. పేదింటి పిల్లై్లనా పెద్దింటి పిల్లైనా అన్యాయానికి చిహ్నంగా ఇంటికో స్త్రీ మిగులుతూనే ఉంది.పండంటి ఆడబిడ్డకు అమ్మగా కొత్త మెట్టు ఎక్కింది స్వప్న. ఆమె మావగారు ఆనందంగానే ఉన్నారు గానీ మగ బిడ్డ కానందుకు మొహం ఎగబెట్టినట్టే కనబడ్డాడు. చేసిన పనికి ఆయనకా విషయం బయట పెట్టే అవకాశమూ లేకపోయింది.స్వప్న మాత్రం ఆడపిల్ల పుట్టినందుకు మహా ఆనందంగా ఉంది. భర్త తిట్టినప్పుడు ఓదార్చుతుందనో, వృద్ధాప్యంలో ఆదరిస్తుందనో కాదు. మేక వన్నె పులిలా ఇంతకాలం ప్రేమించి మావగారి మాట వినమని మొహం చాటేసిన తండ్రిలా, అర్థం పర్థం లేని అనుమానాలతో తన జీవితంలో ఒక మాయని మచ్చని పెట్టిన మావగారిలా, నోరెత్తలేని అసమర్థ భర్తలా, వారందరి అంశలను మోసుకొచ్చే ఒక మగ పిల్లాడు పుట్టనందుకు.      

‘‘ఎందుకు తీయించుకోవూ?’’
హఠాత్తుగా పిడుగుపడ్డట్టు అయింది స్వప్నకి.‘‘ఏంటమ్మా ఇంత చిన్న విషయానికి ఇలా హైరానా పడిపోతున్నావ్‌? మీ మావగారు చెప్పినట్టే చేద్దాం. దాందేముంది? వాళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవించాలి కదా’’ స్తిమితంగా అన్నాడు శంకర్రాయుడు. 
- మానస ఎండ్లూరి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement