టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో విఫలమైనా ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డే ఫార్మాట్లో(ODI Format) సత్తా చాటుతారని విశ్వాసం వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వీరిద్దరు మరోసారి పరుగుల వరద పారించడం ఖాయమని పేర్కొన్నాడు.
రోహిత్‌తో పోలిస్తే కోహ్లి కాస్త నయం
కాగా భారత సారథి రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్లో నిరాశపరుస్తున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఈ ఇద్దరు విఫలమయ్యారు. అయితే, రోహిత్‌తో పోలిస్తే కోహ్లి కాస్త నయం. పెర్త్‌టెస్టులో కనీసం శతకం బాదాడు.
దేశవాళీ క్రికెట్ బాట
కానీ ఆ తర్వాత మరోసారి చేతులెత్తేశాడు. అయితే, అన్నింటికంటే కూడా ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు షాట్ల ఎంపికలో నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ పారేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్- కోహ్లి కచ్చితంగా దేశవాళీ క్రికెట్లో ఆడితేనే పునర్వైభవం పొందే అవకాశం ఉంటుందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో రోహిత్ శర్మ ముంబై తరఫున రంజీ ట్రోఫీ రెండో దశ బరిలో దిగగా.. కోహ్లి మాత్రం మెడ నొప్పి కారణంగా ఢిల్లీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక రోహిత్ రంజీల్లోనూ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. జమ్ము కశ్మీర్‌తో మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో మూడు పరుగులకే అవుటైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఇక ‘విరాహిత్’ ద్వయం తదుపరి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా.. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత వీరు యాభై ఓవర్ల ఫార్మాట్ బరిలో దిగనున్నారు. అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లో భాగమవుతారు. అయితే, వీరిద్దరి తాజా వరుస వైఫల్యాల నేపథ్యంలో మెగా టోర్నీలో ఏమేరకు రాణిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వైట్‌బాల్ క్రికెట్‌లో అదరగొడతారు
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘త్వరలోనే రోహిత్- కోహ్లి వైట్‌బాల్ క్రికెట్‌లో పరుగులు తీయడం మొదలుపెడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. టెస్టు క్రికెట్ భిన్నమైంది.
అవుట్ ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతులను ఆడాలనే ప్రయత్నంలో విరాట్ సఫలం కాలేకపోయాడు. మరోవైపు.. రోహిత్ కూడా మునుపటి లయను అందుకోలేకపోయాడు. అయితే, వీరిద్దరికి వన్డే ఫార్మాట్ అంటే ఎంతో ఇష్టం. కాబట్టి కచ్చితంగా తిరిగి పుంజుకుంటారు’’ అని పేర్కొన్నాడు.
మొక్కుబడిగా వద్దు!
ఇక టీమిండియా ప్రధాన ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో ఆడటం గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఏదో షో ఆఫ్ చేయడానికి మాత్రం రెండు మ్యాచ్‌లు ఆడేసి వెళ్లిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. వీలు దొరికినప్పుడల్లా.. తరచుగా క్రికెట్ ఆడుతూ ఉంటేనే ఫామ్‌లో ఉంటారు.
యువ ఆటగాళ్లకు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిలతో పోటీ అంటే మంచి మజా ఉంటుంది. వాళ్లకు బౌలింగ్ చేయాలనే ఉద్దేశంతో మరింత ఎక్కువగా కష్టపడతారు. అంతిమంగా ఇది భారత క్రికెట్ ఉజ్వల భవిష్యత్తుకు దోహదం చేస్తుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.
చదవండి: Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment