Is There Jay Shah Hand Behind Hardik Promotion As Team India Captain - Sakshi
Sakshi News home page

రోహిత్‌ మెడపై కత్తి పెట్టి, హార్ధిక్‌కు పట్టం కట్టి.. వీటన్నిటి వెనక జై షా ఉన్నాడా..?

Published Sat, Nov 19 2022 12:14 PM | Last Updated on Sat, Nov 19 2022 2:37 PM

Is There Jay Shah Hand Behind Hardik Promotion As Team India Captain - Sakshi

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా బీసీసీఐలోకి అడుగుపెట్టాక అనూహ్య మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం గంగూలీతో పాటు బీసీసీఐ కార్యవర్గంలో చేరిన షా.. నాటి నుంచే చక్రం తిప్పడం ప్రారంభించాడు. 2020లో బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన షా.. తనకున్న రాజకీయ అండదండలతో బీసీసీఐని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడంతో పాటు బోర్డు కీలక నిర్ణయాల్లో తన మార్కు ఉండేలా అధ్యక్షుడు (గంగూలీ) సహా సభ్యులందరినీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు.

రవిశాస్త్రి, కోహ్లిల హవాకు చెక్‌..
షా బాధ్యతలు చేపట్టడానికి ముందు బీసీసీఐలో నాటి టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ కోహ్లి హవా కొనసాగేది. బోర్డు ప్రతి నిర్ణయంలో వీరి పాత్ర కీలకంగా ఉండేది. అయితే షా ఎంట్రీతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బోర్డు కీలక నిర్ణయాల్లో రవిశాస్త్రి, కోహ్లిల ప్రమేయాన్ని సహించని షా.. వారిద్దరికి చెక్‌ పెట్టడం ప్రారంభించాడు. ప్లాన్‌లో భాగంగానే  రవిశాస్త్రి, కోహ్లిలను క్రమక్రమంగా తమ బాధ్యతలకు దూరం చేశాడు. ఇందుకు గంగూలీని పావుగా వాడుకున్న షా.. కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి బీసీసీఐ బాస్‌కు కెప్టెన్‌ను మధ్య ఉన్న విభేదాలే కారణమని అందరూ నమ్మేలా వాతావరణాన్ని క్రియేట్‌ చేశాడు.

రోహిత్‌ను కెప్టెన్‌ చేయడంలోనూ షా మార్కు..
అనంతరం రోహిత్‌ శర్మ టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంలోనూ చక్రం తిప్పిన షా.. బీసీసీఐపై తన మార్కును మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు.

గంగూలీతో విభేదాలకు బీజం అక్కడే..
ఆతర్వాత కొన్ని రోజుల వరకు అన్నీ బాగానే జరిగినప్పటికీ.. గంగూలీ బెంగాల్‌ రాజకీయాలకు నో చెప్పడం, రెండోసారి బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టాలని కోరుకోవడం షాకు అస్సలు సహించలేదు. వీరిద్దరి మధ్య బయటకు కనిపించని విభేదాలకు ఇక్కడే బీజం పడింది.

గంగూలీని ఐసీసీ అధ్యక్ష పదవి బరిలో నిలిపి, తాను బీసీసీఐ బాస్‌ అవ్వాలని భావించిన షా.. గంగూలీ తిరగబడటంతో ప్లాన్‌-బిని అమలు చేసి, తన కంట్రోల్‌లో ఉండే రోజర్‌ బిన్నీ పేరును ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా తెరపైకి తెచ్చాడు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల బోర్డు పెద్దలను ఒప్పించి బీసీసీఐ బాస్‌గా బిన్నీకి పట్టం కట్టాడు. షా ఉద్దేశం బయటపడటంతో, అప్పటి దాకా ఐసీసీ బరిలో నిలవాలని భావించిన గంగూలీ మెల్లగా ఆ రేసు నుంచి కూడా తప్పుకున్నాడు.

సెలెక్షన్‌ కమిటీపై వేటు.. రోహిత్‌ మెడపై కత్తి
ఇదంతా ఒక ఎపిసోడ్‌ అయితే, తాజాగా చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీని సమాచారం కూడా లేకుండా అవమానకర రీతిలో తప్పించడం, టీ20ల్లో వైఫల్యాలను సాకుగా చూపి రోహిత్‌ శర్మ కెప్టెన్సీకి ఎసరు పెట్టడం వంటి కీలక పరిణామాలు చకచకా జరిపోయాయి.

జట్టు ఎంపికలో తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని, బీసీసీఐ కొత్త బాస్‌ బిన్నీతో సెలెక్టర్లపై వేటు వేయించిన షా.. పనిలో పనిగా మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు అనే అంశాన్ని తెరపైకి తెచ్చి తన రాష్ట్రానికి చెందిన హార్ధిక్‌ పాండ్యాకు టీ20 కెప్టెన్సీ పగ్గాలు కట్టపెట్టేందుకు సర్వం సిద్ధం చేశాడు. ప్లాన్‌లో భాగంగా అతి త్వరలో టీమిండియాలో భారీ మార్పులు బీజం వేశాడు. తనకు నచ్చని, తన మాట వినని సీనియర్లపై నిర్ధాక్షిణ్యంగా వేటు వేసేందుకు రూట్‌ మ్యాప్‌ కూడా సిద్ధం చేశాడని సమాచారం.

కెప్టెన్‌గా హార్ధిక్‌ ప్రమోషన్‌..
గత సీజన్‌లో గుజరాత్‌కు సంబంధించిన ఫ్రాంచైజీ ఐపీఎల్‌ అరంగేట్రం చేయడం, గుజరాత్‌కు చెందిన ఆటగాడే ఆ జట్టు కెప్టెన్‌ (హార్ధిక్‌) కావడం, ఏమాత్రం అంచనాలు లేని ఆ జట్టే ఛాంపియన్‌ కావడం, దీని ఆధారంగా కెప్టెన్‌గా పెద్దగా అనుభవం లేని హార్ధిక్‌ను టీమిండియా కెప్టెన్‌గా ప్రమోట్‌ చేస్తుండటం.. ఇవన్నీ అలా జరిగిపోయాయి/పోతున్నాయి. ఈ మొత్తం తంతులో షా పాత్ర ఉందని క్రికెట్‌ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

బీసీసీఐపై ఉన్న పట్టును సహించలేక కోచ్‌ రవిశాస్త్రిని, వైఖరి నచ్చక కోహ్లిని, రాజకీయ కారణాల (బెంగాల్‌కు సంబంధించినవి) చేత గంగూలీని, వైఫల్యాలను సాకుగా చూపి రోహిత్‌ను పదవులకు దూరం చేసిన షా.. ప్రస్తుతం హార్ధిక్‌ను టీమిండియా కెప్టెన్‌గా ప్రమోట్‌ చేయడంలో బిజీగా ఉన్నాడంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
చదవండి: దగా పడ్డ గంగూలీ.. ఐసీసీ పదవి కూడా లేనట్టే..!
    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement