BGT: పంత్‌ కాదు!.. అతడే కొత్త రాజు అంటున్న ఆస్ట్రేలియా మీడియా! | Ind vs Aus Kohli Dominates In Australian Newspapers Jaiswal As Navam Raja | Sakshi
Sakshi News home page

BGT: పంత్‌ కాదు!.. అతడే కొత్త రాజు అంటున్న ఆస్ట్రేలియా మీడియా!

Published Tue, Nov 12 2024 12:34 PM | Last Updated on Tue, Nov 12 2024 1:12 PM

Ind vs Aus Kohli Dominates In Australian Newspapers Jaiswal As Navam Raja

టీమిండియా క్రికెటర్‌, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అతడికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎనభై సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లి.. మరెన్నో అరుదైన ఘనతలతో రికార్డుల రారాజుగా గుర్తింపు పొందాడు.

సొంతగడ్డపై పూర్తిగా విఫలమై
అయితే, గత కొంతకాలంగా టెస్టుల్లో మాత్రం విరాట్‌ కోహ్లి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి ఒకే అర్ధ శతకం నమోదు చేయడం అతడి ఫామ్‌లేమి నిదర్శనం.

ఆసీస్‌ మీడియా దృష్టి మొత్తం అతడి మీదే! 
ఇలాంటి తరుణంలో టీమిండియా తదుపరి ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఆడేందుకు వెళ్లనుండటంతో.. అందరి దృష్టి కోహ్లిపైనే నిలిచింది. ఆసీస్‌పై మంచి రికార్డు ఉన్న ఈ ఢిల్లీ బ్యాటర్‌ అంటే కంగారూ బౌలర్లకూ వణుకే! అందుకే ప్రస్తుతం కోహ్లి ఫామ్‌ సంగతి ఎలా ఉన్నా ఆస్ట్రేలియా మీడియాలో మాత్రం అతడే హైలైట్‌గా నిలుస్తున్నాడు.

తరతరాల పోరాటం
ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ నేపథ్యంలో ఆస్ట్రేలియా వార్త పత్రికలు కోహ్లి గణాంకాలను విశ్లేషిస్తూ.. అతడి చిత్రాలను కవర్‌పేజీలపై ప్రముఖంగా ప్రచురించడం విశేషం. అంతేకాదు.. ఆసీస్‌- భారత్‌ టెస్టు పోరును హైలైట్‌ చేస్తూ హిందీ, పంజాబీ భాషల్లో.. ‘‘తరతరాల పోరాటం’’ అంటూ హెడ్‌లైన్స్‌ ఇచ్చాయి.

ఇక కోహ్లికి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఆసీస్‌ మీడియా అతడిని ఇలా హైలైట్‌ చేయడంలో ఆశ్చర్యమేమీలేదు. అయితే, ఈసారి కోహ్లితో పాటు మరో యువ క్రికెటర్‌ నిలువెత్తు ఫొటోను సైతం ఆసీస్‌ పత్రికలు ప్రచురించడం విశేషం. అతడు మరెవరో కాదు.. యశస్వి జైస్వాల్‌.

‘నవం రాజా’గా యశస్వి
అవును.. టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం నుంచే సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఈ ముంబై బ్యాటర్‌కు కూడా ఆస్ట్రేలియా మీడియా ప్రాధాన్యం ఇచ్చింది. ‘నవం రాజా’(కొత్త రాజు) అంటూ యశస్వికి కితాబులిచ్చింది. 

ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే, మరో టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ అభిమానులు మాత్రం వీటిని చూసి చిన్నబుచ్చుకుంటున్నారు.

హర్ట్‌ అవుతున్న పంత్‌ అభిమానులు
ఆస్ట్రేలియాలో టీమిండియా గత బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ గెలవడంలో కీలకమైన ఈ వికెట్‌ కీపర్‌కు మాత్రం సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా 2020-21 పర్యటనలో గాబా టెస్టులో అద్భుత ఇన్నింగ్స్‌(89 నాటౌట్‌)తో ఆకట్టుకున్న పంత్‌.. భారత్‌ 2-1తో సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.  

ఇదిలా ఉంటే..  జైస్వాల్‌ ఇప్పటి వరకు14 టెస్టులు ఆడి 1407 రన్స్‌ చేశాడు. ఇందులో మూడు శతకాలు, రెండు డబుల్‌ సెంచరీలు ఉండటం విశేషం.

చదవండి: CT 2025: పాకిస్తాన్‌ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement