WPL 2025: దంచికొట్టిన హర్మన్‌.. ధనాధన్‌ హాఫ్‌ సెంచరీ | WPL 2025 MI vs GG Harmanpreet Kaur 50 Helps Mumbai To Score 179 | Sakshi
Sakshi News home page

WPL 2025: దంచికొట్టిన హర్మన్‌.. ధనాధన్‌ హాఫ్‌ సెంచరీ

Published Mon, Mar 10 2025 9:29 PM | Last Updated on Mon, Mar 10 2025 9:29 PM

WPL 2025 MI vs GG Harmanpreet Kaur 50 Helps Mumbai To Score 179

PC: WPL

మహిళల ప్రీమియర్‌ లీగ్‌(WPL)లో ఫైనల్‌ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముంబై ఇండియన్స్‌.. గుజరాత్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మెరుగైన స్కోరు సాధించింది. ముంబైలోని బ్రబౌర్న్‌  స్టేడియంలో సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందాన్ని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

హర్మన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
ముంబై ఓపెనర్లలో అమెలియా కౌర్‌(5) విఫలం కాగా.. మరో ఓపెనర్‌ హేలీ మాథ్యూస్‌(27) ఫర్వాలేదనిపించింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నాట్‌ సీవర్‌-బ్రంట్‌ 38 పరుగులతో రాణించగా.. హర్మన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. కేవలం 33 బంతుల్లోనే 6 ఫోర్ల సాయంతో 54 పరుగులు రాబట్టింది.

మిగతా వాళ్లలో అమన్‌జ్యోత్‌ కౌర్‌(15 బంతుల్లో 27) దంచికొట్టగా.. సజీవన్‌ సంజన మెరుపు(6 బంతుల్లో 11, నాటౌట్‌)లు మెరిపించింది. ఆఖర్లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ యస్తికా భాటియా 4 బంతుల్లోనే 13 పరుగులతో దుమ్ములేపింది. ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో ముంబై ఇండియన్స్‌ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు స్కోరు చేసింది.

ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారు
గుజరాత్‌ జెయింట్స్‌ బౌలర్లలో తనూజ కన్వార్‌, కశ్వీ గౌతం, ప్రియా మిశ్రా, కెప్టెన్‌ ఆష్లే గార్డ్‌నర్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. WPL-2025లో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. 

ఎనిమిదింట ఐదు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌ పది పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. గుజరాత్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ చెరో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించి.. ఢిల్లీతో కలిసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి.

టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు
అయితే, పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడతాయి. అయితే, లీగ్‌ దశలో గుజరాత్‌కు తాజా మ్యాచ్‌ రూపంలో ఒకే మ్యాచ్‌ మిగిలి ఉండగా.. ముంబైకి గుజరాత్‌తో పాటు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ కూడా మిగిలే ఉంది.

ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్‌ను.. తదుపరి మంగళవారం బెంగళూరును ఓడిస్తే పన్నెండు పాయింట్లతో నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. అందుకే గుజరాత్‌ను ఓడించి.. ఆ తర్వాత బెంగళూరు జట్టు పనిపట్టాలని హర్మన్‌సేన పట్టుదలగా ఉంది. ఇక ముంబై ఇండియన్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఫలితాన్ని బట్టి గుజరాత్‌ భవితవ్యం తేలిపోనుంది.

డబ్ల్యూపీఎల్‌-2025: ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ గుజరాత్‌ జెయింట్స్‌
తుదిజట్లు
ముంబై ఇండియన్స్‌:
హేలీ మాథ్యూస్‌, యస్తికా భాటియా(వికెట్‌ కీపర్‌), నాట్‌ సీవర్‌- బ్రంట్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), అమేలియా కర్‌, సజీవన సంజన, జి.కమలిని, అమన్‌జోత్‌ కౌర్‌, సంస్కృతి గుప్తా, షబ్నం ఇస్మాయిల్‌, పరుణిక సిసోడియా

గుజరాత్‌ జెయింట్స్‌
బెత్‌ మూనీ(వికెట్‌ కీపర్‌), హర్లిన్‌ డియోల్‌, ఆష్లే గార్డ్‌నర్‌(కెప్టెన్‌), డియాండ్రా డాటిన్‌, కశ్వీ గౌతం, సిమ్రన్‌ షేక్‌, ఫోబే లిచ్‌ఫీల్డ్‌, భార్తి ఫల్మాలి, తనుజ కన్వార్‌, మేఘనా సింగ్‌, ప్రియా మిశ్రా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement