
జి.కమలిని (PC: MI X)
అండర్-19 టీమిండియా స్టార్ క్రికెటర్ జి.కమలిని(G Kamalini) సరికొత్త రికార్డు సాధించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్(WPL) చరిత్రలో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్‌గా నిలిచింది. గుజరాత్ జెయింట్స్ వుమెన్‌తో మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ వుమెన్ తరఫున ఈ తమిళనాడు క్రికెటర్ మంగళవారం(ఫిబ్రవరి 18) డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టింది.
ఓటమితో మొదలుపెట్టిన ముంబై
కాగా గత శుక్రవారం(ఫిబ్రవరి 14) డబ్ల్యూపీఎల్-2025 ఎడిషన్ మొదలైన విషయం తెలిసిందే. మూడో సీజన్‌లో తొలుత గుజరాత్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు జట్టు విజేతగా నిలవగా.. శనివారం నాటి మ్యాచ్‌లో ముంబై.. ఢిల్లీ కాప్యిటల్స్ చేతిలో ఓడిపోయింది.
అనంతరం ఆదివారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్- యూపీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ గెలుపొందింది. ఆ తర్వాత సోమవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ జట్టును ఎదుర్కొన్న బెంగళూరు టీమ్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్- ముంబై తలపడుతున్నాయి.
ఇద్దరు ప్లేయర్ల అరంగేట్రం
వడోదరలోని కొటాంబి స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ వుమెన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక టాస్ సందర్భంగా ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఇద్దరు ప్లేయర్లు అరంగేట్రం చేస్తున్నట్లు వెల్లడించింది. సైకా ఇసాక్ స్థానంలో పరుణిక సిసోడియా(Parunika Sisodia) జట్టులోకి వచ్చినట్లు తెలిపిన హర్మన్.. కమలినికి కూడా తుదిజట్టులో చోటు ఇచ్చినట్లు పేర్కొంది.
ఈ క్రమంలో కమలిని అత్యంత చిన్న వయసులో డబ్ల్యూపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్‌గా నిలిచింది. పదహారేళ్ల 213 రోజులు వయసులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మహిళల టీ20 లీగ్‌లో అడుగుపెట్టింది. ఇటీవల మలేషియా వేదికగా ముగిసిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులో కమలిని సభ్యురాలు.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన కమిలిని ఈ మెగా టోర్నమెంట్లో రెండు అర్ధశతకాలతో మెరిసింది. మరోవైపు.. పరుణిక సిసోడియా కూడా వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో మెంబర్. టోర్నీ మొత్తంలో కలిపి పది వికెట్లు కూల్చి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఇక ఈ ఇద్దరు ఒకే జట్టు తరఫున డబ్ల్యూపీఎల్‌లో ఒకేసారి అరంగేట్రం చేయడం విశేషం.
డబ్ల్యూపీఎల్‌లో చిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్లు
👉జి.కమలిని(ముంబై ఇండియన్స్)- 16 ఏళ్ల 213 రోజుల వయసులో- గుజరాత్ జెయింట్స్ మీద అరంగేట్రం- 2025
👉షబ్నం షకీల్(గుజరాత్ జెయింట్స్)- 16 ఏళ్ల 263 రోజుల వయసులో ఆర్సీబీ మీద అరంగేట్రం- 2024
👉పార్శవి చోప్రా(యూపీ వారియర్స్)- 16 ఏళ్ల 312 రోజుల వయసులో ముంబై ఇండియన్స్ మీద- 2023
👉వీజే జోషిత(ఆర్సీబీ)- 18 ఏళ్ల 205 రోజుల వయసులో గుజరాత్ జెయింట్స్ మీద అరంగేట్రం-2025
👉అలిస్ కాప్సే(ఢిల్లీ క్యాపిటల్స్)- 18 ఏళ్ల 206 రోజుల వయసులో ఆర్సీబీ మీద అరంగేట్రం- 2023.
డబ్ల్యూపీఎల్-2025: గుజరాత్ వర్సెస్ ముంబై తుదిజట్లు
ముంబై
యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జి.కమలిని, అమేలియా కెర్, సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, షబ్నమ్ ఇస్మాయిల్, పరుణిక సిసోడియా.
గుజరాత్
లారా వోల్వార్ట్, బెత్ మూనీ(వికెట్ కీపర్), దయాళన్ హేమలత, ఆష్లీ గార్డనర్(కెప్టెన్), హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సిమ్రాన్ షేక్, తనూజా కన్వర్, సయాలీ సత్‌ఘరే, కశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా.
చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment