
గతంలో చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని చాలామంది నిరూపించారు. అలా కాకుండా ఉన్నతమైన వృత్తిలో స్థిరపడి పదవీవిరమణ చేసే సమయంలో మరిన్ని విద్యా అర్హతలు సంపాదించాలనుకోవడం మాములు విషయం కాదు !. పైగా ఆ వయసులో కఠినతరమైన ఎంట్రెన్స్ ఎగ్జామ్ చదివి పాసవ్వడం అంటే ఆషామాషి కాదు. కానీ ఈ పెద్దాయన చాలా అలవోకగా సక్సస్ అయ్యి.. చదవాలంటేనే భారంగా భావించే విద్యార్థలందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఇంతకీ అతడెవరో వింటే మాత్రం కంగుతినడం గ్యారంటీ. అంతటి బిజీ వృత్తి చేపట్టి కూడా ఆ వయసులో చదువుకోవాలనుకుంటున్నాడా..? అని నోరెళ్లబెడతారు.
ఎవరంటే..62 ఏళ్ల వయసులో పీడియాట్రిక్ వైద్యుడు డాక్టర్ నీలి రాంచందర్ నీట్ పీజీ 2024 పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడాయన ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్ తీసుకోనున్నారు. ఆయనకు సుదీర్ఘ కెరీర్ ఉన్నప్పటికీ..అత్యంత కఠినతరమైన పరీక్షలలో ఒకటైన నీట్ పీజీ 2024 ఎగ్జామ్ ప్రిపేరై పాసవ్వడం చాలామంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది. ఈ వయసులో కూడా నేర్చుకునేందుకు మక్కువ చూపించడం అనేది విశేషం.
సుదీర్ఘ కల సాకారం కోసం..
నిజామాబాద్‌కు చెందిన నీలి రాంచందర్ ప్రముఖ శిశు వైద్యుడుగా 30 ఏళ్లకు పైగా సేవలందించారు. తన కెరీర్‌ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త వైద్య అర్హతలను పొందడానికి నీట్ పీజీ 2024 పరీక్షకు హాజరయ్యారు. ఇప్పుడు ఆయన నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఎండీ(ఫార్మకాలజీ) కోర్సులో చేరి విద్యార్థిగా మారడానికి సిద్ధంగా ఉన్నారు.
ఆయన 2014లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ పీడియాట్రిక్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడితో సహా ప్రతిష్టాత్మక పదవులను అలంకరించారు. అతను నేషనల్ రెడ్ క్రాస్ గోల్డ్ మెడల్ (2017-2018)తో సహా అనేక అవార్డులను కూడా అందుకున్నారు. ఎండీ కోర్సును అభ్యసించాలనే అతని దీర్ఘకాల కోరిక అతన్ని NEET PG 2024కి హాజరు కావడానికి ప్రేరేపించింది.
వైద్యుడిగా ప్రస్థానం..
డాక్టర్ రాంచందర్ ప్రారంభంలో 1982లో బీ. ఫార్మా కోర్సును వదిలి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌లో చేరారు. అతను 1991, 1993ల మధ్య పీడియాట్రిక్స్‌లో సేవ చేయడానికి డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ (DCH) పూర్తి చేశారు.
ఆ తర్వాత వెంటనే ప్రాక్టీస్ చేపట్టి వైద్యుడిగా బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఎండీ పూర్తి చేయలేకపోయారు. సరిగ్గా 62 ఏళ్లకు తన చివరి కలను సాకారం చేసుకునే అవకాశం చిక్కింది. ఆయన ఏమాత్రం సంశయించకుండా ఈ వయసులో ఉన్నత చదువు చదవాలనుకోవడం ప్రశంసించనదగ్గ విషయం. సాకులు చెప్పే ఎందరో విద్యార్థులకు స్ఫూర్తి ఈ శిశు వైద్యుడు.
(చదవండి: దటీజ్ సుధీర్..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్‌గా మార్చి..)