దేశవాళీ క్రికెట్‌లో విరాట్ కోహ్లి ఆడతాడా? లేదా? ఢిల్లీ తరఫున అతడు రంజీ బరిలో దిగుతాడా? అన్న ప్రశ్నలకు తెరదించేందుకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సిద్దమైంది. రంజీ ట్రోఫీ 2024-25 సెకండ్ లెగ్‌లో భాగంగా జనవరి 23న మొదలుకానున్న మ్యాచ్‌కు శుక్రవారం తమ జట్టును ప్రకటించనుంది.
కోహ్లి, పంత్‌లపై విమర్శలు
కాగా రంజీ ట్రోఫీ తాజా సీజన్ కోసం డీడీసీఏ గతంలోనే 41 మందితో కూడి ప్రాబబుల్ జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లితో పాటు రిషభ్ పంత్, హర్షిత్ రాణా పేర్లు ఉన్నాయి. అయితే, జాతీయ జట్టు విధుల దృష్ట్యా కోహ్లి, పంత్ ఢిల్లీ తరఫున ఆడలేకపోయారు. కానీ.. ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా కోహ్లి(Virat Kohli), పంత్ విఫలమైన తీరు విమర్శలకు దారి తీసింది.
ముఖ్యంగా ఈ ఇద్దరు ఢిల్లీ బ్యాటర్ల షాట్ సెలక్షన్, వికెట్ పారేసుకున్న విధానం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో కోహ్లి, పంత్ రంజీ బరిలో దిగి.. తిరిగి మునుపటి లయను అందుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. ఈ క్రమంలో రంజీ సెకండ్ లెగ్ మ్యాచ్‌లకు రిషభ్ పంత్ అందుబాటులోకి రాగా.. కోహ్లి మాత్రం ఇంత వరకు తన నిర్ణయం చెప్పలేదు.
ఈ విషయాన్ని డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ స్వయంగా వెల్లడించాడు. పంత్ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని చెప్పాడని.. అయితే, కోహ్లి మాత్రం ఈ విషయంపై మౌనం వీడటం లేదని విమర్శించాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడు కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని పేర్కొన్నాడు.
కెప్టెన్‌గా రిషభ్ పంత్
అంతేకాదు.. ముంబై తరఫున టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బరిలోకి దిగనున్నాడనే వార్తల నేపథ్యంలో.. ముంబై క్రికెటర్లును చూసి కోహ్లి నేర్చుకోవాల్సింది చాలా ఉందని హితవు పలికాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తమ జట్టును ప్రకటించేందుకు డీడీసీఏ సిద్ధమైంది.
ఈ విషయం గురించి డీడీసీఏ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘శుక్రవారం మధ్యాహ్నం సెలక్షన్ మీటింగ్ జరుగుతుంది. సౌరాష్ట్రతో మ్యాచ్‌కు రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది’’ అని తెలిపారు. అయితే, కోహ్లి గురించి మాత్రం తమకు సమాచారం లేదని పేర్కొన్నారు. హర్షిత్ రాణా మాత్రం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా రంజీలకు అందుబాటులో ఉండడని తెలిపారు.
రంజీ ట్రోఫీ సెకండ్ లెగ్- ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టు
విరాట్ కోహ్లి(సమాచారం లేదు), రిషబ్ పంత్, హర్షిత్ రాణా (అందుబాటులో లేడు), ఆయుష్ బదోనీ, సనత్ సంగ్వాన్, గగన్ వాట్స్, యశ్ ధూల్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), జాంటీ సిద్ధూ, సిద్ధాంత్ శర్మ, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, ప్రణవ్ రాజ్వంశీ (వికెట్ కీపర్), సుమిత్ మాథుర్, మనీ గ్రేవాల్, శివమ్ శర్మ, మయాంక్ గుస్సేన్, వైభవ్ కండ్పాల్, హిమాన్షు చౌహాన్, హర్ష్ త్యాగి, శివాంక్ వశిష్ట్, ప్రిన్స్ యాదవ్, ఆయుష్ సింగ్, అఖిల్ చౌదరి, హృతిక్ షోకీన్, లక్షయ్ తరేజా (వికెట్ కీపర్), ఆయుష్ దోసేజా, అర్పిత్ రాణా, వికాస్ సోలంకి, సమర్థ్ సేథ్, రౌనక్ వాఘేలా, అనిరుధ్ చౌదరి, రాహుల్ గహ్లోత్, భగవాన్ సింగ్, మయాంక్ రావత్, తేజస్వి దహియా (వికెట్ కీపర్), పార్థీక్, రాహుల్ డాగర్, ఆర్యన్ రాణా, సలీల్ మల్హోత్రా, జితేష్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment