ప్యాంక్రియాటైటిస్ అంటే...?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. నేను ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తుంటాను. కొన్ని రోజుల నుంచి నాకు కడుపులో తీవ్రమైన మంటగా ఉంటోంది. అసిడిటీ అనుకొని దానికి సంబంధించి సొంతంగా మందులు వాడాను. కానీ తగ్గలేదు. తర్వాత పొట్ట ఉబ్బడం, కళ్లు తిరగడం, వాంతి అవుతున్నట్లు అనిపించడంతో పాటు అన్నం తిన్న తర్వాత పొట్ట పై భాగంలో నొప్పి మొదలై అక్కడి నుంచి వీపు వైపు పాకడం లాంటి లక్షణాలను చోటు చేసుకున్నాయి. దీంతో నేను వెంటనే డాక్టర్‌ను కలిశాను. ఆయన కొన్ని పరీక్షలు చేయించి, ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధి వచ్చినట్లు నిర్ధారణ చేసి, సర్జరీ చేయాలంటున్నారు. అసలు ఈ జబ్బు ఎందుకు వస్తుంది? సర్జరీ కాకుండా మందులతో తగ్గదా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - మహ్మద్ అబ్దుల్లా, హైదరాబాద్
శరీరంలోని అవయవాలలో ‘ప్యాంక్రియాస్’ (క్లోమ గ్రంథి) చిన్న పేగుకు పక్కనే ఉండి జీర్ణ ప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. ఇందులో ఉండే కణజాలాలు గ్లూకగాన్, ఇన్సులిన్, సొమటోస్టాటిన్ అనే హార్మోన్లను రక్తంలోకి విడుదల చేసి దానిని శక్తిగా మారుస్తుంటాయి. డయాబెటిస్ సమస్య నుంచి కూడా ఈ గ్రంథి కాపాడుతుంది. అయితే ప్యాంక్రియాస్ స్రావాలు ఒక గొట్టం ద్వారా వచ్చి చిన్న పేగులో కలుస్తాయి. ఈ గొట్టంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే అక్కడ వాపు వస్తుంది. దీనినే ప్యాంక్రియాటైటిస్ వ్యాధి అంటారు. మరికొన్ని సందర్భాలలో క్లోమరసంలో ప్రోటీన్ల పరిమాణం ఎక్కువై ఉండలుగా ఏర్పడి, అవి గొట్టంలో అడ్డుపడటం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మితిమీరిన మద్యపానం కూడా ఈ జబ్బుకు ఒక కారణం కావచ్చు. నిష్ణాతులైన డాక్టర్ల పర్యవేక్షణలోపం వల్ల దీన్ని ప్రాథమిక దశలోనే కనిపెట్టలేకపోవడంతో ఈ వ్యాధి ముదిరి రోగికి ప్రమాదకరంగా మారుతుంది. మీకు రక్తపరీక్షలు, సీరమ్ లైపేజ్ పరీక్షలు, అలాగే సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కాన్ లాంటివి చేసి, ప్యాంక్రియాస్ రక్తనాళం ఏ స్థాయిలో ఉబ్బి ఉందో అలాగే క్లోమం ఏ మేరకు దెబ్బతిన్నదో నిర్ధారణ చేసి మీకు చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది.
ఉంటే మీ డాక్టర్ చెప్పింది అక్షరాలా వాస్తవం. అయితే కొన్ని సందర్భాల్లో మందులతో కూడా ఈ వ్యాధి తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం ఆధునిక శస్త్రచికిత్స ప్రక్రియ అయిన లాప్రోస్కోపిక్ సర్జరీ / కీ హోల్ సర్జరీ ద్వారా విధానం ద్వారా చెడిపోయిన మేరకు క్లోమగ్రంథి భాగాన్ని తొలగించవచ్చు. కీహోల్ సర్జరీ వల్ల హాస్పిటల్‌లో రోగిని ఉండాల్సిన వ్యవధి గణనీయంగా తగ్గుతుంది. సర్జరీ తర్వాత కొద్దికాలంలోనే కోలుకొని మీ వృత్తి జీవితాన్ని కొనసాగించవచ్చు. మీరెంత మాత్రమూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
డాక్టర్ టి.ఎల్.వి.డి. ప్రసాద్ బాబు, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్
బేరియాట్రిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 46 ఏళ్లు. నేను మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. చారు వంటి వాటిల్లోనూ కాస్త కొవ్వులతో వండిన దాల్చా వేసుకుంటూ తింటుంటాను. కొవ్వులతో కూడిన ఆహారం ఇంత ఎక్కువగా తీసుకోకూడదనీ, దీనివల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పేరుకుంటుందనీ, అది ఈ వయసులో గుండె జబ్బులకు దారితీస్తుందని ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - సిరాజుద్దిన్, వరంగల్
కొలెస్ట్రాల్ అనే కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఒంటికి మేలు చేసే కొవ్వులు. వీటిని హైడెన్సిటీ లైపో ప్రొటీన్ (హెచ్‌డీఎల్)అంటారు. ఇవి గుడ్డు తెల్లసొనలో ఉంటాయి. శరీరానికి హానికారకమైన కొవ్వులను ఎల్‌డీఎల్ (లోడెన్సిటీ లైపో ప్రొటీన్స్) అంటారు. చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు గుండెజబ్బులకు ఒక రిస్క్ ఫాక్టర్. చెడు కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో, ఫాస్ట్ ఫుడ్ తీసుకునే వారిలో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో ఈ రెండు రకాల కొవ్వులు కలుపుకొని 200 లోపు ఉండాలి. ఎల్‌డీఎల్ 100 లోపు, హెచ్‌డీఎల్ 40పైన ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే మరో రకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి. ఇవి 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరంలోకి రెండు రకాలుగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మరొకటి లివర్ పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ కోసం, శిశువు రెండేళ్ల పాటు ఎదగడానికి ఈ కొలెస్ట్రాల్ కొవ్వులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే జన్యుతత్వాన్ని బట్టి ఈ కొవ్వులు (మంచి, చెడు ఈ రెండు రకాల కొలెస్ట్రాల్స్) ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్లు, బేకరీ పదార్థాలు, కృత్రిమ నెయ్యి వంటి పదార్థాలను ఎక్కువగా తినేవాళ్లలో ఈ కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
ఇక రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి... డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తుంటారు. ఈ తరహా మందులు వాడుతున్న వారు వాటిని మధ్యలోనే ఆపకూడదు. మీరు మాంసాహారం పూర్తిగా మానేయలేకపోతే... కొవ్వులు తక్కువగా ఉండే చేపలు, చికెన్ వంటి వైట్‌మీట్ తీసుకోండి. వీటిలోనూ చికెన్ కంటే చేపలు చాలా మంచిది. కాబట్టి మాంసాహారం తీసుకోవాలనిపిస్తే చేపలు తినడం మేలు. అది కూడా ఉడికించినవే. వేపుడు వద్దు.
డాక్టర్ అనుజ్ కపాడియా
సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
నా వయసు 24 ఏళ్లు. గత నాలుగేళ్లుగా గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నాం. నాకు రుతుక్రమం సక్రమంగా రాదు. డాక్టర్‌కు చూపించుకుంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని చెప్పారు. ఈ నెల నేను అండం కోసం ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్ తీసుకుని, కొద్దిరోజుల క్రితమే స్కానింగ్ చేయించుకున్నాను. స్కానింగ్ రిపోర్టును చూసిన డాక్టర్లు చాలా అండాలు, ఫాలికిల్స్ ఉన్నాయనీ, అందుకోసం ఈ నెల గర్భధారణకు ప్రయత్నించవద్దని అన్నారు. నేను ఏదో అర్జెంట్ పని ఉండి హైదరాబాద్ నుంచి దగ్గర్లోని మా ఊరికి వచ్చాను, అప్పట్నుంచి నాకు కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, ఆయాసంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. నాకు ఆందోళనగా ఉంది. దీనికి కారణం ఏమిటి? - ఒక సోదరి, కోదాడ
మీరు చెబుతున్న అంశాలను బట్టి మీ ఓవరీ ఎక్కువగా ప్రతిస్పందించినట్లు కనిపిస్తోంది. ఈ కండిషన్‌ను ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటారు. మీలా తక్కువ వయసుండే వారు, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నవారికి గర్భధారణ కోసం మందులు తీసుకున్నప్పుడు ఇది కొన్ని సార్లు జరుగవచ్చు. మందులకు కొందరి శరీరాలు చాలా ఎక్కువగా ప్రతిస్పందిస్తుంటాయి. మీరు తక్షణం దగ్గర్లోని డాక్టర్‌ను కలిసి, వారి సలహా మేరకు మందులను తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్లు మీ కండిషన్ తీవ్రతను అంచనా వేసి, మీలో నొప్పి, ఆయాసం రావడానికి కారణాలు తెలుసుకొని, దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు. చాలా మందిలో ఇలా ప్రతిస్పందనలు కొంత తక్కువ (మైల్డ్)గానే ఉంటాయి. మైల్డ్‌గా ఉన్న సందర్భంలో ఔట్‌పేషెంట్ ప్రాతిపదికనే చికిత్స అందించవచ్చు. అయితే మీరు పూర్తిగా నార్మల్ అయ్యే వరకు క్రమం తప్పకుండా చెకప్‌లు అవసరం. అయితే మీరు తగినంతగా ద్రవాహారం తీసుకుంటూ, మీకు సాఫీగా మూత్రం వస్తుందా అన్నది చూసుకోవాలి. బరువైన పనులు చేయకండి. మీ డాక్టర్ మీకు కొన్ని రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయిస్తారు. ఒకవేళ మీ పరిస్థితిలో తీవ్రత ఎక్కువగా ఉంటే మిమ్మల్ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ కడుపులో, ఊపిరితిత్తుల్లో నీరు చేరితే దాన్ని తొలగించాల్సి అవసరం ఉంటుంది. మీరు వీలైనంత త్వరగా మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. మీ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు.
డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్