
లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై జరిమానా పడింది. గురువారం యూపీ వారియర్స్‌తో మ్యాచ్ సందర్భంగా అంపైర్‌తో వాదనకు దిగినందుకు హర్మన్‌ప్రీత్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పడింది. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ ముగిసిన సమయంలో అంపైర్ అజితేశ్ అర్గాల్... సర్కిల్ బయట ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉంచాలని హర్మన్‌ప్రీత్‌కు సూచించాడు.
స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడినందుకు గానూ చివరి ఓవర్‌లో బౌండరీ సమీపంలో నలుగురు ఫీల్డర్లను మోహరించే అవకాశం లేదని హర్మన్‌కు వివరించాడు. దీంతో అంపైర్‌తో ముంబై సారథి వాగ్వాదానికి దిగింది. ఆల్‌రౌండర్ అమెలియా కెర్ కూడా హర్మన్‌కు వంతపాడింది. దీంతో ఈ ఘటనపై రిఫరీ క్రమశిక్షణ చర్యలకు పూనుకున్నాడు.
‘హర్మన్‌ప్రీత్ లెవల్–1 తప్పిదానికి పాల్పడింది. నియమావళిలోని 2.8 ఆర్టికల్ ప్రకారం అంపైర్లతో వాగ్వాదానికి దిగడం, అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించడతో మ్యాచ్‌లో ఫీజులో 10 శాతం జరిమానా విధించాం’ అని డబ్ల్యూపీఎల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. యూపీ వారియర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి ప్లేయర్ సోఫీ ఎకిల్‌స్టోన్‌తోనూ హర్మన్‌ప్రీత్ వాదనకు దిగింది. కాగా... ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ‘ప్లే ఆఫ్స్’కు చేరువైంది.
చదవండి: CT 2025: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే?