కోహ్లి మళ్లీ ఫెయిల్‌.. నితీశ్‌ రెడ్డి బౌలింగ్‌లో పంత్‌ క్లీన్‌బౌల్డ్‌! | Ind vs Ind A Practice Match After Scans Kohli Gone For 15, Pant Dismissed Cheaply | Sakshi
Sakshi News home page

కోహ్లి మళ్లీ ఫెయిల్‌.. నితీశ్‌ రెడ్డి బౌలింగ్‌లో పంత్‌ క్లీన్‌బౌల్డ్‌! జైస్వాల్‌ కూడా..

Published Fri, Nov 15 2024 12:44 PM | Last Updated on Fri, Nov 15 2024 2:17 PM

Ind vs Ind A Practice Match After Scans Kohli Gone For 15, Pant Dismissed Cheaply

ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మినహా ఇప్పటికే ప్రధాన ఆటగాళ్లంతా ఆసీస్‌లో అడుగుపెట్టారు. ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇక ఆసీస్‌తో సిరీస్‌కు సన్నాహకాల్లో భాగంగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రత్యేకంగా ఇండోర్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇండియా-‘ఎ’ జట్టుతో భారత ఆటగాళ్లు మూడు రోజుల పాటు(శుక్రవారం- ఆదివారం) ఇంట్రా- స్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. పెర్త్‌లోని పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్‌ స్టేడియం(WACA) ఇందుకు వేదిక. 

కేవలం పదిహేను పరుగులకే
అయితే, ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతి లేదని సమాచారం. ఇదిలా ఉంటే.. వార్మప్‌ మ్యాచ్‌లో శుక్రవారం నాటి తొలిరోజు ఆటలో భాగంగా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పేలవ ఫామ్‌ను కొనసాగించినట్లు సమాచారం. కేవలం పదిహేను పరుగులకే అతడు అవుట్‌ అయినట్లు తెలుస్తోంది. 

తనదైన శైలిలో చక్కగా ఆట మొదలుపెట్టి కవర్‌ డ్రైవ్‌లతో అలరించిన కోహ్లి.. తప్పుడు షాట్‌ సెలక్షన్‌తో వికెట్‌ పారేసుకున్నాడు. భారత పేసర్‌ ముకేశ్‌ కమార్‌ బౌలింగ్‌లో సెకండ్‌ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లి నిష్క్రమించాడు.

పంత్‌ క్లీన్‌బౌల్డ్‌
మరోవైపు.. రిషభ్‌ పంత్‌ సైతం తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. నితీశ్‌ రెడ్డి బౌలింగ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఇక ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ కూడా 16 పరుగులకే అవుటైనట్లు తెలుస్తోంది. ప్రముఖ జర్నలిస్టు ఒకరు పెర్త్‌ నుంచి ఈ మేరకు సోషల్‌ మీడియాలో అప్‌డేట్స్‌ షేర్‌ చేశారు.

కోహ్లికి గాయం?
ఇక వార్మప్‌ మ్యాచ్‌లో అవుటైన వెంటనే కోహ్లి, పంత్‌ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసేందుకు తిరిగి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. వార్మప్‌ మ్యాచ్‌కు ముందు కోహ్లి గాయపడినట్లు వార్తలు వచ్చాయి. స్కానింగ్‌ తర్వాత మళ్లీ అతడు మైదానంలో అడుగుపెట్టినట్లు ఆసీస్‌ మీడియా వెల్లడించింది. మరోవైపు.. మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ సైతం గాయం కారణంగా ఫీల్డ్‌ను వీడినట్లు సమాచారం.

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌ చేరాలంటే టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌లో రాణించడం తప్పనిసరి. ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు గెలిస్తేనే టైటిల్‌ పోరుకు రోహిత్‌ సేన అర్హత సాధిస్తుంది. 

స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాభవం
అయితే, ఆస్ట్రేలియా పర్యటనకు ముందు స్వదేశంలో టీమిండియాకు న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై తొలిసారిగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు క్లీన్‌స్వీప్‌నకు గురైంది.

ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన పరుగులు 0, 70, 1, 17, 4, 1. ఇక నవంబరు 22 నుంచి పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్‌ మొదలుకానుంది. ఇక టీమిండియా కంటే ముందు ఆసీస్‌లో అడుగుపెట్టిన ఇండియా-‘ఎ’ అనధికారిక టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్‌ అయింది.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్‌), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్‌ దీప్, ప్రసిద్‌ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.

చదవండి: భారత క్రికెట్‌లో సంచలనం.. ఒకే ఇన్నింగ్స్​లో 10 వికెట్లు! 39 ఏళ్ల తర్వాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement