ఆటిజమ్ తగ్గుతుందా? | sakshi health councling | Sakshi
Sakshi News home page

ఆటిజమ్ తగ్గుతుందా?

Published Thu, Nov 17 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

sakshi    health councling

 హోమియో కౌన్సెలింగ్

మా అబ్బయి ఐదేళ్లు. మాటలు సరిగా రావడం లేదు. డాక్టర్‌కు చూపిస్తే ఆటిజమ్ అంటున్నారు. హోమియోలో చికిత్స ఉందా? - నాగేశ్వర్‌రావు, తెనాలి
మాటలు సరిగా రాకపోవడం అన్నది ఆటిజమ్ ఉన్నపిల్లల్లోని ఒక లక్షణం. వారిలో చాలా ఇతర సమస్యలు కూడా కనిపిస్తాయి. అందుకే ఆటిజమ్ నిర్ధారణ చేయాలంటే ఇతర సమస్యలు ఉన్నాయేమో చూడాలి. కేవలం పిల్లల లక్షణాలను బట్టి ఆటిజమ్ అని నిర్ధారణకు రాకుండా వైద్యులకు చూపించుకున్న తర్వాతే దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆటిజమ్‌ఉన్న పిల్లలలో ఆరోగ్యంగా ఉన్న పిల్లలలో తేడాను కనిపెట్టడం అంత సులభం కాదు.

ఆటిజమ్ లక్షణాల తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో ఈ లక్షణాలు స్పష్టంగా, నిర్దిష్టంగా ఉంటాయి. దాన్ని క్లాసికల్ ఆటిజమ్ అంటారు. కొందరిలో లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటుంది. అది వారి జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపించదు. దీన్ని మైల్డ్ ఆటిజమ్, ఆస్పర్జర్ సిండ్రోమ్ అని అంటారు. తీవ్రత ఎలా ఉన్నా ఆటిజమ్ ఉన్న పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇవి...

 మాట్లాడటం, భావవ్యక్తీకరణలో, ఏకాగ్రతను చూపలేకపోవడం, అందులో ఇబ్బందులు ఎదుర్కోవడం. (ఆటిజమ్ ఉన్న 40 శాతం మందిలో మాటలే రాకపోవచ్చు)  పిల్లలు స్నేహితులను చేసుకోలేకపోవడం  ఎదుటివారి మనోభావాలను అర్థం చేసుకోలేకపోవడం  నలుగురిలో కలవలేకపోవడం; ఆనందాలను, బాధలను పంచుకోలేకపోవడం  ఒకేమాటను పదే పదే ఉచ్చరించడమో లేదా అడిగిన ప్రశ్ననే మళ్లీ తిరిగి అడగటమో చేస్తుంటారు.  ఎప్పుడూ రొటీన్‌నే కోరుకోవడం... అంటే ఒకేరకమైన ఆహారం లేదా దుస్తులు వేయమని అడగడం. వయసుకు తగినంత మానసిక పరిపక్వత చూపలేకపోవడం  చేతులు, కాళ్లు విచిత్రంగా ఆడించడం, కదపడం, చుట్టూ తిరగడం, గజిబిజిగా నడవడం, శరీరంలో జర్క్ ఇచ్చినట్లుగా కదలికలు ఉండటం- ఇవన్నీ ‘ఆటిజమ్’ను గుర్తించడానికి బాగా తోడ్పడతాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. మాటలు రాని వారికి స్పీచ్ థెరపీ ఉపయోగపడుతుంది. బిహేవియరల్ థెరపీ వంటి చికిత్స ప్రక్రియల వల్ల పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది. హోమియోలో పిల్లల లక్షణాలు,  కారణాల వంటి అనేక అంశాను పరిగణనలోకి తీసుకుని ఔషధాలను సూచిస్తారు.  హోమియో చికిత్సలో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు. సరైన హోమియో మందులను, తగిన మోతాదులో అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడటం వల్ల పిల్లల్లో ఆటిజమ్ చాలావరకు నయమవుతుంది.

డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్
పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్

లింఫోమా అంటే ఏమిటి?
లింఫోమా క్యాన్సర్ కౌన్సెలింగ్

 

 నా వయసు 48 ఏళ్లు. గత కొద్ది రోజులుగా నేను ప్లీహం (స్ల్పీన్) పెరగడం వల్ల బాధపడుతున్నాను. పొట్టలో నొప్పి, గజ్జలలో వాపు, జ్వరం-చలి, రాత్రిపూట చెమటలు పట్టడం లక్షణాలు కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను కలిసి ఈ లక్షణాలను చెబితే, కొన్ని పరీక్షలు నిర్వహించి నేను లింఫోమా వ్యాధితో బాధపడుతున్నాని నిర్ధారణ చేశారు. లింఫోమా అంటే ఏమిటి, దానికి చికిత్స ఏమిటో చెప్పండి. - విశ్వేశ్వరరావు, వైజాగ్
లింఫోమా అనేది లింఫోసైట్స్ (తెల్ల రక్త కణాలను) ఉత్పత్తి చేసి, నిల్వ చేసి, తీసుకెళ్లే కణజాలాల వ్యవస్థలో కలిగే క్యాన్సర్. ఇది ప్రాథమికంగా రెండు రకాలుగా ఉంటుంది. 1) హాడ్జ్‌కిన్స్ లింఫోమా 2) నాన్-హాడ్జ్‌కిన్స్ లింఫోమా

లింఫోమా లక్షణాలు
నొప్పి లేకుండా మెడలో, చంకలో, గజ్జల్లో వాపు  ప్లీహం (స్ప్లీన్) పెరగడం, పొట్టనొప్పి, అసౌకర్యం  జ్వరం చలి లేదా రాత్రిళ్లు చెమటలు పట్టడం  నిస్సత్తువగా అనిపించడం.

రోగ నిర్ధారణ పరీక్షలు
రక్త పరీక్షలు  బయాప్సీ  ఎముక మూలుగ పరీక్ష  సెరిబ్రో స్పినల్ ఫ్లుయిడ్స్  మాలిక్యులార్ రోగ నిర్ధారణ పరీక్షలు  ఎక్స్‌రే, సీటీ స్కాన్, పెట్ స్కాన్ అనే ఇమేజింగ్ పరీక్షలు. వైద్య పరీక్షలను క్షుణ్ణంగా చేశాక మీ శరీరంలో లింఫోమా ఏ దశలో ఉందో మీ వైద్యుడికి తెలుస్తుంది. ఆ తర్వాత మీకు ఎలాంటి చికిత్స అందించాలన్న అంశం మూడు ప్రధాన విషయాలపై ఆధారపడి ఉంటుంది. అవి...  మీకు ఏ రకరమైన లింఫోమా ఉంది  మీకు ఉన్న లింఫోమా ఏ దశలో ఉంది (అంటే లింఫోమా వల్ల ఏయే అవయవాలు దెబ్బతిన్నాయి)  మీ సాధారణ ఆరోగ్యాన్నీ చూస్తారు.

లింఫోమా తర్వాతి జీవితం
పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి,. అయితే ఒకేసారి ఎక్కువగా భోజనం చేయకూడదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినాలి  మీ నోట్లో ఏదైనా పుండు వంటిది ఉంటే మెత్తటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, బత్తాయి పండ్ల రసం తీసుకోకూడదు  ద్రవాహారం పుష్కలంగా తీసుకోండి  మీ డాక్టర్ సలహా మేరకు సింపుల్ స్ట్రెచింగ్ వ్యాయామాలు, కొద్ది పాటి నడక వంటి ఎక్సర్‌సైజ్‌లు చేయాలి  తగినంత విశ్రాంతి తీసుకోవాలి, కంటి నిండా నిద్రపోవాలి  తాజా గాలి బాగా పీల్చాలి  కుంగుబాటు లేకుండా జీవించాలి  ఒకవేళ కుంగుబాటు ఎక్కువ కాలం ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. లింఫోమాను కనుగొన్న తర్వాత మీ లిపిడ్‌లను, థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాలను క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకుంటూ ఉండటం ముఖ్యం. అవేగాక మరికొన్ని పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది.

డాక్టర్  సోనాలి సదావర్తి కన్సల్టెంట్
హెమటో ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్

మాటిమాటికీ నిద్ర... ఏం చేయాలి?
స్లీప్ కౌన్సెలింగ్

నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్‌లో పాల్గొంటున్నప్పుడూ, తింటున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీని వల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి. - నవీన్, హైదరాబాద్
మీరు చెబుతున్న దాన్ని బట్టి మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు.

సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కదిలే దశ... ఇలాగ.  కనుపాపలు వేగంగా కలిదే దశను ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఆర్‌ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్‌ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్‌ఈఎమ్ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి.

నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. అయితే ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. ఇక మరికొందరు  శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్‌ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది.  అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు  మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాట కూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీ డిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో దీనికి చికిత్స చేయవచ్చు.

డాక్టర్ రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్
పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement