![WPL 2025 MIW Vs GGTW: Mumbai Bowlers Shine Gujarat 120 All Out](/styles/webp/s3/article_images/2025/02/18/GGvsMI1.jpg.webp?itok=fBK81Fu1)
ముంబై ఇండియన్స్ వుమెన్(Mumbai Indians Women)తో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ వుమెన్(Gujarat Giants Women) బ్యాటర్లు విఫలమయ్యారు. టాపార్డర్ కుప్పకూలడంతో గుజరాత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. మహిళల ప్రీమియర్ లీగ్-2025(WPL) ఎడిషన్‌లో భాగంగా ముంబై- గుజరాత్ మధ్య మ్యాచ్‌కు వడోదర ఆతిథ్యమిస్తోంది.
కొటాంబి స్టేడియంలో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన గుజరాత్ జెయింట్స్.. ముంబై జట్టు ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు బెత్ మూనీ(1), లారా వొల్వర్ట్(4) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ దయాళన్ హేమలత(9), నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ ఆష్లీ గార్డనర్(10) కూడా నిరాశపరిచారు.
ఆదుకున్న హర్లీన్ డియోల్
ఈ క్రమంలో హర్లీన్ డియోల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. 31 బంతుల్లో 32 పరుగులు చేసిన హర్లీన్ అమన్‌జోత్ కౌర్ బౌలింగ్‌లో హేలీ మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. మిగతావాళ్లలో హార్డ్ హిట్టర్‌గా పేరొందిన డియాండ్రా డాటిన్ ఏడు పరుగులకే నిష్క్రమించగా.. కశ్వీ గౌతమ్ 20 పరుగులతో ఫర్వాలేదనిపించింది.
హేలీ మాథ్యూస్‌కు మూడు వికెట్లు
ఇక లోయర్ ఆర్డర్‌లో సిమ్రన్ షేక్ 3, తనూజా కన్వర్ 13, సయాలీ సత్‌ఘరే 13(నాటౌట్), ప్రియా మిశ్రా(2) పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో 120 పరుగులు చేసిన గుజరాత్ ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో స్పిన్నర్ హేలీ మాథ్యూస్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రైటార్మ్ మీడియం పేసర్ నట్ సీవర్- బ్రంట్, అమేలియా కెర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షబ్నం ఇస్మాయిల్, అమన్‌జోత్ కౌర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
తొలి గెలుపు కోసం
కాగా ఫిబ్రవరి 14న డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ మొదలైన విషయం తెలిసిందే. తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వుమెన్ జట్టు ఎదుర్కొన్న గుజరాత్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడగా.. రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
అనంతరం యూపీ వారియర్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి గెలుపుబాట పట్టిన గుజరాత్ జెయింట్స్.. తాజా మ్యాచ్‌లో ముంబై బౌలర్ల ధాటికి నామమాత్రపు స్కోరు చేసింది. ఇక సీజన్‌లో తొలి గెలుపు కోసం ఎదురుచూస్తున్న ముంబై.. విజయమే లక్ష్యంగా మంగళవారం నాటి మ్యాచ్ బరిలో దిగింది. కాగా 2023లో డబ్ల్యూపీఎల్ మొదలుకాగా.. అరంగేట్ర చాంపియన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ సేన(ముంబై) నిలిచిన విషయం తెలిసిందే. ఇక గతేడాది స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ టైటిల్ గెలిచింది.
డబ్ల్యూపీఎల్-2025: గుజరాత్ జెయింట్స్ వుమెన్ వర్సెస్ ముంబై వుమెన్ తుదిజట్లు
గుజరాత్ జట్టు
లారా వోల్వార్ట్, బెత్ మూనీ(వికెట్ కీపర్), దయాళన్ హేమలత, ఆష్లీ గార్డనర్(కెప్టెన్), హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సిమ్రాన్ షేక్, తనూజా కన్వర్, సయాలీ సత్‌ఘరే, కశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా.
ముంబై జట్టు
యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జి.కమలిని, అమేలియా కెర్, సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, షబ్నమ్ ఇస్మాయిల్, పరుణిక సిసోడియా.
Comments
Please login to add a commentAdd a comment