ఏడాది క్రితం వికారుద్దీన్ ఎన్‌కౌంటర్..
అదే తేదీన కోర్టులో పేలుడు తమిళనాడు జైళ్లకు పలు లేఖలు
రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు
చిత్తూరు (అర్బన్):చిత్తూరు కోర్టులో జరిగిన బాంబు పేలుడు ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దీనికి తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులకు మరిన్ని ఆధారాలు లభిం చాయి. దీంతో ఉగ్రవాదుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. 2015 ఏప్రిల్ 7న తెలంగాణలో జరిగిన వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ చిత్తూరు కోర్టులో పేలుడు సృష్టించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఏడాది తరువాత 2016 ఏప్రిల్ 7న చిత్తూరు కోర్టులో బాంబు పేలడమే ఇందుకు నిదర్శనం. ఇది తమ పనేననంటూ ‘బేస్ మూమెంట్’ పేరిట చిత్తూరులోని వాణిజ్య పన్నులశాఖ డెప్యూటీ కమిషనరుకు లేఖ రావడం, దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి పుత్తూరులో దొరికిన ఆల్-ఉమా తీవ్ర వాదులపై అనుమానపడడం తెలిసిందే. ఇందులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సిద్దికి కోసం గాలింపులు చేపట్టారు.
ఎవరీ సిద్దికి...
ముస్లింల అణచివేతను నిరసిస్తూ 20 ఏళ్ల క్రితం తమిళనాడుకు చెందిన సిద్దికి ఆల్-ఉమా అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. అప్పట్లో తమిళనాడు పోలీసులు అతన్ని అరెస్టు చేసినా తప్పించుకున్నాడు. తరువాత 1998లో ఎల్‌కే అద్వాని లక్ష్యంగా కొయంబత్తూరులో పేలుడు జరగడం, 58 మంది మృతి చెందడంతో సిద్దికి పేరు తెరపైకి వచ్చింది. అనంతరం అతను కనుమరుగయ్యాడు. 2013 అక్టోబర్‌లో పుత్తూరులో జరిగిన ఆపరేషన్‌లో ఆల్-ఉమాకు సంబంధించిన బిలాల్ మాలిక్, పన్నా ఇస్మాయిల్, ఫకృద్దీన్‌ను అరెస్టు చేశారు. తమిళనాడులో జరిగిన బీజేపీ, శివసేన కార్యకర్తల హత్య కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. చెన్నై నుంచి వీళ్లను మన జిల్లాలోని కోర్టుల్లో వాయిదాకు హాజరు పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరులో జరిగిన పేలుళ్లు ఆల్-ఉమా, బేస్ మూమెంట్ సంస్థలకు పనేనని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో సిద్దికి హస్తం ఉన్నట్లు తాజాగా పోలీసులు చెబుతున్నారు.
జైళ్లకు లేఖలు..
కోయంబత్తూరు పేలుళ్లు, బీజేపీ నేతల హత్యల్లో నిందితులుగా ఉన్న వారు ప్రస్తుతం తమిళనాడు జైళ్లల్లో ఉన్నారు. వీరికి మద్దతుగా ఆర్నెళ్లుగా ఆయా జైళ్ల శాఖలకు ఇంగ్లీషులో టైప్ చేసిన లేఖలు పోస్టుల ద్వారా వస్తున్నాయి. ముస్లింలపై నిర్బంధం, అణచివేతకు ప్రతీకా రం తప్పదని హెచ్చరించారు. చిత్తూరు కోర్టులో బాంబు పెట్టింది తామేనని, మరి కొన్ని దాడులు చేస్తామంటూ పేర్కొన్నారు. ఈ లేఖలను పరిశీలించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), యాంటీ టైస్ట్ ఫోర్సు (ఏటీఎఫ్), బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (బీఐ)కు మన రాష్ట్ర హోంశాఖ నుంచి చిత్తూరు ఘటన వివరాలు వెళ్లాయి.