టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) గాయపడినట్లు సమాచారం. మెడ నొప్పితో అతడు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉపశమనం కోసం కోహ్లి ఇంజక్షన్ కూడా తీసుకున్నాడని.. ప్రస్తుతం అతడు ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) వర్గాలు వెల్లడించాయి.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో విఫలం
కాగా కోహ్లి ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆడిన ఐదు టెస్టుల్లోనూ భాగమయ్యాడు. అయితే, కంగారూ గడ్డపై తనకున్న ఘనమైన రికార్డును ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఈసారి కొనసాగించలేకపోయాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో శతకం బాదడం మినహా.. మిగతా అన్నింట్లోనూ విఫలమయ్యాడు.
రంజీలు ఆడతాడనుకుంటే
అంతేకాదు.. ఒకే రీతిలో అవుట్ కావడం కూడా కోహ్లి ఆట తీరుపై విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అతడు కూడా దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని మాజీ క్రికెటర్లు సూచించారు. దీంతో కోహ్లి తన సొంత జట్టు ఢిల్లీ తరఫున రంజీ(Ranji Trophy) సెకండ్ లెగ్‌లో ఆడతాడనే వార్తలు వచ్చాయి. అయితే, ఈ స్టార్ బ్యాటర్ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ ఇటీవలే తెలిపాడు.
అంతేకాదు.. దేశీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో ముంబై క్రికెటర్లను చూసి కోహ్లి నేర్చుకోవాలని విమర్శలు గుప్పించాడు. ఇక జనవరి 23 నుంచి ఆరంభం కాబోయే రంజీ సెకండ్ లెగ్ మ్యాచ్‌లకు ప్రకటించిన జట్టులోనూ కోహ్లి పేరును డీడీసీఏ చేర్చింది. ఈ నేపథ్యంలో అతడు గాయపడినట్లు తాజాగా వార్తలు రావడం గమనార్హం.
ఇంజక్షన్ కూడా తీసుకున్నాడు
ఈ విషయం గురించి డీడీసీఏ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి మెడనొప్పితో బాధపడుతున్నాడు. ఇంజక్షన్ కూడా తీసుకున్నాడు. తొలి రెండు రంజీలకు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. సెలక్టర్లు మాత్రమే ఈ విషయం గురించి కచ్చితమైన సమాచారం ఇవ్వగలరు’’ అని పేర్కొన్నాయి.
కెప్టెన్సీ వద్దన్న పంత్
ఇక మరో ఢిల్లీ స్టార్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం రంజీలు ఆడేందుకు సిద్ధమయ్యాడు. తొలుత అతడే ఢిల్లీ సారథిగా వ్యవహరిస్తాడని వార్తలు రాగా.. పంత్ అందుకు నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయుష్ బదోని కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇక సౌరాష్ట్ర, రైల్వేస్‌తో మ్యాచ్‌లకు డీడీసీఏ శుక్రవారం తమ జట్టును ప్రకటించనున్నట్లు సమాచారం.
కాగా విరాట్ కోహ్లి 2012లో చివరిసారిగా రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ మధ్య ఘజియాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అయితే, రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 14, 43 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నాటి మ్యాచ్‌లో యూపీ చేతిలో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
మరోవైపు.. రిషభ్ పంత్ 2017-18లో ఆఖరిగా ఢిల్లీ తరఫున రంజీ బరిలో దిగాడు. విదర్భతో నాటి ఫైనల్లో 21, 32 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్
Comments
Please login to add a commentAdd a comment