Google AI Gives 3 Captaincy Options For India In Test Cricket As Rohit's Replacement - Sakshi
Sakshi News home page

#IndiaTest Captain: రోహిత్‌ తర్వాత టెస్టు కెప్టెన్‌ ఎవరు?.. గూగుల్‌ AI ఊహించని పేర్లు

Published Thu, Jun 15 2023 10:58 AM | Last Updated on Thu, Jun 15 2023 11:28 AM

Google-AI Give-3-Captaincy-Options-India-Test Cricket-Rohit-Replacement - Sakshi

నాలుగు విజయాలు.. రెండు ఓటములు.. ఒక డ్రా.. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన సిరీస్‌ల్లో ఫలితాలు. ఇంత మంచి రికార్డు ఉన్న రోహిత్‌కు ఇటీవలే ముగిసిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా మరోసారి రన్నరప్‌కే పరిమితం అవడం మింగుడుపడని అంశం.

విరాట్‌ కోహ్లి నుంచి కెప్టెన్సీ తీసుకున్న రోహిత్‌ టీమిండియాను టెస్టుల్లో నెంబర్‌వన్‌ పొజిషన్‌లో ఉంచినప్పటికి చాంపియన్‌గా నిలబెట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. ఆసీస్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన తర్వాత రోహిత్‌  కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. అయితే వయసు రిత్యా 36 ఏళ్లు ఉన్న రోహిత్‌ మరో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడతాడన్నది ఇప్పుడే చెప్పలేం.

2025లో జరిగే మూడో డబ్ల్యూటీసీ ఫైనల్‌ వరకు రోహిత్‌ వయస్సు 38కు చేరుకుంటుంది. ఇప్పుడే సరైన ఫిట్‌నెస్‌ లేక ఇబ్బంది పడుతున్న రోహిత్‌ అప్పటివరకు కొనసాగడం కష్టమే. ఒకవేళ ఆడినా అతను కెప్టెన్‌గా మాత్రం ఉండకపోవచ్చు. అందుకే రానున్న రెండేళ్లలో జరిగే టెస్టు సిరీస్‌లకు రోహిత్‌ కెప్టెన్‌గా ఉండకపోతే ఎవరు కెప్టెన్‌ కావాలనే విషయం అభిమానుల మదిలో ఉంది.

ఇప్పటికిప్పుడు ఇదే ప్రశ్న అభిమానులకు వేస్తే అందరినోటి నుంచి వచ్చే పేరు అజింక్యా రహానే.. కాదంటే రవీంద్ర జడేజా లేదా రవిచంద్రన్‌ అశ్విన్‌.  విరాట్‌ కోహ్లికి అవకాశం ఉన్నా అతను మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటాడా అంటే సందేహమే.  అయితే ఇవన్నీ పక్కనబెడితే.. రోహిత్‌ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ఎవరైతే బాగుంటుందని Google AI(గూగుల్‌ ఏఐ)ని అడిగితే ఎవరు ఊహించని పేర్లు వెల్లడించింది.

తొలి ఆప్షన్‌ కేఎల్‌ రాహుల్‌


గూగుల్‌ ఏఐ తన తొలి ఆప్షన్‌గా కేఎల్‌ రాహుల్‌ పేరు వెల్లడించింది. అయితే కేఎల్‌ రాహుల్‌ ఇదివరకే టీమిండియాకు కెప్టెన్‌గా పనిచేశాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ నేతృత్వం వహించగా.. ఆ సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది. వైస్‌కెప్టెన్‌ హోదాలోనూ పనిచేసిన టీమిండియా పేలవ ఫామ్‌తో ప్రస్తుతం జట్టులోనే చోటు కోల్పోయాడు. మోకాలి సర్జరీ కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్‌ రాహుల్‌ ఎప్పుడు వస్తాడన్నది క్లారిటీ లేదు. అయితే వయసు ప్రాతిపాదికన కేఎల్‌ రాహుల్‌ పేరును ఏంచుకున్నట్లు తెలిసింది.

''కొన్నేళ్లుగా కేఎల్‌ రాహుల్‌ టీమిండియాలో ప్రధాన బ్యాటర్‌గా ఉన్నాడు. ఎలాంటి కండీషన్స్‌లోనైనా బ్యాటింగ్‌ చేయగల సమర్థుడు.. మంచి ఫీల్డర్‌ కూడా. డొమెస్టిక్‌ క్రికెట్‌లో కర్నాటక, ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌(ప్రస్తుతం) కెప్టెన్‌గా పనిచేశాడు. ఫామ్‌లోకి వస్తే అతన్ని ఆపడం కష్టం. భవిష్యత్తు టెస్టు క్రికెట్‌లో అతని అనుభవం టీమిండియాకు అవసరం.. అందుకే కేఎల్‌ రాహుల్‌ తొలి ఆప్షన్‌ అంటూ'' గూగుల్‌ ఏఐ తెలిపింది..

రెండో ఆప్షన్‌ రిషబ్‌ పంత్‌..


గూగుల్‌ ఏఐ తన రెండో ఆప్షన్‌గా టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ను ఎంచుకుంది. అయితే గతేడాది డిసెంబర్‌లో పంత్‌ ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్న పంత్‌ ఈ ఏడాది క్రికెట్‌ ఆడే అవకాశం తక్కువే. అయితే గతంలో టి20ల్లో టీమిండియా కెప్టెన్‌గా పనిచేసిన పంత్‌.. మూడు ఫార్మాట్లలోనే కీలక బ్యాటర్‌గా ఉన్నాడు.

''పంత్‌ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ క్రికెటర్‌. వికెట్‌కీపర్‌ అయిన పంత్‌ షార్ట్‌ ఫార్మాట్‌లో తన లీడర్‌షిప్‌ క్వాలిటీని మనకు పరిచయం చేశాడు. డొమొస్టిక్‌ క్రికెట్‌లో ఢిల్లీ, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా పనిచేసిన పంత్‌ టీమిండియాకు కూడ పలు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. నా దృష్టిలో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా పంత్‌ కంటే బెటర్‌ చాయిస్‌ ఇంకోటి లేదు'' అని గూగుల్‌ ఏఐ వివరించింది.

మూడో ఆప్షన్‌గా శుబ్‌మన్‌ గిల్‌


ఇటీవలి కాలంలో సంచలన ప్రదర్శన ఇస్తున్న శుబ్‌మన్‌ గిల్‌ను గూగుల్‌ ఏఐ మూడో ఆప్షన్‌గా ఏంచుకుంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన గిల్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమయ్యాడు. కానీ అతన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ''మంచి బ్యాటింగ్‌ టెక్నిక్‌ కలిగిన గిల్‌ టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా సమర్థుడని నాకు అనిపిస్తుంది'' అంటూ గూగుల్‌ ఏఐ తెలిపింది. 

చదవండి: 'బూడిద' కోసం 141 ఏళ్లుగా.. 'యాషెస్‌' పదం ఎలా వచ్చిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement