
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. గురువారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. అయితే భారత్ విజయం సాధించినప్పటికి ఛేజింగ్‌లో మాత్రం కాస్త తడబడిందనే చెప్పాలి.
ఎందకంటే 229 పరుగుల టార్గెట్‌ను చేధించేందుకు భారత్ ఏకంగా 46.3 ఓవర్ల సమయం తీసుకుంది. లక్ష్య చేధనలో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. రోహిత్ శర్మ ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్‌లో స్పీడ్ తగ్గింది. 30 ఓవర్లు ముగిసే సరికి 144/4 స్కోరుతో భారత్ ఇబ్బందుల్లో పడేలా కనిపించింది.
కానీ శుబ్‌మన్ గిల్(101), కేఎల్ రాహుల్(41) ఆచితూచి ఆడుతూ భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. తాజాగా ఈ స్లో రన్ ఛేజింగ్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఇంకాస్త ముందుగానే టార్గెట్‌ను చేధిస్తుందని భావించానని సెహ్వాగ్ అన్నాడు.
"బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అభిమానులు టెన్షన్ పడి ఉంటారు నేను అనుకోను. ఎందుకంటే ప్రత్యర్ధిగా ఉన్నది బంగ్లాదేశ్. మీరు బంగ్లాను చాలా అద్భుతమైన జట్టుగా నాతో పొగిడించు కోవాలనుకుంటున్నారా? అలా జరగాలంటే వారు ఆట తీరులో మార్పు రావాలి.
బంగ్లాదేశ్‌తో ఆడేటప్పుడే నేను భయపడలేదు, ఇప్పుడు ఇంకా ఏమి భయపడతాను. టెన్షన్ పడడానికి ప్రత్యర్ది ఏమైనా పాకిస్తానా..? ఆస్ట్రేలియానా? ఇది చాలా ఈజీ మ్యాచ్. దాదాపు నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించారు. గిల్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
తొలుత దూకుడుగా ఆడిన గిల్.. ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా ఆడాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేదా శ్రేయాస్ అయ్యర్ ఎక్కువసేపు క్రీజులో ఉండి ఉంటే, ఈ మ్యాచ్లో 35 ఓవర్లలోనే ముగిసి ఉండేదని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment