శాలిగౌరారం: పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రాకపోవడంతో పాటు వరకట్నం వేధింపుల కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేయడంతో మనస్తాపానికి గురై వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..
వల్లాల గ్రామానికి చెందిన మాదగోని ప్రశాంత్(30)కు సూర్యాపేట పట్టణానికి చెందిన శివజ్యోతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. ప్రశాంత్ నకిరేకల్‌లో మొబైల్‌షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం సాఫీగా సాగిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శివజ్యోతి భర్త ప్రశాంత్‌తో తరచూ గొడవ పడి తల్లిగారింటికి వెళ్లేది. వారం రోజుల క్రితం ఇంట్లో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరగడంతో ప్రశాంత్ శివజ్యోతిపై చేయిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శివజ్యోతి కుమార్తెను తీసుకుని తల్లిగారింటికి వెళ్లింది.
వారం రోజులు గడిచినా ఆమె కాపురానికి తిరిగి రాకపోగా వరకట్నం కోసం వేధింపులకు గరిచేస్తున్నారంటూ ప్రశాంత్, అతడి అక్కలపై సూర్యాపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రశాంత్‌తో పాటు అతని బంధువులు, మంగళవారం సూర్యాపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ప్రశాంత్‌ను శివజ్యోతి కుటుంబ సభ్యులు తీవ్రమైన పదజాలంతోపాటూ దూషించడంతో పాటూ దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో మనస్తాపానికి గురైన గురైన ప్రశాంత్ ఇంటికి వచ్చి తన ఆత్మహత్యకు భార్య, అత్త, బావమరిది కారకులని వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి అర్ధరాత్రి సమయంలో వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు.
స్టేటస్ చూసి కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. మృతుడి తండ్రి మాదగోని యాదగిరి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రశాంత్ అంత్యక్రియల్లో అతడి భార్య శివజ్యోతి పాల్గొనకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment