12 వికెట్లతో చెలరేగిన జడేజా.. పంత్‌ టీమ్‌ చిత్తు | Ravindra Jadeja stars as Saurashtra thrash Delhi by 10 wickets | Sakshi
Sakshi News home page

#RavindraJadeja: 12 వికెట్లతో చెలరేగిన జడేజా.. పంత్‌ టీమ్‌ చిత్తు

Published Fri, Jan 24 2025 3:57 PM | Last Updated on Fri, Jan 24 2025 4:15 PM

Ravindra Jadeja stars as Saurashtra thrash Delhi by 10 wickets

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(Ravindra Jadeja)  తన రంజీ పునరాగమనంలో సత్తాచాటాడు. రంజీ ట్రోఫీ 2024-25లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 12 వికెట్లతో చెల‌రేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు ప‌డ‌గొట్టిన జ‌డ్డూ.. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల‌తో మెరిశాడు. అత‌డి స్పిన్ మ‌యాజాలానికి ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్లు విల్ల‌విల్లాడారు. అటు బ్యాటింగ్‌లోనూ జడేజా అదరగొట్టాడు. 38 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ఢిల్లీని చిత్తు చేసిన సౌరాష్ట్ర..
ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీపై సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లో మాత్రమే ముగిసిపోయింది. ఢిల్లీ విధించిన 15 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌరాష్ట్ర జట్టు వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు హర్విక్ దేశాయ్‌(6),  అర్పిత్ రానా(4) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.

కాగా అంతకముందు 163/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్రకు తొలి ఇన్నింగ్స్‌లో 83 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. సౌరాష్ట్ర బ్యాట‌ర్ల‌లో హ‌ర్విక్ దేశాయ్‌(93) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. వాస్వాద‌(62), జ‌డేజా(38) ప‌రుగుల‌తో రాణించారు.

ఢిల్లీ బౌల‌ర్ల‌లో హ‌ర్ష్ త్యాగీ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అయూష్ బ‌దోని మూడు వికెట్లు సాధించాడు. అనంత‌రం 83 ప‌రుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఢిల్లీ కేవ‌లం 94 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్ర‌ముందు ఢిల్లీ కేవ‌లం 15 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మాత్ర‌మే ఉంచ‌గల్గింది.

ఢిల్లీ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అయూష్ బదోని(44) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఢిల్లీ స్టార్ ప్లేయ‌ర్ రిష‌బ్ పంత్(Rishabh Pant) రెండు ఇన్నింగ్స్‌ల‌లో తీవ్ర‌నిరాశ‌ప‌రిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసిన పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 17 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. 

సౌరాష్ట్ర బౌల‌ర్ల‌లో జ‌డేజా(7 వికెట్లు)తో పాటు ద‌ర్మేంద్ర జ‌డేజా రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 188 ప‌రుగుల‌కు ఆలౌటైంది.ఇక 12 వికెట్ల‌తో మెరిసిన రవీంద్ర జ‌డేజాకు ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.
చదవండి: రోహిత్‌, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్‌ పఠాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement