ఒకే కుటుంబంలోని ముగ్గురి ఆత్మహత్యాయత్నం
రాంగోపాల్‌పేట్: భర్తతో పాటు అత్తా, మామలపైన కోడలు వరకట్న వేధింపుల కేసు నమోదు చేయించడంతో మనస్థాపం చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు ట్యాబ్లెట్లు, ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నాగోల్‌కు చెందిన తోట భావనారాయణ (52), పద్మావతి (47) భార్యాభర్తలు, వీరి కుమారుడు సుజన్ (23). భావనారాయణ, సుజన్‌లు ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తుండగా పద్మావతి గృహిణి. సుజన్(23)కు కొత్తగూడెం చుంచుపల్లి ప్రాంతానికి చెందిన కావ్యశ్రీతో ఇదే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన వివాహం చేశారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
దీంతో కావ్యశ్రీ ఇటీవల చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేయించింది. చుంచుపల్లి పోలీసులు సుజన్‌కు ఫోన్ చేసి తల్లిదండ్రులతో పాటు కౌన్సిలింగ్ కోసం రావాలని ఇటీవల కోరగా రెండు మూడు రోజులు టైం అడిగారు. మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు రావాలని మరో మారు పోలీసులు సూచించారు. దీంతో ఈ నెల 5వ తేదీ ఉదయం ఆన్‌లైన్ ద్వారా సికింద్రాబాద్ ప్రాంతంలోని తాజ్ ట్రైస్టార్ హోటల్ మూడవ అంతస్తులోని 308 గదిని బుక్ చేసుకుని ముగ్గురు అక్కడ దిగారు. సోమవారం రాత్రి కోడలు కావ్యశ్రీకి ఫోన్ చేసి కేసు విత్‌డ్రా చేసుకోవాలని, లేకపోతే తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసికుంటామని చెప్పారు.
ఆ తర్వాత వారి మధ్య సంభాషణ ఏమి జరిగిందో తెలియదు కానీ..మంగళవారం ముగ్గురు డైజోఫాం ట్యాబ్లెట్లు, షుగర్‌కు వాడే ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో తీసుకున్నారు. ఉదయం 10.30 గంటల వరకు వీరి గది తలుపులు తెరవకపోవడంతో పాటు హోటల్ సిబ్బంది తలుపు కొట్టినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మరో తాళం చెవితో తాళం తెరిచి చూడగా ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో వెంటనే మహంకాళి పోలీసులకు సమాచారం అందించి వారిని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పద్మావతి సోదరి అక్కడికి చేరుకుని ఆర్థిక పరిస్థితి బాగాలేదని గాం«దీకి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని వెల్లడించారు. మహంకాళి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment