
వరుసగా మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పరాజయం
గుజరాత్ జెయింట్స్‌కు కీలక విజయం
6 వికెట్లతో ఆర్‌సీబీపై గెలుపు
రాణించిన కెప్టెన్ ఆష్లీ గార్డ్‌నర్
బెంగళూరు: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. వడోదర వేదికగా తొలి రెండు మ్యాచ్‌లు ఆడి విజయాలు అందుకున్న ఆర్‌సీబీ... ఆపై సొంత మైదానానికి వచ్చిన తర్వాత ఒక్క గెలుపూ సాధించలేదు. తాజాగా గురువారం జట్టు ఖాతాలో వరుసగా మూడో పరాజయం చేరింది.
మరోవైపు ఈ పోరుకు ముందు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటే గెలిచి పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ జెయింట్స్ ఖాతాలో రెండో విజయం చేరింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
కనిక అహుజా (28 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా...రాఘ్వీ బిస్త్ (19 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), జార్జియా వేర్‌హామ్ (21 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో తనూజ కన్వర్, డాటిన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం గుజరాత్ 16.3 ఓవర్లలో 4 వికెట్లకు 126 పరుగులు సాధించింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్‌నర్ (31 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో కదం తొక్కగా... ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (21 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడింది.
ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో ఏ స్థాయిలోనూ ధాటి కనిపించలేదు. టాప్–3 బ్యాటర్లలో స్మృతి మంధాన (10), డానీ వ్యాట్ (4) విఫలం కాగా... ఎలైస్ పెరీ (4 బంతుల్లో 0) డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి డకౌటైంది. నాలుగో వికెట్‌కు కనిక, రాఘ్వీ 37 బంతుల్లో 48 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ కూడా కాస్త తడబడింది. హేమలత (15 బంతుల్లో 11; 2 ఫోర్లు), బెత్ మూనీ (20 బంతుల్లో 17; 2 ఫోర్లు), హర్లీన్ డియోల్ (10 బంతుల్లో 5) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు.
అయితే ఆ్రస్టేలియా క్రికెటర్లయిన గార్డ్‌నర్, లిచ్‌ఫీల్డ్ భాగస్వామ్యంలో జట్టు గెలుపు దిశగా సాగింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 36 బంతుల్లో 51 పరుగులు జత చేశారు. ప్రేమ రావత్ ఓవర్లో గార్డ్‌నర్ వరుస బంతుల్లో 4, 4, 4, 6 బాదడం ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) హర్లీన్ (బి) తనూజ 10; డానీ వ్యాట్ (ఎల్బీ) (బి) డాటిన్ 4; పెరీ (సి) తనూజ (బి) గార్డ్‌నర్ 0; రాఘ్వీ (రనౌట్) 22; కనిక (సి అండ్ బి) తనూజ 33; రిచా (బి) కాశ్వీ 9; వేర్‌హామ్ (నాటౌట్) 20; గార్త్ (సి) మూనీ (బి) డాటిన్ 14; స్నేహ్ రాణా (నాటౌట్) 1; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–6, 2–16, 3–25, 4–73, 5–78, 6–99, 7–122. బౌలింగ్: డాటిన్ 4–0–31–2, ఆష్లీ గార్డ్‌నర్ 4–0–22–1, కాశ్వీ గౌతమ్ 4–0–17–1, తనూజ 4–0–16–2, హేమలత 1–0–4–0, ప్రియా మిశ్రా 1–0–18–0, మేఘన 2–0–12–0.
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) వేర్‌హామ్ (బి) రేణుక 17; హేమలత (స్టంప్డ్) రిచా (బి) రేణుక 11; హర్లీన్ (సి) పెరీ (బి) వేర్‌హామ్ 5; గార్డ్‌నర్ (సి అండ్ బి) వేర్‌హామ్ 58; లిచ్‌ఫీల్డ్ (నాటౌట్) 30; డాటిన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.3 ఓవర్లలో 4 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–25, 2–32, 3–66, 4–117. బౌలింగ్: రేణుకా సింగ్ 4–0–24–2, కిమ్ గార్త్ 2–3.–0–19–0, స్నేహ్ రాణా 4–0–23–0, ప్రేమ రావత్ 1–0–19–0, వేర్‌హామ్ 3–0–26–2, ఎలైస్ పెరీ 1–0–7–0, కనిక 1–0–7–0.
డబ్ల్యూపీఎల్‌లో నేడు
ఢిల్లీ క్యాపిటల్స్ X ముంబై ఇండియన్స్
రాత్రి గం. 7:30 స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment