రంజీ ‘జట్టు’లో విరాట్‌ కోహ్లి.. ప్రకటించిన డీడీసీఏ | Ranji 2024 25: Virat Kohli Rishabh Pant named in Delhi probable squad | Sakshi
Sakshi News home page

రంజీ ‘జట్టు’లో విరాట్‌ కోహ్లి, మరో టీమిండియా స్టార్‌ కూడా.. డీడీసీఏ ప్రకటన

Published Wed, Sep 25 2024 11:12 AM | Last Updated on Wed, Sep 25 2024 11:26 AM

Ranji 2024 25: Virat Kohli Rishabh Pant named in Delhi probable squad

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల వీరుడు విరాట్‌ కోహ్లి దేశవాళీ క్రికెట్‌ ఆడనున్నాడా? సొంత జట్టు ఢిల్లీ తరఫున తాజా రంజీ సీజన్‌ బరిలో దిగనున్నాడా? అంటే.. ఇందుకు అవకాశం ఉందంటోంది ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ). రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో పాల్గొనబోయే ఢిల్లీ ప్రాబబుల్‌ టీమ్‌లో విరాట్‌ కోహ్లి పేరును చేర్చింది.

ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌తో పాటు.. మరో టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌కు కూడా ఈ జాబితాలో చోటిచ్చింది. అదే విధంగా.. జాతీయ జట్టుకు దూరమైన పేసర్‌ నవదీప్‌ సైనీకి స్థానం కల్పించిన డీడీసీఏ.. వెటరన్‌ పేస్‌ బౌలర్‌, గత సీజన్‌లో ఢిల్లీకి ఆడిన ఇషాంత్‌ శర్మను మాత్రం పక్కనపెట్టింది.

చివరగా 2012-13 ఎడిషన్‌లో ఢిల్లీ తరఫున
కాగా కోహ్లి చివరగా 2012-13 ఎడిషన్‌లో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌ ఆడాడు. ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత మళ్లీ 2019లో ప్రాబబుల్‌ జట్టులో కోహ్లి పేరున్నా... టీమిండియా బిజీ షెడ్యూల్‌ కారణంగా అతడు ఢిల్లీకి ఆడలేకపోయాడు. అయితే, జాతీయ జట్టు విధుల్లో లేనపుడు ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లంతా డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి నిబంధన విధించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఇటీవలి దులిప్‌ ట్రోఫీ-2024లో కోహ్లి భాగమవుతాడని అభిమానులు ఆశించినా.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు రిస్క్‌ ఎందుకని బోర్డు అతడికి విశ్రాంతినిచ్చింది. ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాతో సిరీస్‌తో కోహ్లి బిజీగా ఉన్నప్పటికీ.. తాజాగా డీడీసీఏ ఈ మేరకు ప్రకటన విడుదల చేయడం విశేషం.

84 మంది సభ్యులతో  ప్రాబబుల్‌ జట్టు
కాగా రంజీ 2024-25 ఎడిషన్‌ అక్టోబరు 11 నుంచి ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో ఛండీఘర్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో 84 మంది సభ్యులతో కూడిన ప్రాబబుల్‌ జట్టును డీడీసీఏ ప్రకటించింది. అదే విధంగా.. సెప్టెంబరు 26 నుంచి వీరికి ఫిట్‌నెస్‌ టెస్టులు నిర్వహిస్తామని తెలిపింది. అయితే టీమిండియా స్టార్లు విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌లకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది.

కోహ్లి అందుబాటులో ఉండే అవకాశమే లేదు
కాగా కోహ్లి, పంత్‌ రంజీ తొలి దఫా మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో అక్టోబరు 16 నుంచి టెస్టు సిరీస్‌ ఆరంభం కావడమే ఇందుకు కారణం. ఆ తర్వాత టీమిండియా బోర్డర్‌-గావస్కర్‌ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. కాబట్టి రంజీ సీజన్‌ మొత్తానికి కోహ్లి అందుబాటులో ఉండే అవకాశమే లేదు. 

కానీ ఫామ్‌లేమితో సతమతమైతే.. దేశవాళీ క్రికెట్‌ ఆడాలని బీసీసీఐ ఆదేశిస్తే మాత్రం ఢిల్లీ తరఫున అతడు బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం నుంచి బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో కోహ్లి, పంత్‌ టీమిండియాతో కలిసి ఇప్పటికే కాన్పూర్‌ చేరుకున్నారు. 

చదవండి: IND Vs BAN 2nd Test: గంభీర్‌ మరో మాస్టర్‌ ప్లాన్‌.. ఇక బంగ్లాకు చుక్కలే?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement