పెళ్లయిన ఆరు నెలలకే మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పెళ్లయిన ఆరు నెలలకే మహిళ ఆత్మహత్య

Jul 25 2024 12:56 AM | Updated on Jul 25 2024 11:52 AM

-

పెళ్లయిన ఆరు నెలలకే ఉరి వేసుకుని బలవన్మరణం

అత్తింటివారే చంపేశారని కుటుంబసభ్యుల ఫిర్యాదు

మనస్థాపంతో అత్త ఆత్మహత్యాయత్నం

మదనపల్లె : ఒకే ఊరిలో వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న అబ్బాయి, అమ్మాయి ఆన్‌లైన్‌ వేదికగా పరిచయమై ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితో వివాహం చేసుకుని నూరేళ్ల ప్రయాణం ప్రారంభించారు. అయితే అత్తింటి వేధింపులు ఆ అమ్మాయిని మానసిక వేదనకు గురిచేశాయి. పెళ్లయిన ఆరు నెలలకే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం మదనపల్లెలో వెలుగు చూసింది. 

కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని రాంనగర్‌కు చెందిన వెంకటరమణ, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె సాయి ప్రియాంక(24) బాబూ కాలనీకి చెందిన శ్రీనివాసులు, ఉష దంపతుల కుమారుడు మణికంఠతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. కొంతకాలం తరువాత ఇరువురూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించి వివాహం జరిపించారు. కొన్ని రోజుల కిదట మణికంఠ చేనేత పని మానేసి టమాట మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన అతడు కొద్ది రోజుల కిందట భార్య సాయి ప్రియాంకను వేధించసాగాడు.

 మంగళవారం రాత్రి మరోసారి కట్నం విషయమై భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. వేధింపులు తీవ్రం కావడంతో రాత్రి అందరూ నిద్రపోయాక ఇంట్లోనే సాయిప్రియాంక చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లవారు జామున గమనించిన కుటుంబ సభ్యులు, తాలూకా పోలీసులు, పుట్టింటివారికి సమాచారం అందించారు. ఎస్‌.ఐ రవికుమార్‌ ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దారు రమాదేవి కుటుంబ సభ్యుల వాంగ్మూలం నమోదు చేసి శవ పంచనామా చేశారు.

కుటుంబ సభ్యుల ఆందోళన
సాయిప్రియాంక మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు తాలూకా పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని కట్నం కోసం వేధించిన ప్రియాంక భర్త మణికంఠ, మామ శ్రీనివాసులు,అత్త ఉష,తాత మునెప్పలపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ విషయంతో మనస్థాపం చెందిన సాయి ప్రియాంక అత్త ఉష (49) ఇంటివద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. బాధితురాలిని కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై మృతురాాలి తల్లి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement