తిరుపతికి బదులు చిత్తూరులో బాంబు పెట్టారు
- చిత్తూరు కోర్టు బాంబు పేలుడులో కొత్త కోణం
- 2013లో పుత్తూరులో తీవ్రవాదుల కేసుకు లింకు
- తిరుపతికి బదులు చిత్తూరులో పెట్టారు
చిత్తూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు కోర్టు బాంబు పేలుడు కేసులో దర్యాప్తును ప్రారంభించిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. చిత్తూరులో బాంబు పెట్టింది ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తులేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తొలి నుంచి మేయర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూను అనుమానిస్తూ వచ్చిన పోలీసులకు తాజాగా కొత్త ఆధారాలు లభించాయి.
2013 అక్టోబర్ 5న గేట్ పుత్తూరులోని ముస్లిం వీధిలో తీవ్రవాదులు తల దాచుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. తమిళనాడు, చిత్తూరు పోలీసులు సంయుక్తంగా ఆక్టోపస్ బలగాలతో ఆపరేషన్ నిర్వహించారు. ఇస్లామిక్ లిబరేషన్ సంస్థకు చెందిన ఆల్-ఉమ తీవ్రవాదులు బిలాల్ మాలిక్, పన్నా ఇస్మాయిల్ అలియాస్ మహ్మద్ ఇస్మాయిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
అప్పట్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి తీసుకెళ్లే గొడుగుల్లో పేలుడు పదార్థాలు పెట్టాలని తీవ్రవాదులు ప్రణాళిక రచించినట్టు తమిళనాడు పోలీసులకు సమాచారం అందింది. అందులో భాగంగానే పుత్తూరులో తల దాచుకున్నట్లు గుర్తించి ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనలో జీనత్‌ఖాన్ అనే కానిస్టేబుల్, ఎస్పీకి అంగరక్షకుడిగా ఉన్న మరో కానిస్టేబుల్ గాయపడ్డారు.
భయపెట్టాలనే..
ఏప్రిల్ 7న తిరుపతి కోర్టులో ఉగ్రవాదుల కేసుకు షెడ్యూల్ ఖరారు చేసి విచారణ చేపట్టాల్సి ఉంది. బిలాల్ మాలిక్‌కు సంబంధించిన వ్యక్తులు సెషన్స్ కమిట్ కాకుండా చేయడానికి పేలుడు పదార్థాలు పెట్టి భయాందోళనకు గురి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కేసు విచారణ షెడ్యూల్ చిత్తూరులోని జిల్లా కోర్టులో జరగనుందని భావించిన దుండగులు పేలుడు పదార్థాన్ని అక్కడున్న జీపు కింద ఉంచారు. వాస్తవానికి కేసు కమిట్ తిరుపతిలో జరగాల్సి ఉంది. అది తెలియక చిత్తూరులో బాంబు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో బాంబు పేలుడు కేసులో చిక్కుముడి వీడనుంది.