హార్ధిక్ పాండ్యాను భారత టీ20 జట్టు రెగ్యులర్ కెప్టెన్ చేసేందుకు పావులు వేగంగా కదులుతున్నాయని తెలుస్తుంది. కొత్త సెలెక్షన్ కమిటీ ఏర్పాటైన వెంటనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్-2024ను దృష్టిలో ఉంచుకుని హార్ధిక్‌ను ఇప్పటినుంచే కెప్టెన్‌గా ప్రమోట్ చేయాలని భావిస్తున్న బీసీసీఐ.. అతి త్వరలోనే హార్ధిక్‌కు టీ20 పగ్గాలు అప్పజెప్పనుందని బీసీసీఐకి చెందిన కీలక అధికారి వెల్లడించారు.
ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్ధిక్.. గత ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఆతర్వాత ఐర్లాండ్ పర్యటనలోనూ టీమిండియాను విజేతగా నిలిపాడు. ఈ సక్సెస్‌ను, ఇటీవలి కాలంలో అతని ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని బీసీసీఐ అతని పొట్టి క్రికెట్ పగ్గాలు కట్టబెట్టనుందని సమాచారం.
ఇదిలా ఉంటే, మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు అనే అంశాన్ని బీసీసీఐ కొత్తగా తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫార్ములాను అమలు చేయాల్సి వస్తే.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతల్లో మరింత కోత పడే అవకాశం ఉంది. ఇప్పటికే పొట్టి ఫార్మాట్‌లో హార్ధిక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తున్న బీసీసీఐ.. వన్డేలు, టెస్ట్‌లకు మరో ఇద్దరు కెప్టెన్లను నియమించాల్సి ఉంటుంది.
ఒకవేళ.. వయసు పైబడటం, ఇటీవలి కాలంలో ఫామ్‌ను సాకుగా చూపి రోహిత్‌ను వన్డే కెప్టెన్సీకి మాత్రమే పరిమతం చేయాలని బీసీసీఐ భావిస్తే.. టెస్ట్ కెప్టెన్ ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ పదవి రేసులో జస్ప్రీత్ బుమ్రా , పుజరా పేర్లు ప్రముఖంగా వినపడుతున్నప్పటికీ.. రిషబ్ పంత్ ఫ్యాన్స్ మాత్రం తమ ఫేవరెట్ ఆటగాడినే టెస్ట్ టీమ్ కెప్టెన్ చేయాలని డిమండ్ చేస్తున్నారు.
హార్ధిక్‌ను టీ20లకు కెప్టెన్‌ను చేసినప్పుడు, సుదీర్ఘ ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉన్న పంత్‌ను టెస్ట్ కెప్టెన్ చేయాలంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. టీమిండియా చివరగా ఆడిన టెస్ట్‌లో (ఇంగ్లండ్‌లో 5వ టెస్ట్) పంత్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (146), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (57) సాధించాడని, పంత్‌కు విదేశాల్లో మంచి ట్రాక్ రికార్డు ఉందని, ఐపీఎల్‌లో జట్టును (ఢిల్లీ క్యాపిటల్స్) విజయవంతంగా ముందుండి నడిపించిన అనుభవం కూడా ఉందని.. పంత్‌ను టెస్ట్ కెప్టెన్ చేయడానికి ఈ అర్హతలు చాలవా అని బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు.
మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు అనే అంశం వస్తే, పంత్‌కు తప్పక టెస్ట్ పగ్గాలు అప్పజెప్పాలని కోరుతున్నారు. కాగా, భారత టెస్ట్ జట్టులో సీనియర్లు, రెగ్యులర్ ఆటగాళ్లు అయిన కోహ్లి, జడేజాలు కెప్టెన్సీపై ఆసక్తి చూపకపోతే, కెప్టెన్సీ రేసులో మిగిలేది బుమ్రా, పుజారా, పంత్, అశ్విన్‌లు మాత్రమే. వీరిలో బుమ్రా తరుచూ గాయాల బారినపడుతుండటం, వయసు పైబడిన రిత్యా అశ్విన్‌కు అవకాశాలు తక్కువగా ఉండటం, ఇటీవలి కాలంలో పుజారా నిలకడలేమి సమస్యతో బాధపడుతుండటంతో టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు పంత్‌కే దక్కుతాయని అతని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.
చదవండి: రోహిత్ మెడపై కత్తి పెట్టి, హార్ధిక్‌కు పట్టం కట్టి.. ఇవన్నీ జై షా వ్యూహాలేనా..?
Comments
Please login to add a commentAdd a comment