కోర్టులో బాంబు పేలుడు ఘటన
మహబూబ్‌నగర్, అనంతపురం, బెంగళూరుకు ప్రత్యేక బృందాలు
అనుభవం ఉన్న వాళ్లే బాంబు పేల్చినట్లు నిర్ధారణ
చిత్తూరు (అర్బన్) : ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే ఉద్దేశపూర్వకంగా చిత్తూరు కోర్టులో బాంబు పేలుడు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తానెక్కడున్నా చిత్తూరు తన గుప్పెట్లోనే ఉంటుందనే భయం పుట్టించడానికే బాంబు పేలుడుకు స్కెచ్ వేశాడా? అనే కోణంలో చింటూపై పోలీసులు మళ్లీ దృష్టి కేంద్రీకరించారు. గురువారం చిత్తూరు కోర్టులో జరిగిన బాంబు పేలుడుపై పోలీసుల ఇప్పటికే పలువురు పాత నేరస్తులను, చింటూతో విరోధం ఉన్న రౌడీషీటర్లను, అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక బాంబు పేల్చడం, మందుపాతరలు పేల్చడంలో ఆరితేరి నేరప్రవృత్తి కలిగిన ముగ్గురిని పట్టుకోవడానికి ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు పోలీసు బృం దాలు మహబూబ్‌నగర్, అనంతపురంతో పాటు బెంగళూరుకు శుక్రవారం బయలుదేరి వెళ్లాయి.
పేల్చడం సులువు కాదు
బాంబు పేలుడు ఘటనకు పాల్పడింది ఎవరనే దాని పై పోలీసులకు ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదు. అయితే గంధకం, నల్లమందుకు బ్యాటరీలతో అనుసంధానం చేసి పేలుడు సృష్టించడం సామాన్యులకు వీలుకాదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నక్సలైట్లు, వృత్తిరీత్యా బాంబులు పేల్చడంలో ఆరితేరినవారు ఈ ఘటనలో పాల్గొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్వారీల్లో పెద్ద బండరాళ్లను పేల్చడంలో అనుభవం ఉన్న వారు కూడా ఈ ఘటనకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో క్వారీలు నిర్వహిస్తూ నేరచరిత్ర కలిగిన వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారిలో చిత్తూరుకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు. అలాగే మేయర్ దంపతుల హత్య కేసులో ఇప్పటికే బెయిల్‌పై తిరుగుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కోర్టుకు వచ్చిన చింటూతో వారు మాట్లాడటంతో పేలుడుతో చింటూకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా..? అనే దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు 2007లో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై జరిగిన మందుపాతర పేలుడు ఘటనలో నిందితుడిగా ఉన్న ఓ మాజీ నక్సల్‌పై సైతం పోలీసులు దృష్టిపెట్టారు. అతడిని కూడా విచారణ చేసే అవకాశం ఉంది.
సీసీ కెమెరాల్లో నిందితులు..?
బాంబు పేలుడు ఘటనలో పోలీసులకు క్లూ లభిం చింది. కోర్టు ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోయినా న్యాయస్థానాల భవనాల ఎదురుగా ఉన్న పెట్రోలు బంకులో ఉన్న ఓ సీసీ కెమెరా కోర్టు వైపు ఉంది. దీన్ని పరిశీలించిన పోలీసులు పలువురు అనుమానితుల్ని గుర్తించారు. ప్రస్తుతం వారి కోసం వేట కొనసాగుతోంది. మరోవైపు కోర్టులో పేలుడు జరిగిన రోజున ఇదే దారిలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే.బాబు కూడా రావాల్సి ఉంది. ఒక దినపత్రికపై (సాక్షి కాదు) సీకే.బాబు వేసిన పరువునష్టం దావా కేసు జిల్లా కోర్టులో విచారణ సాగుతోంది. దీంతో విచారణకు ఈయన గురువారం జిల్లా కోర్టుకు పేలుడు జరిగిన దారిలోనే రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల సీకే.బాబు కోర్టుకు హాజరుకాలేదు. బాంబులో చీలలు, గాజు పెంకులు, ఇనుప రవ్వలను ఉంచితేనే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ పేలిన బాంబులో ఇవేమీలేవు. అంటే ఎవరినీ హతమార్చడానికి దీనిని పేల్చలేదని అర్థమవుతోంది.
కోలుకుంటున్న బాలాజి
బాంబు పేలుడు ఘటనలో గాయపడ్డ న్యాయవాది గుమస్తా బాలాజి వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఇతని ఎడమ పాదానికి శస్త్రచికిత్స చేసి చీలమండ వరకు తొలగించిన వైద్యులు అత్యవసర విభాగం నుంచి వార్డుకు బదిలీ చేశారు.