![BCCI Rewarded Rohit Sharma And Co With Personalised Diamond Studded Rings Video](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/t20wc.jpg.webp?itok=Ekc0rtt0)
టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అరుదైన కానుకలు అందించింది. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో విజేతగా నిలిచిన భారత జట్టులోని సభ్యులకు వజ్రపుటుంగరాలు ప్రదానం చేసింది. ఉంగరాల పైభాగంలో అశోక్ చక్ర గుర్తుతో పాటు.. సైడ్‌లో ఆటగాళ్ల జెర్సీ నంబర్ వచ్చేలా ప్రత్యేకంగా వీటిని తీర్చిదిద్దారు.
ఈసారి ప్రత్యేకమైన కానుకలు
అంతేకాదు.. ఈ మెగా టోర్నీలో ఆఖరి వరకు అజేయంగా నిలిచిన జట్టు జైత్రయాత్రకు గుర్తుగా విజయాల సంఖ్యను కూడా ఈ డిజైన్‌లో చేర్చారు. ఇటీవల నమన్ అవార్డుల వేడుక సందర్భంగా రోహిత్ సేన(Rohit Sharma&Co)కు ఈ వజ్రపు ఉంగరాలను బోర్డు ఆటగాళ్లకు అందజేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
‘‘టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాళ్లను చాంపియన్స్ రింగ్‌తో సత్కరిస్తున్నాం. వజ్రాలు శాశ్వతమే కావచ్చు. అయితే, కోట్లాది మంది హృదయాల్లో వీరు సంపాదించిన స్థానం మాత్రం ఎన్నటికీ చెక్కుచెదరదు. అలాగే ఈ ఉంగరం కూడా అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అని బీసీసీఐ పేర్కొంది.
కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికలుగా గతేడాది పొట్టి ప్రపంచకప్ టోర్నీ జరిగిన విషయం తెలిసిందే. లీగ్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచిన రోహిత్ సేన.. సౌతాఫ్రికాతో ఫైనల్లోనూ జయభేరి మోగించింది. ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. ట్రోఫీని దక్కించుకుంది.
ఓవరాల్‌గా ఐదోసారి
తద్వారా దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి టీమిండియా ఖాతాలో ఐసీసీ టైటిల్ చేరింది. అదే విధంగా.. ఓవరాల్‌గా ఐదో ట్రోఫీ భారత్ కైవసమైంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తొట్టతొలి ప్రపంచకప్(వన్డే) గెలిచిన టీమిండియా.. 2007లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్ సొంతం చేసుకుంది.
ఆ తర్వాత మళ్లీ ధోని నాయకత్వంలోనే 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీని భారత్ దక్కించుకుంది. ఇక గతేడాది రోహిత్ శర్మ కూడా ఈ ఐసీసీ విన్నింగ్ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు.
ఇక టీ20 ప్రపంచకప్-2024లో గెలిచిన అనంతరం బీసీసీఐ రోహిత్ సేనకు అత్యంత భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. కళ్లు చెదిరే రీతిలో ఏకంగా రూ. 125 కోట్ల క్యాష్ ప్రైజ్‌ను కానుకగా ఇచ్చింది. నాడు ఇలా ఆటగాళ్లపై కనకవర్షం కురిపించిన బోర్డు.. తాజాగా వజ్రపు ఉంగరాలతో మరోసారి ఘనంగా సత్కరించింది.
టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులోని సభ్యులు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, సంజు శాంసన్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్.
చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్
Presenting #TeamIndia with their CHAMPIONS RING to honour their flawless campaign in the #T20WorldCup 🏆
Diamonds may be forever, but this win certainly is immortalised in a billion hearts. These memories will 'Ring' loud and live with us forever ✨#NamanAwards pic.twitter.com/SKK9gkq4JR— BCCI (@BCCI) February 7, 2025
Comments
Please login to add a commentAdd a comment