నా వయసు 52 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. మందులు వాడుతున్నంత కాలం బాగానే ఉన్నా అవి ఆపేస్తే మాత్రం మళ్లీ నొప్పి వస్తోంది. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? వివరంగా చెప్పగలరు.
వయసు పెరగడం వల్ల వచ్చే మెడ నొప్పికి పూర్తి పరిష్కారం లభించదని చాలామంది అనుకుంటుంటారు. కానీ హోమియోచికిత్స ద్వారా ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది. మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దీనినే సర్వైకల్ స్పైనల్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. దాదాపు 85 శాతానికి పైగా ఇది 60 ఏళ్ల వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది. ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది.
కారణాలు:
►వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం
►క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం
►డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం
►వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం
►ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం
►ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్వు సమయం మెడను వంచి ఫోన్‌లలో మాట్లాడటం
►ఎత్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం
►మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం
►తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
లక్షణాలు:
►సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి
►నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం
►మెడ బిగుసుకుపోవడం
►తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం
►నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం
►చిన్న బరువునూ ఎత్తలేకపోవడం
►నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు.
నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్‌ఆర్, ఎక్స్–రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు.
హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్‌టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు.
డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్,
హైదరాబాద్
కళ్లు పచ్చగా ఉన్నాయి...పరిష్కారం చెప్పండి
నా వయసు 35 ఏళ్లు. నా కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. మూత్రం కూడా పసుపురంగులో వస్తోంది. ఈ లక్షణాలు చూసి నాకు ఆందోళనగా ఉంది. నా సమస్య ఏమిటి? దీనికి హోమియోలో మంచి చికిత్స ఉందేమో దయచేసి వివరించండి.
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు కామెర్లు సోకినట్లు తెలుస్తోంది. ఇది దీర్ఘకాలంలో కాలేయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మానవ శరీరంలో కాలేయం అతి ముఖ్యమైన భాగం. ఈ అవయవానికి వైరస్ కారణంగా ఇన్ఫెక్షన్ సోకితే ఎన్నో సమస్యలు మొదలవుతాయి. కాలేయం ప్రభావం చూపే వైరస్‌లలో ముఖ్యమైనవి హెపటైటిస్–బి, హెపటైటిస్–సి. ఈ వైరస్‌లు సోకగానే బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొంతకాలం పాటు ఆ వైరస్ వారి శరీరాల్లో నిద్రాణంగా ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా కాలేయాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రాణాంతకంగా మారుతుంది. లివర్ క్యాన్సర్ సిర్రోసిస్, వైరల్ హెపటైటిస్ వ్యాధులు రావడానికి కారణమవుతుంది.
లక్షణాలు: హెపటైటిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే లక్షణాలు బయటకేమీ కనిపించవు. అవి కనిపించడానికి చాలా ఏళ్లు పడుతుంది. కొంతమందిలో వైరస్ సోకిన కొద్దిరోజులకే కామెర్లు వస్తాయి. దీన్ని ఎక్యూట్ స్టేజ్‌గా చెప్పవచ్చు. ఈ దశలో వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. కొంతమందిలో ఈ వైరస్ తొలగిపోకుండా, శాశ్వతంగా శరీరంలోనే నివాసం ఏర్పరచుకొని బలం పెంచుకుంటూ పోతుంది. దీనిని క్రానిక్ స్టేజ్ అంటారు. ఈ దశలోనే కాళ్లవాపు, పొట్ట ఉబ్బరం, వాంతులు, ఆకలి తగ్గిపోవడం, మూత్రం పచ్చగా రావడం, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్స: రోగి శారీరక మానసిక లక్షణాలను పరిశీలించి చికిత్స అందించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. మీరొకసారి హోమియో వైద్యుడిని సంప్రదించండి. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు వాడితే భవిష్యత్తులో కాలేయానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా పూర్తిగా కాపాడుకోవచ్చు.
డా‘‘ కె. రవికిరణ్,
మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్
మెడనొప్పి చేతులకూ పాకుతోంది..?
Published Thu, Oct 17 2019 5:43 AM | Last Updated on Thu, Oct 17 2019 5:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment