
వచ్చే వరల్డ్ కప్ ఆడటంపై రోహిత్ స్పందన
మా విజయాలు అసాధారణం
జట్టు స్థాయిని చూపించామన్న కెప్టెన్
దుబాయ్: వరుసగా గత మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరిన భారత జట్టు రెండు టైటిల్స్ నెగ్గి మరో దాంట్లో రన్నరప్‌గా నిలిచింది. ఈ మూడు టోర్నీలు కలిపి 24 మ్యాచ్‌లు ఆడితే ఒక్క వరల్డ్ కప్ ఫైనల్ మినహా మిగతా 23 మ్యాచ్‌లు గెలిచింది. వరుసగా టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ట్రోఫీని సాధించింది. ఇది అసాధారణ ఘనత అని, తమ జట్టు స్థాయిని ప్రదర్శించామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
‘నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద ఘనత. మా టీమ్ ఎంత బలంగా ఉందో ఇది చూపించింది. ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు వారి మధ్య చక్కటి సమన్వయం, బయటి అంశాలను పట్టించుకోకుండా ఒత్తిడిని అధిగమించి ఇలాంటి విజయాలు సాధించడం అసాధారణం. విజయం సాధించాలనే ఒకే ఒక లక్ష్యంతో అందరూ పని చేశారు’ అని రోహిత్ అన్నాడు. వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు సాధించడం అంత సులువైన విషయం కాదని, దాని వెనక చాలా శ్రమ ఉందని అతను చెప్పాడు.
‘చాలా తక్కువ జట్లు మాత్రమే ఓటమి లేకుండా వరుసగా రెండు ట్రోఫీలు గెలిచాయి. అన్నీ మా వ్యూహాల ప్రకారమే ఆడి సఫలమయ్యాం. వన్డే వరల్డ్ కప్‌లో చాలా అద్భుతంగా ఆడిన తర్వాత కూడా ఫైనల్లో ఓడాం. ఇదే విషయాన్ని కుర్రాళ్లకు చెబుతూ గత రెండు ఫైనల్స్‌కు ముందు చివరి బంతి పడే వరకు పోరాడమని స్ఫూర్తి నింపాం. ఇదే ఫలితాన్ని అందించింది’ అని రోహిత్ వెల్లడించాడు. తమ తుది జట్టులో వైవిధ్యమైన ఆటగాళ్లు ఉండటం విజయానికి కారణమని కూడా అతను విశ్లేషించాడు.
‘1 నుంచి 11వ నంబర్ ఆటగాడి వరకు ఏదో ఒక రూపంలో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ సమష్టితత్వంతో పాటు గెలవాలనే కసి కూడా వారిలో కనిపించింది’ అని రోహిత్ వివరించాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడే విషయంపై తాను ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్య చేయనని, ప్రస్తుతానికి తాజా విజయాలను ఆస్వాదిస్తున్నట్లు రోహిత్ స్పష్టం చేశాడు. ఈ ఫార్మాట్ నుంచి తాను రిటైర్ కావడం లేదని ఆదివారమే మ్యాచ్ అనంతరం అతను వెల్లడించాడు.
‘ప్రస్తుతం అంతా బాగుంది. భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం అప్పుడే లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతానా లేదా అని ఇప్పుడే చెప్పను. దీని గురించి ఈ సమయంలో మాట్లాడటం అనవసరం. నా కెరీర్‌లో ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లాను. మున్ముందు ఏం జరుగుతుందో ఎప్పుడూ ఆలోచించలేదు. నా సహచరులతో కలిసి క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాను. అది చాలు’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment