ముంబై ఆస్పత్రిలో క్షుద్ర పూజల కలకలం | Black magic at Mumbai Lilavati Hospital | Sakshi
Sakshi News home page

ముంబై ఆస్పత్రిలో క్షుద్ర పూజల కలకలం

Published Fri, Mar 14 2025 6:37 AM | Last Updated on Fri, Mar 14 2025 6:37 AM

Black magic at Mumbai Lilavati Hospital

ముంబై: ముంబైలోని ప్రముఖ లీలావతి ఆస్పత్రిలో క్షుద్ర పూజలు జరిగాయన్న వార్త కలకలం రేపింది. తమ కార్యాలయం ఫ్లోర్‌ అడుగున మానవ ఎముకలు, పుర్రెలు, వెంట్రుకలు, బియ్యం, తదితర మంత్రాలకు ఉపయోగించే సామగ్రి కనిపించినట్లు ప్రస్తుత ట్రస్టీలు ఆరోపించారు. మాజీ ఉద్యోగుల నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం అందుకున్న ట్రస్టీలు అక్కడ తవ్వి చూడగా ఇవన్నీ కనిపించాయి. 

ఈ తవ్వకాలను వారు చిత్రీకరించారు. ప్రశాంత్‌ మెహతా, ఆయన తల్లి చారు మెహతాలకు హాని తలపెట్టేందుకే మంత్రాలు చేశారంటూ పోలీసులకు ఫిర్యా దు చేశారు. కాగా, మాజీ ట్రస్టీలు రూ.1,250 కోట్ల మేర ఆస్పత్రి నిధులను పక్కదారి పట్టించారని ప్రస్తుత ట్రస్టీలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు. అయితే, ఇవన్నీ నిరాధార, దురుద్దేశ పూర్వక ఆరోపణలని మాజీ ట్రస్టీ విజయ్‌ మెహతా, ఆయన కుటుంబీకులు, సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు. 

లీలావతి ఆస్పత్రి వ్యవస్థాపకుడు కిశోర్‌ మెహతా సోదరుడే విజయ్‌ మెహతా. ఇలా ఉండగా, 2002లో కిశోర్‌ మెహతా వైద్యం కోసం విదేశాలకు వెళ్లగా విజయ్‌ మెహతా తాత్కాలికంగా ట్రస్టీ బాధ్యతలను చేపట్టారు. ఆ సమయంలో ఫోర్జరీ సంతకాలు, తప్పుడు పత్రాలతో తన కుమారులు, సన్నిహిత బంధువులను ట్రస్టీలుగా చేర్చుకున్నారు. శాశ్వత ట్రస్టీగా ఉన్న సోదరుడు విజయ్‌ మెహతాను ఆ హోదా నుంచి తప్పించారు. దీనిపై సుదీర్ఘకాలం న్యాయ పోరాటం జరిగింది. చివరికి, 2016లో కిశోర్‌ మెహతా ట్రస్టీగా రాజీనామా చేయడంతో వివాదం ముగిసింది. 2024లో కిశోర్‌ చనిపోవడంతో ఆయన కుమారుడు ప్రశాంత్‌ మెహతా శాశ్వత ట్రస్టీ అయ్యారు. ప్రశాంత్‌ ఆస్పత్రి ఆర్థిక నిర్వహణపై పూర్తి స్థాయి ఆడిట్‌కు ఆదేశించగా భారీగా అవకతవకలు వెలుగు చూశాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement