డెంగ్యూ జ్వరం... నిర్ధారణ ఎలా?
డెంగ్యూ ఫీవర్ కౌన్సెలింగ్
నా వయసు 24 ఏళ్లు. ఈమధ్య మా ఊరికి వెళ్లి వచ్చాను. ఆ తర్వాతి రోజు నుంచి నాకు జ్వరం వస్తోంది. మాకు దగ్గర్లో ఉన్న ఒక డాక్టర్ గారిని సంప్రదిస్తే డెంగ్యూ జ్వరంలా అనిపిస్తోందని అంటున్నారు. ఇంకా పెద్ద డాక్టర్‌గారికి చూపించలేదు. డెంగ్యూ జ్వరాన్ని ఎలా నిర్ధారణ చేస్తారు.
- శ్రీనివాస్, విశాఖపట్నం
డెంగ్యూ జ్వరానికి లక్షణాలకే చికిత్స చేస్తారు. దీని నిర్ధారణ కోసం డెంగ్యూ ఎన్‌ఎస్1, డెంగ్యూ సీరాలజీ, డెంగ్యూ ఐజీజీ, ఐజీఎమ్ అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఫలితాలు రావడానికి నాలుగు నుంచి ఆరు రోజుల సమయం పడుతుంది. ఈ పరీక్షలు కొద్దిగా ఖర్చుతో కూడుకున్నవి. పైగా వ్యాధి నిర్ధారణ రిపోర్టులు వచ్చే సమయం కూడా ఎక్కువ కాబట్టి లక్షణాలను బట్టి ముందుగానే చికిత్స తీసుకోవడం మంచిది. రక్తంలోని ప్లేట్‌లెట్ కౌంట్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ, అవి తగ్గిపోకుండా చూసుకోవాలి.
లక్షణాలు : జ్వరం, తలనొప్పి (ముఖ్యంగా నుదురు ప్రాంతంలో), కళ్ల వెనక నొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, రాష్, ఒంటిపై ఎర్రని మచ్చలు రావడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ వచ్చిన వారిలో రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోతాయి.
లక్షణాలకు మందులు ఇవ్వడమే తప్ప డెంగ్యూకు ప్రత్యేకంగా చికిత్స అంటూ లేదు. కాబట్టి రాకుండా నివారించుకోవడమే ఉత్తమమైన పద్ధతి. అలాగే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, దోమలు పెరగకుండా చూసుకోవడం మంచిది. ఒళ్లంతా కప్పి ఉంచేలా లాంగ్‌స్లీవ్ దుస్తులు ధరిస్తూ వుండాలి. రాత్రివేళ్లల్లో దోమలు కుట్టకుండా మస్కిటో రిపెలెంట్స్ వాడండి.
ప్లేట్‌లెట్స్ తగ్గుతున్నప్పుడు మాత్రం వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలి. అయితే రోజుకు ఒకసారి ప్లేట్‌లెట్స్ చెక్ చేసుకుంటే చాలు.
- డాక్టర్ అనిల్ కోటంరెడ్డి
వెల్‌నెస్ కన్సల్టెంట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్