అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా శకం టీ20 ప్రపంచకప్-2024తో ముగిసింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత ఈ ముగ్గురూ టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.
ఈ నేపథ్యంలో టీ20లలో భారత జట్టు కొత్త కెప్టెన్ ఎవరా అన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
తన దృష్టిలో టీమిండియాకు ముందుకు నడిపే సామర్థ్యం ఇద్దరు స్టార్లకు ఉందన్న ఈ మాజీ వికెట్ కీపర్.. కొత్త కోచ్ గౌతం గంభీర్, సెలక్టర్ల నిర్ణయం పైనే అంతా ఆధారపడి ఉందని పేర్కొన్నాడు.
ఈ మేరకు సబా కరీం మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు. ఇకపై అతడు టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట ఆడడు.
కాబట్టి అతడి వారసుడి ఎంపికపైనే ప్రస్తుతం అందరి దృష్టి పడింది. నా దృష్టిలో ఇద్దరికి ఆ అవకాశం ఉంది. లాజికల్‌గా చూస్తే హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌ను చేయాలి.
ఎందుకంటే టీ20 ప్రపంచకప్-2024లో అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించింది బోర్డు. గతంలోనూ రోహిత్ గైర్హాజరీలో అతడు సారథిగా వ్యవహరించాడు.
రానున్న రెండేళ్లలో మరోసారి టీమిండియా పొట్టి వరల్డ్‌కప్ ఆడనుంది. అప్పటికి పూర్తి స్థాయిలో జట్టు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా కెప్టెన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.
సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అతడు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు.
కచ్చితంగా అతడు కూడా టీమిండియా టీ20 కెప్టెన్‌గా సరైన ఆప్షనే అనిపిస్తాడు. వీరిద్దరిలో ఎవరిని సారథిని చేయాలన్న అంశంపై సెలక్టర్లు, కొత్త కోచ్ నిర్ణయం తీసుకుంటారు’’ అని పేర్కొన్నాడు. తానైతే ఇద్దరికీ కెప్టెన్ అయ్యే అర్హత ఉందని చెబుతానంటూ సబా కరీం సోనీ స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment