
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 12 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జనవరి 30 ప్రారంభం కానున్న మ్యాచ్‌లో రైల్వేస్‌తో ఢిల్లీ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) తమ జట్టును ప్రకటించింది.
ఈ జట్టులో విరాట్ కోహ్లి డీడీసీఎ సెలక్టర్లు చోటిచ్చారు. జనవరి 28న కోహ్లి జట్టుతో చేరుతాడని ఢిల్లీ హెడ్‌కోచ్ శరణ్‌దీప్ సింగ్ ఇప్పటికే ధ్రువీకరించారు. ఇప్పుడు ఢిల్లీ తమ జట్టును ప్రకటించడంతో కోహ్లి రీఎంట్రీ ఖాయమైంది. యువ ఆటగాడు అయూష్ బడోని సారథ్యంలో కింగ్ కోహ్లి ఆడనున్నాడు. కోహ్లి చివరగా రంజీల్లో 2012-13 సీజన్‌లో ఢిల్లీ తరపున ఆడాడు.
ఆ సీజన్‌లో కోహ్లి కేవల ఒకే ఒక మ్యాచ్ ఆడి 57 పరుగులు చేశాడు. అయితే అంతకుముందు సీజన్‌లలో మాత్రం విరాట్ అద్బుతంగా రాణించాడు. ఇప్పటివరకు 23 రంజీ మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 5 సెంచరీలు ఉన్నాయి.
అయితే కోహ్లి కేవలం 19 ఏళ్ల వయస్సులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎక్కువగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిచించలేదు. ఇక 12 ఏళ్ల తర్వాత కోహ్లి రంజీల్లో ఆడుతుండడంతో మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులను ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ ఉచితంగా అనుమతించనుంది.
రిషబ్ పంత్ దూరం..
ఇక రైల్వేస్‌తో మ్యాచ్‌కు ఢిల్లీ స్టార్, భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. సౌరాష్ట్రపై ఆడిన పంత్ ఈ మ్యాచ్‌కు మాత్రం దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డేల,ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన పంత్.. వైట్ బాల్ క్రికెట్‌పై దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
అతడు వైట్‌బాల్‌తో ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. తన రంజీ రీ ఎంట్రీ మ్యాచ్‌లో పంత్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఢిల్లీ జట్టు: ఆయుష్ బడోని (కెప్టెన్), విరాట్ కోహ్లి, సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, జాంటీ సిద్ధు, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, శివం శర్మ, ప్రణవ్ రాజ్‌వంశీ, వైభవ్ కంద్‌పాల్, మయాంక్ గుసైన్, గగన్ వాట్స్ , ఆయుష్ దోసెజా, సుమిత్ మాథుర్, రాహుల్ గహ్లోట్, జితేష్ సింగ్, వంశ్ బేడీ.
చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: భారత మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment