![CWC 2023 IND VS NED: 5 Indian Batters Scored 50 Plus Scores, First Time In 48 Year World Cup History - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/12/Untitled-7.jpg.webp?itok=VdIWtZ9e)
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 48 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని అరుదైన ఘనతను ఇవాల్టి మ్యాచ్‌లో సాధించింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు భారత బ్యాటర్లు (రోహిత్, గిల్, విరాట్, శ్రేయస్ రాహుల్) 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేశారు.
వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు టీమిండియా బ్యాటర్లు హాఫ్ సెంచరీలు, ఇద్దరు సెంచరీలు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో 50 ప్లస్ స్కోర్లు సాధించిన వారు టాప్-5 బ్యాటర్లు కావడం మరో విశేషం.
గతంలో వరల్డ్‌కప్‌యేతర మ్యాచ్‌ల్లో మూడు సార్లు ఐదుగురు బ్యాటర్లు 50 ప్లస్ స్కోర్లు సాధించారు. 2008లో (కరాచీ) జింబాబ్వేతో జరిగిన ఓ వన్డేలో ఐదుగురు పాక్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సాధించారు. అలాగే 2013, 2020ల్లో జరిగిన మ్యాచ్‌ల్లో (జైపూర్, సిడ్నీ) భారత్‌పై ఐదుగురు ఆసీస్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలు స్కోర్ చేశారు.
కాగా, నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment